Share News

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ABN , Publish Date - Aug 19 , 2025 | 01:14 AM

జాతీయ రహదారిపై మధురవాడ బస్టాప్‌ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

కొమ్మాది, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి):

జాతీయ రహదారిపై మధురవాడ బస్టాప్‌ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఇందుకు సంబంధించి పీఎం పాలెం సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని జోడుగుళ్లపాలేనికి చెందిన వాసుపల్లి సతీష్‌ (19), శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన సంబాల ఉషారాణి స్నేహితులు. ఉషారాణి ఉద్యోగ అన్వేషణ నిమిత్తం పరదేశిపాలెంలో గదిని అద్దెకు తీసుకుని ఉంటోంది. సతీష్‌కు తల్లి లేదు. పెయింటింగ్‌ పనులు చేసుకుంటూ చేపలుప్పాడ సమీపాన గల కొత్తూరులో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం సతీష్‌, ఉషారాణి ఇద్దరూ ద్విచక్ర వాహనంపై పరదేశిపాలెం నుంచి విశాఖపట్నం రైల్వేస్టేషన్‌కు బయలుదేరారు. మధురవాడ బస్టాప్‌ వద్దకు వచ్చేసరికి లారీని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో అదుపుతప్పి, దాని కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ తెలిపారు.

జోడుగుళ్లపాలెంలో విషాదం

విశాలాక్షినగర్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వాసుపల్లి సతీష్‌ స్వస్థలం జోడుగుళ్లపాలెం. సతీష్‌ తల్లి తొమ్మిదేళ్ల క్రితం మృతిచెందగా, తండ్రి దాస్‌, 17 ఏళ్ల తమ్ముడు ఉన్నారు. సతీష్‌ తల్లి మృతిచెందాక తండ్రి దాస్‌ మరో వివాహం చేసుకుని వీరికి దూరంగా ఉంటున్నాడు. రోడ్డు ప్రమాదంలో సతీష్‌ మృతిచెందడంతో అతడి బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Updated Date - Aug 19 , 2025 | 01:14 AM