Share News

విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

ABN , Publish Date - Aug 21 , 2025 | 11:33 PM

జి.మాడుగుల మండలంలోని బొయితిలి గ్రామ సమీపంలో విద్యుత్‌ తీగలు తెగి బైక్‌పై వెళుతున్న ఇద్దరిపై పడడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం గురువారం రాత్రి 10 గంటల సమయంలో చోటుచేసుకుంది.

విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
సంఘటనా స్థలంలో మృతులు

ట్రాలర్‌పై కాంక్రీట్‌ మిల్లర్‌ను తరలిస్తుండగా తెగిన విద్యుత్‌ తీగలు

వెనుక బైక్‌పై వస్తున్న ఇద్దరిపై పడడంతో మృతి

పాడేరురూరల్‌, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): జి.మాడుగుల మండలంలోని బొయితిలి గ్రామ సమీపంలో విద్యుత్‌ తీగలు తెగి బైక్‌పై వెళుతున్న ఇద్దరిపై పడడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం గురువారం రాత్రి 10 గంటల సమయంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి జి.మాడుగుల మండలం గౌడుపుట్టు గ్రామానికి చెందిన ప్రత్యక్ష సాక్షి కొర్రా జీవన్‌ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. జి.మాడుగుల మండలం బొయితిలి- కిల్లంకోట మధ్య జరుగుతున్న రోడ్డు పనులు చేసేందుకు నర్సీపట్నం నుంచి ట్రాలర్‌పై కాంక్రీట్‌ మిల్లర్‌ను తరలిస్తున్నారు. బొయితిలి గ్రామ సమీపంలోని గొందిపల్లి చర్చి వద్దకు గురువారం రాత్రి 10 గంటల సమయంలో ట్రాలర్‌ చేరుకుంది. ట్రాలర్‌పై ఉన్న కాంక్రీట్‌ మిల్లర్‌ విద్యుత్‌ తీగలకు తగడంతో తెగిపోయాయి. ఆ విద్యుత్‌ తీగలు ట్రాలర్‌ వెనుక బైక్‌పై వస్తున్న నర్సీపట్నానికి చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లపై పడడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే మృతుల వివరాలు తెలియలేదు. దీనిపై పోలీసులకు బొయితిలి గ్రామస్థులు సమాచారం ఇచ్చారు.

Updated Date - Aug 21 , 2025 | 11:33 PM