అడ్డులేని గ్రావెల్ మాఫియా
ABN , Publish Date - Nov 17 , 2025 | 01:51 AM
మండలంలోని పలు గ్రామాల్లో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది.
‘సబ్బవరం’లో యథేచ్ఛగా ప్రకృతి వనరుల దోపిడీ
అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు తవ్వకాలు, రవాణా
అధికార, విపక్ష నేతలు కుమ్మక్కు
ఫిర్యాదు చేసే వారిపై భౌతిక దాడులు, బెదిరింపులు
గ్రావెల్ రవాణా వాహనాలతో ధ్వంసమవుతున్న బీటీ రోడ్లు
సబ్బవరం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి):
మండలంలోని పలు గ్రామాల్లో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. అర్ధరాత్రి తరువాత నుంచి తెల్లవారుజాము వరకు గ్రావెల్ తవ్వి, తరలించుకుపోతున్నారు. కొండపోరంబోకు భూములు, పేదలకు ఇళ్ల కోసం వేసిన లేఅవుట్లను ఆనుకొని గ్రావెల్ దందా సాగిస్తున్నారు. అధికారంలో కూటమి నేతలు, ప్రతిపక్షంలో వున్న వైసీపీ నేతలు ఒక్కటైపోయి ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు.
మండలంలో గంగవరం, నంగినారపాడు, పైడివాడ, పైడివాడఅగ్రహారం, అసకపల్లి, గాలిభీతమవరం, గొల్లలపాలెంలో వీఎంఆర్‌డీఏ అభివృద్ది చేసిన లే-అవుట్లకు అనుకొని కొండలు, గుట్టలు, ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు. రాత్రి పది గంటల తరువాత ఎక్స్‌కవేటర్ల రాక మొదలవుతుంది. తొలుత పెద్ద మొత్తంతో గ్రావెల్ తవ్వుతారు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో టిప్పర్లు, లారీలు ఆయా ప్రదేశాలకు క్యూ కడతాయి. అప్పటికే తవ్విన గ్రావెల్‌ను ఈ వాహనాల్లోకి శరవేగంగా లోడింగ్ చేస్తారు. తెల్లవారుజామున ఐదు గంటల వరకు గ్రావెల్ తరలిస్తుంటారు. వాస్తవంగా ఇక్కడ గ్రావెల్ త్వకాలకు మైనింగ్ శాఖ ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు. అయినపప్పటికీ అధికారులు ఎవరూ ఇటువైపు కన్నెత్తి అయినా చూడరు. అధికారులకు తెలిసే ఇదంతా జరుగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ‘తిలా పాపం.. తలా పిడికెడు’ అన్నట్టుగా గ్రావెల్ దందా మొత్తం చాపకింద నీరులా సాగిపోతున్నది.
ఫిర్యాదు చేసిన వారిపై దాడులు!
గ్రావెల్ అక్రమ తవ్వకాలపై స్థానికులు ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేస్తే.. వారిపై దాడులకు తెగబడుతున్నారు. ప్రభుత్వం సిబ్బందిని కూడా గ్రావెల్ మాఫియా లెక్కచేయడంలేదు. ఇటీవల అర్ధరాత్రి గ్రావెల్ తవ్వకాలు జరుపుతుండగా అధికారులు దాడి చేస్తున్నారన్న సమాచారంతో అక్రమార్కులు పారిపోయే క్రమంలో ఒక గొర్రెల కాపరని ఎక్సకవేటర్‌తో ఢీకొన్నారు. అనంతరం అధికారులు, రాజకీయ నాయకులు మధ్యవర్తిత్వం చేసి పోలీసు కేసు లేకుండా సెటిల్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. గతంలో గ్రావెల్ తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఒక వీఆర్వోపైకి ఎక్స్‌కవేటర్‌తో దాడికి యత్నించగా, అతను త్రుటిలో తప్పించుకున్నాడు. కానీ ద్విచక్రవాహనం నుజ్జునుజ్జయ్యింది. స్థానిక నాయకులు మధ్యవర్తిత్వం చేసి వీఆర్వోకు కొత్తబైక్ కొనిచ్చి కేసు లేకుండా చేశారు. అధికార, విపక్ష నేతలు ఒక్కటై గ్రావెల్ దందా సాగిస్తుండడంతో అధికారులు పట్టించుకోవడంలేదు.
గ్రావెల్ వాహనాలతో బీటీ రోడ్లు ధ్వంసం
మండలంలోని గంగవరం, నంగినారపాడు గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రతిఫలంగా వీఎంఆర్‌డీఏ అధికారులు కొన్ని ప్లాట్లు ఇచ్చారు. ఈ లేఅవుట్లలో తొలుత గ్రావెల్ రోడ్లు, అనంతరం బీటీ రోడ్లు వేశారు. గ్రావెల్ తరలించే వాహనాలు ఈ రోడ్ల మీదుగా వెళుతుండడంతో ఛిద్రమవుతున్నాయి. వీఎంఆర్‌డీఏ అధికారులు సైతం పట్టించుకోవడంలేదు.