రెండు బైక్‌లు ఢీ : ఇద్దరి మృతి
ABN , Publish Date - Aug 22 , 2025 | 10:54 PM
మండలంలోని సోవ్వా రోడ్డుకు ఆనుకుని ఉన్న కొరంజిగుడ మలుపు వద్ద శుక్రవారం రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.
కొరంజిగుడ మలుపు వద్ద ప్రమాదం
గాయపడిన వారిని అరకు
ఆస్పత్రికి తరలించిన స్థానికులు
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు..
కేజీహెచ్‌కు తరలిస్తుండగా మరొకరు మృతి
డుంబ్రిగుడ, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి):
మండలంలోని సోవ్వా రోడ్డుకు ఆనుకుని ఉన్న కొరంజిగుడ మలుపు వద్ద శుక్రవారం రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని సోవ్వా నుంచి అరకు వారపు సంతకు వస్తున్న ద్విచక్రవాహనం.. అరకు నుంచి సోవ్వా వైపు వెళుతున్న ద్విచక్ర వాహనం కొరంజిగుడ మలుపులో బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వారికి సపర్యలు చేసి అరకులోయ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మాలివలస గ్రామానికి చెందిన పాటీ యోగేంద్ర(24) అనే గిరిజన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, ఒడిశా రాష్ట్రానికి చెందిన పూజరి ముకుందు(25) అనే గిరిజన యువకుడు అంబులెన్స్‌లో విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. మృతదేహాన్ని ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లవకుశ అనే యువకుడు గాయాలతో అరకు ఆసుపత్రిలో చికిత్సను పొందుతున్నాడు. ఈ ప్రమాదంపై స్థానిక ఎస్‌ఐ పాపినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.