Share News

వెండి వితరణలపై తేలని లెక్కలు

ABN , Publish Date - Aug 15 , 2025 | 01:25 AM

కనకమహాలక్ష్మీ ఆలయంలో వెండి తాపడం లెక్కలు తేల్చడంలో దేవదాయ శాఖ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు.

వెండి వితరణలపై తేలని లెక్కలు

  • ఫిర్యాదు చేసి పది నెలలైనా స్పందన శూన్యం

  • విచారణలో ఉన్నతాధికారుల జాప్యం

  • కనకమహాలక్ష్మి ఆలయానికి గతంలో 6.3 కిలోల వెండి ఇచ్చిన యూబీఐ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కనకమహాలక్ష్మీ ఆలయంలో వెండి తాపడం లెక్కలు తేల్చడంలో దేవదాయ శాఖ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. నగరంలో ప్రముఖ షాపింగ్‌ మాల్‌ అధినేత గత నవంబరులో తనకు జరిగిన అన్యాయంపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఇంతవరకూ దానిని పట్టించుకోలేదు. అమరావతిలో దేవదాయ శాఖ కమిషనర్‌ నుంచి విశాఖలో ఆలయ ఈఓ వరకూ ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. దీని నుంచి ఎవరినో కాపాడాలని అంతా యత్నిస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జ్యోతి మాధవి ఆలయ ఈఓగా ఉన్న సమయం (2021)లో అమ్మవారి విగ్రహం వెనుక వెండి తాపడం (మకర తోరణం) కొత్తది చేయిస్తామని ప్రకటించగా, అనేకమంది దాతలు ముందుకు వచ్చారు. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికారులు 6.3 కిలోల వెండి బిస్కెట్లు ఈవో జ్యోతి మాధవి ఇచ్చారు. ఈ అంశం పత్రికల్లో కూడా ప్రచురితమైంది. ఆ తరువాత మరికొందరు కూడా వెండి విరాళంగా ఇచ్చారు. షాపింగ్‌మాల్‌ అధినేత వెండి తాపడాన్ని 60.830 కిలోలతో తయారుచేయించారు. అందుకోసం ఆయనకు ఆలయ వర్గాలు 28.500 కిలోలు వెండిని వివిధ రూపాల్లో ఇచ్చాయి. ఇంకా 38.413 కిలోల వెండి తమకు రావాలని ఆ షాపింగ్‌ మాల్‌ అధినేత దఫదఫాలుగా కోరారు. ప్రతి స్పందన లేకపోవడంతో గత ఏడాది నవంబరు ఆరో తేదీన షాపింగ్‌ మాల్‌ లెటర్‌ హెడ్‌పై ఆలయ ఈఓకు సవివరంగా లేఖ రాశారు. బకాయి వెండితో పాటు తయారీ చార్జీలుగా రూ.6,08,300 ఇవ్వాల్సి ఉందని, దీనిని నిర్ణయించి వీలైనంత త్వరగా చెల్లించాలని కోరారు. దీనిపై సమాధానం లేదు.

వెండి లెక్కలు తేలడం లేదని చర్చ ప్రారంభం కావడంతో ఈ నెల మొదటి వారంలో ఆలయ మాజీ ధర్మకర్త ఒకరు దేవదాయ శాఖ కమిషనర్‌కు ఆలయంలో జరిగిన వెండి కుంభకోణంపై లేఖ రాశారు. అందులో యూనియన్‌ బ్యాంక్‌ ఇచ్చిన 6.3 కిలోల వెండి బిస్కెట్ల గురించి పేర్కొన్నారు. వారికి కూడా అధికారులు రశీదు ఇవ్వలేదని ఆరోపించారు. ఆలయ సిబ్బందిలో ముగ్గురికి పదేళ్లు సర్వీసు పూర్తయినందుకు వారిని రెగ్యులర్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని, వారికి ఎరియర్స్‌ రూపంలో రూ.30 లక్షల వరకు రాగా, వారికి తలా కొంత ఇచ్చి, మిగిలింది అప్పుడు పనిచేసిన ఆలయ అధికారులు పంచుకున్నారని ఆరోపించారు. దీనిపై డిప్యూటీ కమిషనర్‌ విచారణ చేసి ఐదు నెలలైనా ఎటువంటి చర్యలు చేపట్టలేదని కూడా పేర్కొన్నారు. వీటిపై విచారణ వేగవంతం చేసి కారకులపై చర్యలు తీసుకోవడమే కాకుండా, వెండిని రికవరీ చేయాలని కోరారు.

ఆలయ అధికారులు, దేవదాయ శాఖ అధికారులు ఈ వెండి విషయంపై పెదవి విప్పడం లేదు. విచారణ జరుగుతున్నని చెబుతున్నారే తప్ప దానిని ఎప్పటికి ముగిస్తారో వెల్లడించడం లేదు. డిప్యూటీ కమిషనర్‌ ఐదు నెలల క్రితమే విచారణ చేపట్టినట్టు మాజీ ధర్మకర్త ఫిర్యాదు ద్వారా వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా షాపింగ్‌మాల్‌ అధినేత ఫిర్యాదు చేసి పది నెలలైందని తేలింది. పాత ఈఓల ద్వారా వెండి లెక్కలు ప్రస్తుత ఈఓ శోభారాణికి వారం క్రితం అప్పగించారు గానీ ఈ మకర తోరణం లెక్కలు తేల్చకపోవడం గమనార్హం. ఎవరినో ఈ కేసు నుంచి తప్పించడానికి అంతా కలసి యత్నిస్తున్నారనేది మాత్రం వాస్తవం.

Updated Date - Aug 15 , 2025 | 01:25 AM