Share News

ఉపమాకపై టీటీడీ కరుణ

ABN , Publish Date - Dec 23 , 2025 | 01:39 AM

ఉత్తరాంధ్రలో అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రమైన ఉపమాక వెంకన్న ఆలయం అభివృద్ధికి ఎట్టకేలకు టీటీడీ సానుకూలంగా స్పందించింది.

ఉపమాకపై టీటీడీ కరుణ

వెంకన్న ఆలయం అభివృద్ధికి రూ.3.8 కోట్లు మంజూరు

చైర్మన్‌, ఈవోలతో ఫలించిన హోం మంత్రి అనిత చర్చలు

టీటీడీ స్వాధీనం తరువాత ఇంత పెద్ద మొత్తంలో నిధుల కేటాయింపు ఇదే ప్రథమం

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

నక్కపల్లి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి):

ఉత్తరాంధ్రలో అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రమైన ఉపమాక వెంకన్న ఆలయం అభివృద్ధికి ఎట్టకేలకు టీటీడీ సానుకూలంగా స్పందించింది. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కృషితో సుమారు రూ.3.8 కోట్లు మంజూరు చేయడానికి టీటీడీ చైర్మన్‌ ఈవో ఆమోదం తెలిపారు.

తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో వున్నప్పుడు 2015 నవంబరు 18న ఉపమాక వేంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) స్వాధీనపరుచుకుంది. తరువాత 2016, 2017లో ఉపమాక శ్రీవారి వార్షిక కల్యాణోత్సవాల్లో టీటీడీ ఉన్నతాధికారులు హడావిడి చేశారు. జేఈవో స్థాయి అఽధికారి వచ్చి ఉత్సవాలను పర్యవేక్షించారు. స్వామివారి కల్యాణానికి ఒక షెడ్డు, భక్తుల వివాహాలకుఅరకొర సదుపాయాలతో మరో షెడ్డు, రథం ఉంచడానికి చిన్న రేకుల షెడ్డు, కొండపైకి రెయిలింగ్‌ వంటి చిన్నాచితకా పనులు మాత్రమే చేయించారు. ఆ తరువాత ఉపమాక వెంకన్నపై శీతకన్ను వేశారు. వైసీపీ హయాంలో టీటీడీ అప్పటి చైర్మన్‌ సుబ్బారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం వేర్వేరుగా ఇక్కడకు వచ్చి పరిశీలించారు తప్ప.. ఆలయం అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. ఏడాదిన్నర క్రితం కూటమి అధికారంలోకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే, హోం మంత్రి అయిన అనిత.. ఉపమాక ఆలయంలో నెలకొన్న సమస్యలు, చేయాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవోలకు స్వయంగా అందించారు. తన నియోజకవర్గంలో వున్న ఏకైక ప్రాచీన పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. దీంతో ఆరు నెలల కిందట టీటీడీ పాలకమండలి సమావేశంలో ఉపమాక ఆలయం అభివృద్ధి విషయమై చర్చించి తీర్మానం చేశారు. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో డిసెంబరు 3వ తేదీన ‘ఉపమాక క్షేత్రంపై టీటీడీ చిన్నచూపు’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీంతో మంత్రి అనిత స్పందించారు. ఈ నేపథ్యంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల ఏర్పాట్లపై సోమమవారం సాయంత్రం తిరుమలలో జరిగిన టీటీడీ పాలకమండలి, అధికారుల సమావేశంలో ఆమె కూడా పాల్గొన్నారు. ఉపమాక ఆలయంలో గత ఆరేళ్ల నుంచి అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, పలు సమస్యలు అపరిష్కృతంగా వున్నాయని టీటీడీ చైర్మన్‌, ఈవోల దృష్టికి తీసుకొచ్చారు. ఆలయంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులు, ఇతర అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలను వారికి అందజేశారు. దీంతో సానుకూలంగా స్పందించిన టీటీడీ చైర్మన్‌, ఈవోలు.. ఉపమాక క్షేత్రంలో అభివృద్ధి పనుల నిమిత్తం రూ.3.8 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఉపమాక ఆలయాన్ని టీటీడీ స్వాధీనం చేసుకున్న తరువాత ఇంతపెద్ద మొత్తంలో నిధులు మంజూరు కావడం ఇదే ప్రథమమని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిధులతో కొండపైన ఆలయం విస్తరణ, కొండ దిగువున కల్యాణమండపం నిర్మాణం, పుష్కరిణి అభివృద్ధి వంటి పనులు చేపట్టే అవకాశం వుందని అంటున్నారు.

Updated Date - Dec 23 , 2025 | 01:39 AM