Share News

సముద్రంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

ABN , Publish Date - May 20 , 2025 | 01:47 AM

మండలంలో పెంటకోట వద్ద సముద్రంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు.

సముద్రంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

‘పేట మండలం పెంటకోట బీచ్‌లో ఘటన

పాయకరావుపేట రూరల్‌, మే 19 (ఆంధ్రజ్యోతి):

మండలంలో పెంటకోట వద్ద సముద్రంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న మెరైన్‌ పోలీసులు.. గజఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. గంటలపాటు గాలించినా ఆచూకీ లభించలేదు. విద్యార్థుల గల్లంతుకు సంబంధించి సీఐ జి.అప్పన్న అందించిన వివరాలిలా వున్నాయి.

పాయకరావుపేట పట్టణంలోని పాత హరిజనవాడకు చెందిన గంపల తరీశ్‌ (17) ఇంటర్‌ మొదటి సంవత్సరం పూర్తిచేశాడు. ఇతని దగ్గర బంధువైన అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి గ్రామానికి చెందిన పిల్లి అభిలాష్‌ (19) హైదరాబాద్‌లో డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ పూర్తి చేశాడు. వీరిద్దరూ సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి పాయకరావుపేటలోని బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. సాయంత్రం అంతా కలిసి మండలంలోని పెంటకోట బీచ్‌కి వెళ్లారు. సముద్రంలో దిగి సరదాగా గడుపుతుండగా పిల్లి అభిలాశ్‌ ఆకస్మికంగా ఎగిసిన కెరటం ధాటికి నీటిలో మునిగిపోయాడు. ఇతనిని కాపాడేందుకు తరీశ్‌ సముద్రంలో మరింత ముందుకు వెళ్లారు. అయితే అలల తాకిడికి ఇద్దరూ నీటిలో మునిగి గల్లంతయ్యారు. మిగిలిన కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న మెరైన్‌ పోలీసులు, గజఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 20 మంది రెండు గంటలపాటు గాలించినా ఆచూకీ లభించలేదు. చీకటి పడడంతో గాలింపు చర్యలు ఆపేశారు. మంగళవారం ఉదయం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని రప్పించి గాలింపును కొనసాగిస్తామని సీఐ అప్పన్న తెలిపారు.

Updated Date - May 20 , 2025 | 01:47 AM