Share News

రెండు టన్నుల రట్టన్‌ కేన్‌ విత్తనాలు స్వాధీనం

ABN , Publish Date - Jun 03 , 2025 | 11:25 PM

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి అటవీ డివిజన్‌లో పెదవలస రేంజ్‌ నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న రెండు టన్నుల రట్టన్‌ కేన్‌ విత్తనాలను నర్సీపట్నం రేంజ్‌ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఇందుకు సంబంధించి రేంజర్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి.

రెండు టన్నుల రట్టన్‌ కేన్‌ విత్తనాలు స్వాధీనం
అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్న రటన్‌ కేన్‌ విత్తనాలు

నర్సీపట్నం, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి అటవీ డివిజన్‌లో పెదవలస రేంజ్‌ నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న రెండు టన్నుల రట్టన్‌ కేన్‌ విత్తనాలను నర్సీపట్నం రేంజ్‌ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఇందుకు సంబంధించి రేంజర్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి.

పెదవలస నుంచి రట్టన్‌ కేన్‌ విత్తనాల లోడుతో బయలుదేరిన వ్యాన్‌ను ఆదివారం గొలుగొండ మండలం చీడిగుమ్మల చెక్‌పోస్టు వద్ద అటవీ సంరక్షణ అధికారి స్వామినాయుడు ఆపారు. డ్రైవర్‌ దగ్గర పెదవలస రేంజర్‌ సంతకంతో తేదీ వేయని సీఎఫ్‌ 140(సీఫీజు) రశీదు ఉంది. ఇంతకు మించి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో ఆరిలోవ అసిస్టెంట్‌ బీట్‌ అధికారి ఎం.రమణకు సమాచారం ఇచ్చారు. ఆయనకు అనుమానం వచ్చి ఈ విషయాన్ని నర్సీపట్నం రేంజ్‌ అధికారి లక్ష్మినర్సు దృష్టికి తీసుకెళ్లారు. వ్యాన్‌ను నర్సీపట్నం కలప డిపోకి తరలించారు. గొలుగొండ మండలం జానకిరామపురం గ్రామానికి చెందిన వ్యాన్‌ డ్రైవర్‌ కొరుప్రోలు సత్తిబాబును రేంజర్‌ విచారించి అతని దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. పెదవలస రేంజ్‌ పరిధిలోని కన్నవరం గ్రామంలో రట్టన్‌ కేన్‌ విత్తనాలను కొనుగోలు చేసినట్టు విచారణతో తేలింది. వీటిని ఎస్‌.రాయవరం మండలం చిన్నగుమ్మలూరు గ్రామానికి, అక్కడి నుంచి ఒడిశాకు రవాణా చేస్తారని డ్రైవర్‌ చెప్పాడు. దేవుళ్ల మాలాధారణ దండల తయారీకి రట్టన్‌ విత్తనాలను పూసలుగా ఉపయోగిస్తారు.

Updated Date - Jun 03 , 2025 | 11:25 PM