Share News

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకుల దుర్మరణం

ABN , Publish Date - Nov 10 , 2025 | 12:40 AM

జాతీయ రహదారిపై మండలంలోని గోకులపాడు, లింగరాజుపాలెం గ్రామాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మృతిచెందారు. వీరిలో ఒకరు వ్యవసాయ కూలీకాగా మరొకరు చిరుద్యోగి. ఈ సంఘటనలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకుల దుర్మరణం
ఊడి రంజిత్‌కుమార్‌ (ఫైల్‌ ఫొటో) గింజాల హరీశ్‌ (ఫైల్‌ ఫొటో)

గోకులపాడు, లింగరాజుపాలెం వద్ద ఘటనలు

ఒకరిది ఎలమంచిలోని పెదపల్లి, మరొకరిది ఎస్‌.రాయవరం

ఎస్‌.రాయవరం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై మండలంలోని గోకులపాడు, లింగరాజుపాలెం గ్రామాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మృతిచెందారు. వీరిలో ఒకరు వ్యవసాయ కూలీకాగా మరొకరు చిరుద్యోగి. ఈ సంఘటనలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

ఎలమంచిలి మునిసిపాలిటీ పరిధిలోని పెదపల్లికి చెందిన ఊడి రంజిత్‌కుమార్‌ (28) వ్యవసాయ కూలీ పనులకు వెళుతుంటాడు. ఆదివారం ఉదయం మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంపై కాకినాడ జిల్లా తుని మండలంలోని తలుపులమ్మ లోవకు వెళ్లాడు. సాయంత్రం అక్కడి నుంచి ఎలమంచిలికి బయలుదేరారు. ఎస్‌.రాయవరం మండలం గోకులపాడు వద్దకు వచ్చేసరికి ముందు వెళుతున్న కారును అధిగమించే క్రమంలో అదుపు తప్పి రోడ్డుపై పడిపోయారు. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ వీరిని ఢీకొన్నది. రంజిత్‌కుమార్‌ తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రంజిత్‌కుమార్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

ఇదిలావుండగా ఎస్‌.రాయవరం గ్రామానికి చెందిన గింజాల హరీశ్‌ (20) అడ్డరోడ్డులోని ఒక ద్విచక్ర వాహన షోరూంలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం రాత్రి బైక్‌పై లింగరాజుపాలెం వెళుతున్నాడు. ఈ గ్రామానికి కొద్ది దూరంలో వాహనం అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్నాడు. హరీశ్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు నక్కపల్లి సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా వుండడంతో ప్రథమ చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌ పంపారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ రెండు సంఘటలపై అందిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ విభీషణరావు తెలిపారు.

Updated Date - Nov 10 , 2025 | 12:40 AM