‘గోవాడ’పై అనిశ్చితి
ABN , Publish Date - Sep 30 , 2025 | 01:11 AM
చెరకు రైతులు, షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు ఊహించినట్టుగానే గోవాడ షుగర్స్ మహాజన సభను అధికారులు నిరవధికంగా వాయిదా వేశారు.
షుగర్స్ మహాజన సభ నిర్వహణకు నేటితో ముగియనున్న గడువు
నోరు మెదపని అధికారులు
రైతులు, కార్మికులకు రూ.36 కోట్ల మేర బకాయిలు
నిధుల కోసం ప్రభుత్వానికి ఫ్యాక్టరీ చైర్మన్ ప్రతిపానదలు
చెరకు క్రషింగ్‌పై ఇంతవరకు రాని స్పష్టత
దిక్కుతోచని స్థితిలో రైతులు, కార్మికులు
చోడవరం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి):
చెరకు రైతులు, షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు ఊహించినట్టుగానే గోవాడ షుగర్స్ మహాజన సభను అధికారులు నిరవధికంగా వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరులోగా మహాసభను నిర్వహించాలి. మంగళవారంతో గడువు ముస్తున్నది. మహాజన సభ ఏర్పాటుపై అధికారులు ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో నిరవధికంగా వాయిదాపడినట్టయ్యింది. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో మహాజన సభ ఇక లేనట్టే అన్నది స్పష్టంగా తేలిపోయింది.
రాష్ట్రంలో సహకార రంగంలో నడుస్తున్న ఏకైక షుగర్ ఫ్యాక్టరీ గోవాడ మాత్రమే. సవాలక్ష కారణాలతో ఈ ఫ్యాక్టరీని కూడా చరిత్ర పుటల్లోకి చేర్చేస్తున్నారు. ఒకప్పుడు సహకార రంగంలో అగ్రగామిగా వున్న గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి సుమారు పదేళ్ల నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఇక్కడ పంచదార ఉత్పత్తి వ్యయంతో పోలిస్తే మార్కెట్‌లో ధర తక్కువ వుండడంతో క్రమేపీ నష్టాలు పెరిగిపోయాయి. మరోవైపు ఫ్యాక్టరీ చెల్లించే మద్దతు ధర గిట్టుబాటు కాకపోవడంతో రైతులు చెరకు సాగును తగ్గించడంతో క్రషింగ్ లక్ష్యం ఏటేటా తగ్గిపోతున్నది. 2023-24, 2024-25 సీజన్‌లలో ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసిన రైతులకు రవాణా చార్జీలతో కలిసి సుమారు రూ.29 కోట్లు చెల్లించాల్సి వుంది. కార్మికులకు ఐదు నెలల వేతన బకాయిలు, పదవీ విరమణ చేసిన సిబ్బందికి గ్రాట్యుటీ, ఇతరత్రా కలిపి రూ.7 కోట్ల వరకు అందాల్సి వుంది. ఫ్యాక్టరీకి వివిధ రకాల వస్తువులు, రసాయనాలు సరఫరాచేసిన వారికి రూ.3 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో వున్నాయి. అన్నీ కలిపి రూ.40 కోట్ల మేర బకాయిలు వున్నాయి. ఫ్యాక్టరీ గోదాముల్లో 50 వేల క్వింటాళ్ల పంచదార, మొలాసిస్ ఉన్నాయి. వీటిని విక్రయిస్తే రూ.10 కోట్లకు మించే వచ్చే పరిస్థితి లేదు. అయినా సరే బకాయిలు తీర్చాలంటే ఇంకా రూ.30 కోట్లు అవసరం. మరోవైపు ఫ్యాక్టరీ నిర్వహణ కోసం గతంలో ఆప్కాబ్ నుంచి తీసుకున్న రుణాలు, వాటికి వడ్డీలు కలిపి రూ.50-55 కోట్ల వరకు వుంటాయని ఫ్యాక్టరీ అధికార వర్గాల అంచనా. చెరకు రైతులు, ఫ్యాక్టరీ కార్మికులకు బకాయిల చెల్లింపు కోసం నిధులు విడుదల చేయాలని ఫ్యాక్టరీ చైర్మన్ హోదాలో కలెక్టర్ విజయకృష్ణన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. చెరకు రైతుల బకాయిల వరకు నిధులు విడుదల చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఎప్పుడు వస్తాయనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. నిధుల మంజూరుకు సంబంధించిన ఫైలు ఇంకా అమరావతిలోనే ఉండడం, షుగర్ ఫ్యాక్టరీని నడపడంపై ఉన్నతస్థాయిలో చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో మహాజన సభను ఇప్పట్లో నిర్వహించకూడదని అధికారులు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో ఇథనాల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని అధికార కూటమికి చెందిన ప్రజాప్రతినిధులు గతంలో పలుమార్లు ప్రకటించడంతో షుగర్ ఫ్యాక్టరీ భవిష్యత్తు ఏమిటన్నదానిపై త్వరలోనే ఒక స్పష్టత వస్తుందని భావించారు. సెప్టెంబరులో నిర్వహించే మహాజన సభలో ప్రకటన వెలువడుతుందని ఊహించారు. కానీ మహాజన సభను నిర్వహించే పరిస్థితులు కానరావడంలేదు. మహాజన సభ నిర్వహిస్తారని, ఫ్యాక్టరీ భవితవ్యంతోపాటు, తమ బకాయిల గురించి చర్చించేందుకు అవకాశం ఉంటుందని భావించిన రైతులు, కార్మికులు నిరాశ చెందుతున్నారు. మరోవైపు ఫాక్టరీ పరిధిలోని చెరకు, పొరుగు జిల్లాలోని ప్రైవేటు ఫ్యాక్టరీకి తరలింపుపై అధికారులు ఇప్పటికే చర్చలు జరిపారు. ఇటు చూస్తూ మహాజన సభ జరిగే పరిస్థితి లేదు. దీంతో ఈ సీజన్‌లో చెరకు క్రషింగ్ లేనట్టేనని రైతులు, కార్మికులు భావిస్తున్నారు.