Share News

మొరాయించిన రెండు ఆర్టీసీ బస్సులు

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:12 AM

సీలేరు మీదుగా నడిపే విశాఖపట్నం ఆర్టీసీ డిపోనకు చెందిన భద్రాచలం- విశాఖపట్నం నైట్‌, డే సర్వీసు బస్సులు మొరాయించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. భద్రాచలం నుంచి విశాఖపట్నం బయలుదేరిన నైట్‌ సర్వీసు బస్సు సాంకేతిక లోపంతో బుధవారం అర్థరాత్రి సీలేరులో ఆగిపోయింది. అలాగే గురువారం ఉదయం భద్రాచలం నుంచి విశాఖపట్నం బయలుదేరిన డే సర్వీసు బస్సు సీలేరు నుంచి నాలుగు కిలోమీటర్లు వెళ్లిన తరువాత ఎర్ర దిబ్బలు వద్ద కారడివిలో డీజిల్‌ లేక నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.

మొరాయించిన రెండు ఆర్టీసీ బస్సులు
డీజిల్‌ లేక సీలేరుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయిన భద్రాచలం- విశాఖపట్నం ఆర్టీసీ బస్సు

- సాంకేతిక లోపంతో ఒకటి, డీజిల్‌ లేక మరొకటి..

- ప్రయాణికులకు తప్పని కష్టాలు

- తరచూ ఇలాగే జరుగుతుండడంపై అసహనం

సీలేరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): సీలేరు మీదుగా నడిపే విశాఖపట్నం ఆర్టీసీ డిపోనకు చెందిన భద్రాచలం- విశాఖపట్నం నైట్‌, డే సర్వీసు బస్సులు మొరాయించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. భద్రాచలం నుంచి విశాఖపట్నం బయలుదేరిన నైట్‌ సర్వీసు బస్సు సాంకేతిక లోపంతో బుధవారం అర్థరాత్రి సీలేరులో ఆగిపోయింది. అలాగే గురువారం ఉదయం భద్రాచలం నుంచి విశాఖపట్నం బయలుదేరిన డే సర్వీసు బస్సు సీలేరు నుంచి నాలుగు కిలోమీటర్లు వెళ్లిన తరువాత ఎర్ర దిబ్బలు వద్ద కారడివిలో డీజిల్‌ లేక నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళ్లే నైట్‌ సర్వీసు బుధవారం అర్థరాత్రి సీలేరులో క్లచ్‌ సిలిండర్‌లో సాంకేతిక లోపాలు తలెత్తి గేర్లు పడకపోవడంతో నిలిచిపోవడంతో ఆర్టీసీ అధికారుల ఆదేశాల మేరకు సీలేరులో ఉన్న సీలేరు- విశాఖపట్నం బస్సులో ప్రయాణికులను విశాఖపట్నం పంపించారు. దీంతో గురువారం ఉదయం ఆరు గంటలకు విశాఖపట్నం వెళ్లాల్సిన బస్సు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే గురువారం ఉదయం ఆరు గంటలకు భద్రాచలంలో బయలుదేరి సీలేరు మీదుగా విశాఖపట్నం వెళ్లే బస్సు సీలేరు దాటిన తరువాత నాలుగు కిలోమీటర్లు వెళ్లే సరికి డీజిల్‌ అయిపోయి కారడవిలో నిలిచిపోయింది. దీంతో సిబ్బంది సీలేరు వచ్చి డిపో మేనేజర్‌కు ఫోన్‌ చేసి బస్సులో డీజిల్‌ అయిపోయి ఆగిపోయిందని సమాచారం ఇచ్చారు. సీలేరు బంక్‌లో 20 లీటర్లు డీజిల్‌ వేయించమని డీఎం ఆదేశించారు. దీంతో క్యాన్‌లో 20 లీటర్ల డీజిల్‌ పోయించుకుని వెళ్లారు. సుమారు గంటన్నర సేపు బస్సు అడవిలో నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోజూ విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్లి తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం చేరేందుకు సరపడా డీజిల్‌ కొట్టి పంపిస్తారు. అయితే తిరుగు ప్రయాణంలో సీలేరుకు సమీపంలోనే డీజిల్‌ అయిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రాచలం వెళ్లే బస్సుకు సరిపడా డీజిల్‌ను డిపోలో కొట్టడంలో తేడా జరిగిందా?, లేక భద్రాచలంలో బస్టాండ్‌లో బస్సు నుంచి డీజిల్‌ ఎవరైనా తీసారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే బస్సు డ్రైవర్లు మాత్రం ఆర్వీనగర్‌ నుంచి పాలగెడ్డ వరకు గల రహదారి పూర్తిగా అధ్వానంగా ఉండడంతో గేర్‌లో వెళ్లడం వలన మైలేజీ రాలేదని చెబుతున్నారు. కండీషన్‌లో ఉన్న బస్సులను ఈ రూట్లో నడపాలని ఈ ప్రాంతీయులు ఎన్ని విన్నపాలు చేసినప్పటికీ ఆర్టీసీ అధికారులు కనీసం స్పందించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 21 , 2025 | 12:12 AM