అలజడి సృష్టించిన ఇద్దరి అరెస్టు
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:31 AM
పట్టణంలో శుక్రవారం సాయంత్రం పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దూకుడుగా కారు నడిపి అలజడి సృష్టించిన రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసినట్టు అనకాపల్లి డీఎస్పీ శ్రావణి శనివారం తెలిపారు.
240 కిలోల గంజాయి స్వాధీనం
- మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు
అనకాపల్లి నవంబరు 22(ఆంఽధ్రజ్యోతి): పట్టణంలో శుక్రవారం సాయంత్రం పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దూకుడుగా కారు నడిపి అలజడి సృష్టించిన రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసినట్టు అనకాపల్లి డీఎస్పీ శ్రావణి శనివారం తెలిపారు. శనివారం మధ్యాహ్నం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్రం భిల్వారా జిల్లాకు చెందిన దినేశ్ చౌదరి, రాజాసమల్ జిల్లాకు చెందిన తులసీరామ్ బలాయ్‌లు 240 కిలోల గంజాయిని ఏజెన్సీ ప్రాంతం నుంచి రాజస్థాన్‌కు కారులో తీసుకు వెళుతున్నారన్నారు. స్థానిక సీఐ అప్పలరాజు, ఎస్‌ఐ నాగకార్తీక్‌లు వాహనాలు తనిఖీ చేస్తుండగా. ఈ ఇద్దరూ దూకుడుగా కారు నడిపి వాహనదారులను ఢీకొట్టి పరారయ్యేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారని చెప్పారు. ఈ కారుతో పాటు అందులో ఉన్న 240 కిలోల గంజాయిని, సెల్‌ఫోన్ల స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ముఠాలో కీలకమైన అసిఫ్, రాజేశ్, రమేశ్ అనే మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా పోలీసు బృందాన్ని నియమించినట్టు చెప్పారు. పోలీసులను హతమార్చేందుకు ప్రయత్నించడంతో పాటు, వాహనదారులను ఢీకొట్టి చంపి తప్పించుకునేందుకు ప్రయత్నించిన నిందితులపై హత్యాయత్నం సెక్షన్‌తో పాటు, ఎన్‌డీపీసీ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేశామన్నారు. వీరిని జడ్జి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని ఆమె తెలిపారు. ఈ కే సులో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న పోలీసులను ఆమె అభినందించారు. విలేకరుల సమావేశంలో సీఐ అప్పలరాజు, కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ నాగకార్తీక్, సిబ్బంది పాల్గొన్నారు.