రూ.1.29 కోట్ల బంగారం, వజ్రాలతో ఇద్దరి అరెస్టు
ABN , Publish Date - Jul 26 , 2025 | 12:58 AM
సుమారు రూ.1.29 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాల (డైమండ్స్)తో పరారైన ఓ డైమండ్ షోరూమ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌తో పాటు మరొకరిని అరెస్టు చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రతబాగ్చి తెలిపారు.
రూ.1.29 కోట్ల బంగారం, వజ్రాలతో ఇద్దరి అరెస్టు
అందులో ఒకరు ఓ డైమండ్ కంపెనీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
మహారాణిపేట, జూలై 25 (ఆంధ్రజ్యోతి):
సుమారు రూ.1.29 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాల (డైమండ్స్)తో పరారైన ఓ డైమండ్ షోరూమ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌తో పాటు మరొకరిని అరెస్టు చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రతబాగ్చి తెలిపారు. శుక్రవారం కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రాంతానికి చెందిన ముదపాక జేజి (49) హైదరాబాద్‌కు చెందిన క్రిష్ డైమండ్ షోరూమ్‌లో ఆరు నెలల క్రితం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా చేరాడు. షోరూమ్‌లోని డైమండ్, బంగారు ఆభరణాల మోడల్స్‌ను విశాఖలోని వివిధ గోల్డ్ షోరూమ్‌లలో చూపించేందుకు అదే సంస్థలో పనిచేస్తున్న బొగ్గు వంశీ అనే మరో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌తో కలసి ఈ నెల మూడో తేదీన విశాఖపట్నం వచ్చారు. ఆర్‌టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న హోటల్‌లో గది తీసుకొని ఇద్దరూ బస చేశారు. ఆరోజు వివిధ షోరూమ్‌లలో ఆభరణాల మోడల్స్ చూపించి తిరిగి తీసుకువచ్చారు. మరుసటిరోజు తెల్లవారుజామున సుమారు ఐదు గంటల సమయంలో తనతో పాటు వచ్చిన వంశీ నిద్రిస్తున్న సమయంలో ముదపాక జేజి ఆభరణాల బ్యాగ్‌తో పరారయ్యాడు. నిద్ర నుంచి లేచి చూసిన వంశీకి జేజితో పాటు ఆభరణాల బ్యాగ్ కనిపించలేదు. సీసీ ఫుటేజీలు పరిశీలించి బ్యాగ్‌తో పరారైనట్టు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీఐ ఉమాకాంత్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఉదయం రైల్వే ట్రాక్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు బ్యాగ్‌తో కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని తనిఖీచేశారు. ఆభరణాలు కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒకరు ముదపాక జేజి కాగా మరొకరి పేరు ఆకుల సత్యనారాయణ. ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.1,29,48,154 విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు కమిషనర్ బాగ్చి పేర్కొన్నారు.
నేడు జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు
విశాఖపట్నం, జూలై 25 (ఆంధ్రజ్యోతి):
జిల్లా ప్రజాపరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశాలు శనివారం జరగనున్నాయి. స్టాండింగ్ కమిటీ సమావేశాలు, సర్వసభ్య సమావేశం ఒకేరోజు (ఈ నెల తొమ్మిదో తేదీన) ఏర్పాటుచేయగా సభ్యులు అభ్యంతరం తెలిపారు. దాంతో స్టాండింగ్ కమిటీ సమావేశాలను 26వ తేదీకి వాయిదావేశారు. ఇదిలావుండగా జడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర (వైసీపీ)తో విభేదాల కారణంగా ఆరోజు సర్వసభ్య సమావేశానికి కూడా సొంత పక్షానికి చెందిన సభ్యులు సగానికిపైగా హాజరుకాలేదు. ఆ తరువాత శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ వద్ద పంచాయితీ జరిగింది. వివాదానికి తెరదించాలని నేతలు సూచించడంతో జడ్పీటీసీ సభ్యులు తాత్కాలికంగా అంగీకరించారు. ఈ నేపథ్యంలో శనివారం జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశాలకు సభ్యులు హాజరయ్యే అవకాశం ఉందని కొందరు వెల్లడించారు. అయితే జడ్పీలో కొందరు ఉద్యోగుల అవినీతిని ప్రశ్నించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఏమి జరుగుతుందో చూడాలి.
సెప్టెంబరు 12 నుంచి పలు రైళ్ల మళ్లింపు
విశాఖపట్నం, జూలై 25 (ఆంధ్రజ్యోతి):
అరక్కోణం జంక్షన్‌లో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టనున్న నేపథ్యంలో పలు రైళ్లను దారిమళ్లించనున్నట్టు విశాఖపట్నం సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. సెప్టెంబరు 12, 19, 26 తేదీల్లో జసిదిహ్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (22306), 13, 20, 27 తేదీల్లో బెంగళూరు-కామాఖ్య ఏసీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12551), 16, 20, 23 తేదీల్లో అగర్తల-బెంగళూరు హంసఫర్ ఎక్స్‌ప్రెస్ (12504), 16, 19, 26న బెంగళూరు-అగర్తల హంసఫర్ ఎక్స్‌ప్రెస్ (12503) రైళ్లు గూడూరు, రేణిగుంట జంక్షన్, తిరుత్తణి, మెల్పక్కం, కాట్పాడి జంక్షన్ మీదుగా రాకపోకలు సాగిస్తాయని డీసీఎం ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లకు తిరుత్తణి వద్ద అదనంగా స్టాపేజ్ కల్పిస్తూ, పెరంబూర్ స్టేషన్‌లో హాల్ట్ తొలగించామన్నారు.