టీడీపీ కార్యాలయానికి రెండు ఎకరాలు కేటాయింపు
ABN , Publish Date - May 06 , 2025 | 11:25 PM
తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి పట్టణంలో రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్
అనకాపల్లి, మే 6 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి పట్టణంలో రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పార్టీ జిల్లా కార్యాలయం నిర్మాణం కోసం భూమి కేటాయించాలంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు గత ఏడాది జూలై 22న కలెక్టర్ విజయకృష్ణన్‌కు దరఖాస్తు చేశారు. దీనిని పరిశీలించిన కలెక్టర్.. అనకాపల్లి మండలం తుమ్మపాల రెవెన్యూ పరిధి సర్వే నంబరు 608/1లో రెండు ఎకరాలను కేటాయించారు. ఎకరాకు ఏడాదికి రూ.1,000 అద్దె చొప్పున 33 సంవత్సరాల పాటు లీజుకు ఇస్తూ గత నెల 28న ఉత్తర్వులు జారీ చేశారు. కాగా జిల్లాలో అనేక ప్రభుత్వ కార్యాలయాలకు సొంత గూడు లేక అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ జిల్లా కార్యాలయానికి ప్రభుత్వ భూమి కేటాయించడం ఏమిటంటూ ప్రజా సంఘాల నాయకులు తప్పుబడుతున్నారు. కాగా టీడీపీ కార్యాలయానికి భూమి కేటాయింపుపై అనకాపల్లి తహసీల్దారు విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా, ప్రభుత్వ జీవో ప్రకారమే భూమి కేటాయింపు జరిగిందని, ఇందులో ఎటువంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదన్నారు.