Share News

కాంట్రాక్టర్లతో అండర్‌ స్టాండింగ్‌!

ABN , Publish Date - Dec 05 , 2025 | 01:30 AM

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ తీరు వివాదాస్పదమవుతోంది. కమిటీ ఆమోదం పొందాల్సిన బిల్లులు, ఆశీలు వసూలు టెండర్లు అప్పగింత కోసం కొందరు సభ్యులు భారీగా కమీషన్లు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కాంట్రాక్టర్లతో అండర్‌ స్టాండింగ్‌!

వివాదాస్పదంగా స్టాండింగ్‌ కమిటీ తీరు

బిల్లుల చెల్లింపునకు 12 శాతం కమీషన్‌ డిమాండ్‌ చేస్తున్నట్టు కొందరు సభ్యులపై ఆరోపణలు

రేపు జరగనున్న సమావేశం అజెండాలో 257 అంశాలు

ఓ కాంట్రాక్టర్‌ నుంచి సభ్యురాలి భర్త రూ.14 లక్షలు తీసుకున్నట్టు జీవీఎంసీలో ప్రచారం

విశాఖపట్నం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ తీరు వివాదాస్పదమవుతోంది. కమిటీ ఆమోదం పొందాల్సిన బిల్లులు, ఆశీలు వసూలు టెండర్లు అప్పగింత కోసం కొందరు సభ్యులు భారీగా కమీషన్లు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ హయాంలో మొదటి ఏడాది రెండు శాతం, తర్వాత రెండేళ్లు నాలుగు శాతం కమీషన్లు వసూలుచేస్తే, ఇప్పుడు ఏకంగా 12 శాతానికి పెంచేశారని కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు.

జీవీఎంసీ పరిధిలో రూ.50 లక్షలలోపు విలువైన పనులకు టెండర్లు పిలిచేందుకు అనుమతి ఇవ్వడం, ఆయా పనులు పూర్తయితే బిల్లు చెల్లింపునకు ఆమోదం తెలపడం, ఉద్యోగుల సర్వీసు మేటర్లకు సంబంధించిన అంశాలను అనుమతించడం, మార్కెట్లు, రోడ్డు మార్జిన్లులో ఆశీలు వసూలు, ఖాళీగా ఉన్న దుకాణాలకు వేలం నిర్వహించడం వంటి వాటికి స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తప్పనిసరి. ఆయా అంశాలను ఆమోదించేందుకు స్టాండింగ్‌ కమిటీ పేరుతో కొందరు సభ్యులు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈనెల ఆరున జరగబోయే స్టాండింగ్‌ కమిటీ సమావేశానికి 257 అంశాలతో అజెండా తయారుచేశారు. అందులో కొన్ని మినహా మిగిలిన అంశాలన్నీ యోగాంధ్ర కార్యక్రమం కోసం చేసిన ఏర్పాట్లు, అభివృద్ధి పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు, జీవీఎంసీ స్థలాలు, దుకాణాలను అద్దెకు కేటాయించడం, పారిశుధ్య నిర్వహణ కోసం తాత్కాలిక ప్రాతిపదికన నియమించిన కార్మికులకు జీతాల చెల్లింపునకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఆయా అంశాలను ఆమోదించడం వల్ల కాంట్రాక్టర్లకు మేలు జరుగుతుంది కాబట్టి, తమ సంగతి ఏమిటని స్టాండింగ్‌ కమిటీ సభ్యులు కొంతమంది...అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది. ఆయా అధికారులు సంబంధిత కాంట్రాక్టర్లను పిలిచి ‘మీ అంశాలను స్టాండింగ్‌ కమిటీ ఆమోదానికి పెట్టాం. అక్కడ ఆమోదం పొందాలంటే స్టాండింగ్‌ కమిటీ సభ్యులను కలిసి మాట్లాడుకోండి’ అని సూచించినట్టు సమాచారం. దీంతో ఆయా కాంట్రాక్టర్లు ప్రస్తుత స్టాండింగ్‌ కమిటీ వ్యవహారాలను చక్కబెట్టడంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఒక సభ్యుడితోపాటు మరో సభ్యురాలి భర్తను కలిసి తమ అంశాలను కమిటీ సమావేశంలో ఆమోదించాలని కోరారు. దీనికి స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు, మరో సభ్యురాలి భర్త తమకు 12 శాతం కమీషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్టు కొందరు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. గత సమావేశంలో పది శాతం కమీషన్‌ ఉండేది కదా?...అని సంబంధిత కాంట్రాక్టర్లు ప్రశ్నించగా, మరో మూడు నెలల్లో తమ పదవీకాలం అయిపోతుందని, స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో తాము ఒక్కొక్కరం రూ.ఐదేసి లక్షలు ఖర్చుపెట్టామని, ఆ డబ్బులు తిరిగి రాబట్టుకోకపోతే ఎలా?...అని ఎదురు ప్రశ్నించినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇప్పుడు తాము తిరస్కరిస్తే మరో రెండు నెలల వరకు అజెండాలోకి రాదని పరోక్షంగా బెదిరించడంతో ఆయా కాంట్రాక్టర్లు 12 శాతం కమీషన్‌ ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలిసింది. యోగాంధ్ర కోసం రోడ్లు, ఫుట్‌పాత్‌ల మరమ్మతు పనులు చేసిన కాంట్రాక్టర్‌ ఒకరికి రూ.1.2 కోట్లు బిల్లు చెల్లించాల్సి ఉండడంతో...అతని వద్ద స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలి భర్త రూ.14 లక్షలు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. స్టాండింగ్‌ కమిటీలోని 257 అంశాల అజెండాకు సంబంధించి గురువారం నాటికి రూ.15 లక్షలు వసూలుకాగా, శుక్రవారం నాటికి మరో రూ.పది లక్షలు వరకు వసూలవుతుందని సభ్యులు అంచనా వేస్తున్నట్టు కార్పొరేటర్లు కొందరు చెబుతున్నారు. ఇదికాకుండా జీవీఎంసీలో కీలక ప్రజా ప్రతినిధి పేరుతో ప్రైవేటు వ్యక్తి ఒకరు అదనంగా వసూళ్లకు పాల్పడుతున్నట్టు కాంట్రాక్టర్లు గగ్గోలుపెడుతున్నారు. స్టాండింగ్‌ కమిటీ పేరుతో 12 శాతం కమీషన్‌ తీసుకున్నారని చెబితే, దాంతో తమకు సంబంధం లేదని సమాధానం అంటున్నారని, బిల్లులు రాకపోతే వడ్డీల భారం పెరిగిపోతుంది కాబట్టి, ఎందుకొచ్చిన తలనొప్పి అనే భావనతో అడిగినంత ఇచ్చేస్తున్నామని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.

Updated Date - Dec 05 , 2025 | 01:30 AM