Share News

పుట్టగొడుగుల్లా అనధికార లేఅవుట్లు

ABN , Publish Date - Aug 05 , 2025 | 01:15 AM

జిల్లాలో అనధికార లే-అవుట్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.

పుట్టగొడుగుల్లా అనధికార లేఅవుట్లు

  • అనుమతులు లేకుండా వ్యవసాయ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు

  • ప్లాట్లుగా విభజించి అమ్మకం

  • నాలా పన్ను ఎగనామం

  • ఆదాయం కోల్పోతున్న ప్రభుత్వం

  • పట్టించుకోని పలు శాఖల అధికారులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో అనధికార లే-అవుట్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. రెవెన్యూ శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండా, భూ మార్పిడి పన్ను (నాలా) చెల్లించకుండా దర్జాగా లేఅవుట్లు వేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది. వైసీపీ అధికారంలో వున్నప్పుడు ఆ పార్టీ నేతలు, ఇప్పుడు కూటమి నాయకులు.. రియల్టర్లతో అంటకాగుతూ అక్రమ లేఅవుట్లకు దన్నుగా నిలుస్తున్నారు. వీఎంఆర్‌డీఏ నుంచి అనుమతులు రాకుండానే లేఅవుట్లు వేసి, ప్లాట్లుగా విక్రయిస్తున్నారు.

అనకాపల్లి మండల పరిధిలోని ఆవఖండం భూములు వాస్తవంగా ముంపు ప్రాంతం. భారీ వర్షాలు కురిస్తే నీరు నిలిచిపోయి సముద్రాన్ని తలపిస్తుంది. దీనిని చిత్తడి నేలల (వాటర్‌ బెల్ట్‌) ప్రాంతంగా గుర్తించడంవల్ల లేఅవుట్లకు, భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదు. కానీ అనకాపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడిన తరువాత ఆవఖండం భూములకు గిరాకీ పెరిగింది. గతంలో ఇక్కడ సెంటు రూ.4-5 లక్షలు పలికేది. కొత్త జిల్లా ఏర్పడిన తరువాత క్రమేణా ధరలు పెరుగుతూ.. ప్రస్తుతం సెంటు రూ.10 లక్షలకు చేరింది. దీంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కన్ను ఆవ ఖండం భూములపై పడింది. చిత్తడి నేలలు అయినప్పటికీ నిబంధనలు పట్టించుకోకుడా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేస్తున్నారు. వైసీపీ అధికారంలో వున్నప్పుడు జాతీయ రహదారిని ఆనుకొని వున్న ఆవఖండం భూముల్లో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా భారీ లేఅవుట్‌ వేశారు. దీనిపై పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో లేఅవుట్‌ అభివృద్ధి పనులను కొంతకాలం నిలిపివేశారు. తిరిగి కొద్ది రోజుల నుంచి లేఅవుట్‌లో రహదారుల ఏర్పాటు, భూమి చదును పనులు చేస్తున్నారు. వీఎంఆర్‌డీఏ నుంచి తుది అనుమతులు రాకుండానే ‘ప్రతిపాదిత వీఎంఆర్‌డీఏ’ లేఅవుట్‌ అని ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేసి స్థలాలను విక్రయిస్తున్నారు.

ఇదిలావుండగా అనకాపల్లి నుంచి పాయకరావుపేట వరకు జాతీయ రహదారి పక్కన, సమీపంలో యథేచ్ఛగా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వెలుస్తున్నాయి. నక్కపల్లిలో భారీ పరిశ్రమలు ఏర్పాటు కానుండడంతో రియల్టర్లు ఎస్‌.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తున్నారు. వీరికిలో కొంతమంది ఆయా ప్రభుత్వ శాఖలు, సంస్థల నుంచి అనుమతులు తీసుకోకుండా, లేఅవుట్లు వేస్తున్నారు.

యథేచ్ఛగా లేఅవుట్లు

వ్యవసాయ భూముల్లో ఇళ్ల స్థలాల లేఅవుట్‌ వేయాలంటే ముందుగా పలు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలి. గ్రామాలు అయితే సంబంధిత పంచాయతీ, పట్టణాలు అయితే మునిసిపాలిటీ, నగరాలు అయితే కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ వున్న భూమి విలువకు అనుగుణంగా నాలా (నాన్‌-అగ్రికల్చర్‌ ల్యాండ్‌ కన్వర్షన్‌ యాక్ట్‌) ప్రకారం పన్ను చెల్లించాలి. లేఅవుట్‌ వేయడానికి వీఎంఆర్‌డీఏతోపాటు స్థానిక సంస్థల అనుమతి కోసం దరఖాస్తు చేయాలి. ఆమోదం లభించిన తరువాత నిబంధనల ప్రకారం ఎకరాకు 10 సెంట్ల స్థలాన్ని సామాజిక అవసరాల కోసం వదిలిపెట్టాలి. లేఅవుట్‌ కనెక్టివిటీ రోడ్లు 40 అడుగులు, అంతర్గత రోడ్లు 33 అడుగుల వెడల్పుతో నిర్మించాలి. ఇతర మౌలిక సదుపాయాలు కల్పించిన తరువాత సంబంధిత సంస్థల నుంచి తుది ఆమోదం పొందాలి. ఆ తరువాతే లేఅవుట్‌లో స్థలాలను విక్రయించాలి. కానీ అత్యధిక శాతం రియల్టర్లు ఈ నిబంధనలు పాటించకుండా అక్రమంగతా లేఅవుట్‌లు వేస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే కనిపిస్తున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడంలేదు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందితే, పత్రికల్లో కథనాలు వస్తే.. మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించి రియల్టర్ల నుంచి కొంత మొత్తం కట్టించుకొని చేతులు దులుపుకుంటున్నారు.

క్రమబద్ధీకరణకు అవకాశం

అనధికార లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఆగస్టుకు ముందు అనుమతులు లేకుండా వేసిన వెంచర్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తిస్తుంది. అదే విధంగా ఈ ఏడాది జూన్‌ 30వ తేదీలోపు అనధికార లేఅవుట్‌లకు మర్కెట్‌ విలువలో ఏడు శాతం సొమ్మును ప్రభుత్వానికి చెల్లించి క్రమబద్ధీకరించుకోవచ్చు.

అనధికార లేఅవుట్ల వివరాలు సేకరిస్తున్నాం

ఇ.సందీప్‌, జిల్లా పంచాయతీ అధికారి

జిల్లాలో అనధికార లేఅవుట్‌ల వివరాలను సేకరిస్తున్నాం. వీఎంఆర్‌డీఏ కమిషనర్‌, కలెక్టర్‌ ఆదేశాలతో గ్రామ పంచాయతీ అధికారుల ద్వారా అనుమతి వున్న లేఅవుట్లు, అనధికార లేఅవుట్‌ల గురించి సమాచారాన్ని రపిస్తున్నాం. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం. అనుమతులు లేని లేఅవుట్‌ల యజమానులకు నోటీసులు జారీ చేస్తాం.

Updated Date - Aug 05 , 2025 | 01:15 AM