వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:04 PM
మండలంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. వంజంగి మేఘాల కొండను తిలకించేందుకు వెళుతుండగా బైక్ అదుపు తప్పి బాలుడు, అలాగే ఆటో బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతి చెందినట్టు ఎస్‌ఐ ఎల్.సురేశ్ ఆదివారం తెలిపారు.
బైక్ అదుపుతప్పి బాలుడు, ఆటో బోల్తా పడి వ్యక్తి దుర్మరణం
పాడేరురూరల్, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): మండలంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. వంజంగి మేఘాల కొండను తిలకించేందుకు వెళుతుండగా బైక్ అదుపు తప్పి బాలుడు, అలాగే ఆటో బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతి చెందినట్టు ఎస్‌ఐ ఎల్.సురేశ్ ఆదివారం తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
చింతపల్లికి చెందిన మఠం శ్రీరామభద్ర(15) గూడ గ్రామంలో బంధువుల ఇంట్లో ఉంటూ హుకుంపేట మండలం మఠం బీవీవీకే స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. స్నేహితుడు కిల్లో చరణ్‌తో కలిసి ఆదివారం ఉదయం వంజంగి మేఘాల కొండను తిలకించేందుకు బైక్‌పై ఆదివారం వేకువజాము 4 గంటల సమయంలో గూడ గ్రామం నుంచి బయలుదేరాడు. మండలంలోని గబ్బంగి సమీపంలోని బూరిలవాక మలుపు వద్దకు వచ్చేసరికి బైక్ అదుపు తప్పి సిగ్నల్ బోర్డును ఢీకొనడంతో శ్రీరామభద్రకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆ బాలుడిని పాడేరు ఆస్పత్రికి తరలించే సరికి మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మతృదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి
మండలంలోని మినుములూరు గ్రామానికి చెందిన శోభ భీమలింగం(50) శనివారం హుకుంపేట మండలం గేదెలపాడు గ్రామానికి వెళ్లి బంధువు అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అనంతరం శనివారం సాయంత్రం మినుములూరు వెళ్లేందుకు హుకుంపేట నుంచి ఆటోలో వస్తుండగా చింతలవీధి వచ్చే సరికి వెనుక నుంచి బైక్ బలంగా ఢీకొంది. దీంతో ఆటో బోల్తా పడింది. అందులో ఉన్న భీమలింగానికి తీవ్ర గాయాలయ్యాయి. అతనిని పాడేరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం రాత్రి మృతి చెందాడు. మృతదేహానికి ఆదివారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి కారకుడైన బైక్ రైడర్ శామ్యూల్ హుకుంపేట మండలం పాతకోట పంచాయతీ మంగళమామిడి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.