Share News

నీట మునిగి ఇద్దరి మృతి

ABN , Publish Date - Sep 30 , 2025 | 01:16 AM

మండలంలోని వేర్వేరు ప్రదేశాల్లో సోమవారం నీట మునిగి ఇద్దరు మృతిచెందారు.

నీట మునిగి ఇద్దరి మృతి

రొంగలిపేటలో కలువ పువ్వు కోసం చెరువులో దిగి ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి

బి.కింతాడలో శారదా నదిలో పడి ఫిట్స్‌ బాధితుడు మృత్యువాత

దేవరాపల్లి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని వేర్వేరు ప్రదేశాల్లో సోమవారం నీట మునిగి ఇద్దరు మృతిచెందారు. వీరిలో ఒకరు పదో తరగతి చదువుతున్న విద్యార్థి వున్నారు. ఈ సంఘటనలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

మండలంలోని తెనుగుపూడి శివారు రొంగలిపేటకు చెందిన పెనగంటి మోహన్‌రావు దేవరాపల్లిలోని ఒక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం స్నేహితుడు రొంగలి హేమంత్‌తో కలిసి సమీపంలోని రాజ చెరువు వద్దకు బహిర్భూమికి వెళ్లారు. అనంతరం మోహనరావు చెరువులో కలువ పువ్వును తీయడానికి నీటిలోకి దిగాడు. అక్కడ లోతు ఎక్కువగా వుండడంతో నీటిలో మునిగి పోయాడు. హేమంత్‌కు ఈత రాకపోవడంతో బిగ్గరగా కేకలు వేశాడు. సమీపంలో ఉన్నవారు వచ్చి చెరువులో దూకి మోహనరావు కోసం గాలించారు. కొద్దిసేపటి తరువాత బయటకు తీశారు. 108 అంబులెన్స్‌ సిబ్బంది వచ్చి పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు దేవి, వెంకటరమణ కన్నీరుమున్నీరు అయ్యారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మండలంలోని బి.కింతాడ గ్రామానికి చెందిన భరణికాన అప్పలరాజు (35) సోమవారం ఉదయం బహిర్భూమికని శారదా నది తీరానికి వెళ్లాడు. ఈ సమయంలో అతనికి ఫిట్స్‌ రావడంతో నీటిలో మునిగిపోయాడు. అప్పుడు సమీపంలో ఎవరూ లేకపోవడంతో కాపాడలేకపోయారు. ఎంతసేపైనా అప్పలరాజు ఇంటికి రాకపోవడంతో భార్య రత్నం గ్రామంలో పలువురిని వాకబు చేసింది. చెరువు వైపు వెళ్లినట్టు చెప్పడంతో అక్కడికి వెళ్లగా.. అప్పలరాజు మృతదేహం నీటిలో కనిపించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Sep 30 , 2025 | 01:16 AM