లంకెలపాలెం ప్రమాదంలో మరో ఇద్దరి మృతి
ABN , Publish Date - Jun 27 , 2025 | 12:37 AM
లంకెలపాలెం ప్రమాదంలో మరో ఇద్దరి మృతిలంకెలపాలెం ప్రమాదంలో మరో ఇద్దరి మృతి
చికిత్స పొందుతున్నప్పటికీ విషమించిన ఆరోగ్య పరిస్థితి
అనకాపల్లి ఆస్పత్రిలో కంటైనర్ డ్రైవర్ అప్పలరాజు, విశాఖ కేజీహెచ్‌లో రామ్‌కుమార్ మృతి
ఐదుకు చేరిన మరణాలు
లంకెలపాలెం/ కొత్తూరు/ రావికమతం, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి లంకెలపాలెం కూడలి వద్ద ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో మరో ఇద్దరు మృతిచెందారు. ప్రమాదం జరిగిన రోజున ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన విషయం తెలిసింది. బుధవారం రాత్రి ఒకరు, గురువారం ఉదయం మరొకరు మృతిచెందడంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది.
ఈ నెల 23వ తేదీ రాత్రి పదిన్నర గంటల సమయంలో విశాఖపట్నం పోర్టు నుంచి తెలంగాణ రాష్ట్రం సిద్దిపేటకు పప్పుల బస్తాలతో వెళుతున్న లారీ, లంకెలపాలెం జంక్షన్‌లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగి ఉన్న పలు వాహనాలపైకి దూసుకుపోయిన విషయం తెలిసిందే. కంటైనర్ లారీ, మూడు కార్లు, పలు ద్విచక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ సంఘటనలో అనకాపల్లి మండలం రేబాకకు చెందిన పచ్చికూర గాంధీ, అనకాపల్లి గవరపాలేనికి చెందిన కొణతాల అచ్చియ్యయుడు, శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం చెల్లయ్యవలస గ్రామానికి చెందిన వై.ఎర్పప్పడు మృతిచెందారు. మరో 13 మందికి తీవ్రగాయాలు, నలుగురికి స్వల్పగాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారు అనకాపల్లి, విశాఖపట్నంలో పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అనకాపల్లిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాంబిల్లి మండలం వెల్చూరు పంచాయతీ విజయరామపురం అగ్రహారం వీధికి కంటైనర్ డ్రైవర్ రేఖ అప్పలరాజు (30) పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. అప్పలరాజుకు భార్య కుమారి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రావికమతం మండలం కొత్తకోటకు చెందిన సాలాపు రామ్‌కుమార్ (26) గురువారం మృతిచెందాడు. ఇతనితోపాటు ఇదే గ్రామానికి చెందిన తురాల శేషు నర్సీపట్నంలోని చిట్‌ఫండ్ కంపెనీలో పనిచేస్తున్నారు. సోమవారం రికవరీ కోసం ద్విచక్ర వాహనంపై విశాఖపట్నం వెళ్లి తిరిగి వస్తుండగా లంకెలపాలెం వద్ద ప్రమాదానికి గురయ్యారు. రామ్‌కుమార్ నడుము, కుడికాలు తీవ్రంగా దెబ్బతినగా రెండు కిడ్నీలు పనిచేయడంలేదు. దీంతో పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. ఇతనికి తండ్రి సముద్రం, తల్లి లలిత, భార్య బషీర వున్నారు. శేషు ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.