ఏజెన్సీలో తుల్డా వెదురు, అంకుడు
ABN , Publish Date - Jun 13 , 2025 | 01:07 AM
ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ రైతులతో తుల్డా వెదురు, అంకుడు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు అటవీ శాఖ అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. ఆదివాసీలకు వెదురు ఆధారిత స్వయం ఉపాధి అవకాశాలు మెరుగు పర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అటవీ శాఖను ఆదేశించారు.
గిరిజన రైతులతో సాగు చేయించేందుకు అటవీ శాఖ ప్రణాళిక
త్రిపుర రాష్ట్రం నుంచి తుల్డా వెదురు విత్తనాలు దిగుమతి
అటవీ శాఖ నర్సరీల్లో అభివృద్ధి
వచ్చే ఏడాది గిరిజన రైతులకు పంపిణీ
భవిష్యత్తులో స్వయం ఉపాధి కల్పనకు వెదురు అల్లికల తయారీపై శిక్షణ
ఏటికొప్పాక హస్తకళాకారులకు అంకుడు కర్ర సరఫరా
ఆదివాసీలకు ఆర్థిక ఆసరా
చింతపల్లి, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ రైతులతో తుల్డా వెదురు, అంకుడు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు అటవీ శాఖ అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. ఆదివాసీలకు వెదురు ఆధారిత స్వయం ఉపాధి అవకాశాలు మెరుగు పర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అటవీ శాఖను ఆదేశించారు. దీంతో అటవీ శాఖ అధికారులు త్రిపుర రాష్ట్రం నుంచి తుల్డా రకం వెదురు విత్తన మొక్కలను దిగుమతి చేసుకుని నర్సరీలను అభివృద్ధి చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి గిరిజన రైతులకు మొక్కలను అందజేయనున్నారు.
వెదురు వస్తువుల తయారీకి తుల్డా రకం వెదురు అనువైంది. అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక హస్త కళాకారులు అంకుడు కర్రతో బొమ్మలు తయారు చేస్తున్నారు. దీంతో తుల్డా వెదురు, అంకుడు కలపకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ మొక్కల సాగు, చెట్ల పెంపకానికి ఏజెన్సీ ప్రాంతం అనుకూలమని ప్రాథమికంగా గుర్తించారు. దీంతో ఈ ప్రాంతంలో తులడ వెదురు, అంకుడు మొక్కలను పెంచడం వల్ల ఆదివాసీలకు మంచి ఆదాయం వస్తుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
చింతపల్లి, పాడేరు అడవుల్లో, పంట పొలాల గట్లపైన దేశవాళి వెదురు ఏపుగా పెరుగుతుంది. దీనిని సాధారణ అల్లికలు, పేపర్ తయారీకి వినియోగిస్తున్నారు. కానీ తుల్డా వెదురుతో విభిన్న రకాల వెదురు వస్తువులు తయారు చేయవచ్చు. వీటికి దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. తుల్డా వెదురు ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర ప్రాంతంలోనే అధికంగా పెరుగుతుంది.
తులడ వెదురు పెంపకానికి ప్రాధాన్యం
అటవీ శాఖ అధికారులు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ రైతులతో తుల్డా వెదురు పెంపకానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. నర్సరీల అభివృద్ధికి అంట్లును (విత్తనం మొక్కలు) నెల రోజుల క్రితం త్రిపుర నుంచి విమానంలో తీసుకొచ్చారు. వీటిని పాడేరు, చింతపల్లి అటవీ శాఖ డివిజన్ల పరిధిలో పదేసి బెడ్స్ చొప్పున నర్సరీలు పెంచుతున్నారు. ప్రస్తుతం నర్సరీలో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. రానున్న ఐదేళ్లలో తుల్డా వెదురు సాగు విస్తీర్ణం గణనీయంగా పెంపొందించాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు.
అంకుడు నర్సరీలు..
ఏటికొప్పాక హస్తకళాకారులు లక్క బొమ్మల తయారీకి వినియోగించే అంకుడు కర్ర కోసం పెద్ద సంఖ్యలో చెట్లను పెంచాలని అటవీ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్‌కల్యాణ్ గత ఏడాది అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో అంకుడు నర్సరీలను వచ్చే నెల ప్రారంభించనున్నారు. ఏజెన్సీ ప్రాంత అడవుల్లో అంకుడు చెట్లు తక్కువ వున్నాయి. గిరిజన రైతులు పొలాల్లో అంకుడు మొక్కలను పెంచుకోవడం ద్వారా కలపను విక్రయించుకొని ఆదాయం పొందవచ్చు. రైతులకు మొక్కలను పంపిణీ చేసేందుకు నర్సరీలు అభివృద్ధి చేయనున్నారు. చింతపల్లి అటవీ శాఖ డివిజన్ పరిధిలోని ఐదు రేంజ్‌లలో అంకుడు నర్సరీల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఒక్కొక్క రేంజ్‌కు 15 కిలోల చొప్పున అంకుడు విత్తనాలు సమకూర్చారు.
వెదురు అల్లికలపై శిక్షణ
గిరిజనులకు స్వయం ఉపాధి కల్పనకు వెదురు అల్లికలపై రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి శిక్షణ ఇవ్వనున్నది. గిరిజన రైతులు తుల్డా వెదురుతో వివిధ రకాల వస్తువులు తయారు చేసేలా నైపుణ్యం కల్పించనున్నారు. గిరిజనులు వెదురు ఉత్పత్తులు తయారు చేసి పర్యాటక ప్రాంతాలైన లంబసింగి, చింతపల్లి, అరకు, వంజంగి, పాడేరు, అనంతగిరి ప్రాంతాల్లో విక్రయించుకొని ఆదాయం పొందవచ్చు. వెదరు ఉత్పత్తులను ఆన్‌లైన్ మార్కెటింగ్ చేసుకోవడంతోపాటు పట్టణ ప్రాంతాలకు ఎగుమతి చేయవచ్చు. ఇప్పటికే చింతపల్లిలో ఏపీ డిపార్టుమెంట్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్, అచ్యుతాపురం ఎడ్యుకేషనల్ సొసైటీ ఎన్‌జీవో ద్వారా వెదురు అల్లికలపై డైరీ నగర్ గిరిజనులు, డిగ్రీ కళాశాల విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.
వచ్చే ఏడాది మొక్కలు పంపిణీ
వైవీ నరసింహారావు, డీఎఫ్‌వో, చింతపల్లి
గిరిజన రైతులకు వచ్చే ఏడాది తుల్డా వెదురు, అంకుడు మొక్కలను పంపిణీ చేస్తాం. ప్రస్తుతం తుల్డా వెదురు మొక్కలు బెడ్స్‌లో పెంచుతున్నాం. అక్టోబరులో బ్యాగ్స్‌లో నింపి, నర్సరీలు పెంచుతాం. ఏడాది వయస్సు వచ్చిన మొక్కలను 2026 జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయి. ఉపాధి హామీ పథకం, ఐటీడీఏ ద్వారా గిరిజన రైతులకు మొక్కలు అందజేస్తాం. అంకుడు మొక్కలను సైతం ఇదే మాదిరిగా రైతులకు పంపిణీ చేస్తాం.