అసంపూర్తి దారితో అవస్థలు
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:20 AM
రోడ్లు, భవనాల శాఖ అధికారుల నిర్లక్ష్యం వాహనచోదకులకు శాపంగా మారింది. పాలకులు మారినా అధికారుల తీరు మాత్రం మారడం లేదనే విమర్శలకు బలం చేకూరుస్తోంది. దీనికి జిల్లా కేంద్రంలోని కొత్త పాడేరు రోడ్డు దుస్థితే ఉదాహరణగా నిలిచింది.
మూడు నెలలుగా ముందుకు సాగని కొత్త పాడేరు రోడ్డు నిర్మాణం
సీఎం వస్తున్నారని హడావిడిగా ప్రారంభించి అర్ధంతరంగా నిలిపివేసిన వైనం
పట్టించుకోని ఆర్ అండ్ బీ అధికారులు
వంజంగి హిల్స్‌కు వచ్చే పర్యాటకులకు తప్పని అవస్థలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
రోడ్లు, భవనాల శాఖ అధికారుల నిర్లక్ష్యం వాహనచోదకులకు శాపంగా మారింది. పాలకులు మారినా అధికారుల తీరు మాత్రం మారడం లేదనే విమర్శలకు బలం చేకూరుస్తోంది. దీనికి జిల్లా కేంద్రంలోని కొత్త పాడేరు రోడ్డు దుస్థితే ఉదాహరణగా నిలిచింది.
పాడేరు- చింతపల్లి మెయిన్ రోడ్డులోని కాన్వెంట్ కూడలి నుంచి రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం వరకు సుమారు ఒక కిలోమీటరు మేర రోడ్డు మూడు నెలలుగా అసంపూర్తిగా ఉంది. వాస్తవానికి ఈ ఏడాది జూన్ నెలలో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడు లగిశపల్లి పంచాయతీ ఉగ్గంగొయ్యి గ్రామానికి వస్తున్నారని ఈ రోడ్డును ఆర్ అండ్ బీ అధికారులు హడావిడిగా ప్రారంభించారు. అయితే అది ఇప్పటికీ పూర్తి కాలేదు.
ఎందుకీ నిర్లక్ష్యం?
రోడ్లు, భవనాల శాఖకు చెందిన ఇంజనీర్లు ఈ రోడ్డుపై ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది అర్థంకావడం లేదు. వాస్తవానికి జూన్ నెలలోనే రూ.కోటి 17 లక్షల వ్యయంతో దానిని నిర్మించాలని భావించి, రోడ్డు వెడల్పు చేయడం, మెటల్ వేసి రోలింగ్ వంటి పనులు చేశారు. అయితే మరోమారు రోలింగ్ చేసి తారువేసి పూర్తి చేయాల్సి ఉండగా, అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. గత మూడు నెలలుగా రోడ్డు నిర్మాణ పనులను అసంపూర్తిగా వదిలేయడంపై కొత్తపాడేరు, గొందూరు వాసులతో పాటు ఆ మార్గంలో రాకపోకలు సాగించే లగిశపల్లి, వంజంగి, కాడెలి పంచాయతీలకు చెందిన ప్రజలు, పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.
వాహనచోదకుల అవస్థలు
ఈ రోడ్డును అసంపూర్తిగా వదిలేయడంతో ప్రస్తుతం అది ప్రమాదకరంగా ఉంది. ఇటీవల అధిక వర్షాలు కురవడంతో మెటల్ పరిచి ఉన్న ఈ రోడ్డుకు ఇరువైపులా అంచులు కొట్టుకుపోయి గోతులు ఏర్పడ్డాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించేందుకు కార్లతో పాటు ద్విచక్రవాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలువురు ప్రమాదాలకు గురయ్యాయి. ఈ సమస్యను గుర్తించిన కొత్తపాడేరు వాసులు రోడ్డు అంచుల గోతులను వాహన చోదకులు గుర్తించేలా కర్రలను పాతారు. కాగా వంజంగి హిల్స్‌కు పర్యాటకులు రాకపోకలు సాగించే ఈ రోడ్డు అధ్వానంగా ఉండడంతో అవస్థలు తప్పడం లేదు. మరో నెల రోజుల్లో పర్యాటక సీజన్ ప్రారంభమయ్యే పరిస్థితుల్లో ఈ మార్గం అధ్వానంగా ఉండడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా రోడ్లు, భవనాల శాఖాధికారులు స్పందించి కొత్తపాడేరు రోడ్డును పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.