Share News

అరకొర పనులతో అవస్థలు

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:37 PM

ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి వెళ్లే వాహన చోదకులు ఘాట్‌ దిగాలంటే ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌(ఓఎఫ్‌సీ) పనుల్లో భాగంగా ఘాట్‌లోని ఒక వైపు గోతులు తవ్వుతున్నారు. అయితే కేబుళ్లు అమర్చినా గోతులను సక్రమంగా పూడ్చకపోవడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.

అరకొర పనులతో అవస్థలు
పాడేరు మండలం కందమామిడి వద్ద ప్రమాదకరంగా ఉన్న ఓఎఫ్‌సీ గోతులు

ఘాట్‌ రోడ్డులో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్ల కోసం తవ్వకాలు

పనులు పూర్తయినా గోతులు పూడ్చని వైనం

వాహనచోదకులకు తప్పని ఇబ్బందులు

ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని టెన్షన్‌

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి వెళ్లే వాహన చోదకులు ఘాట్‌ దిగాలంటే ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌(ఓఎఫ్‌సీ) పనుల్లో భాగంగా ఘాట్‌లోని ఒక వైపు గోతులు తవ్వుతున్నారు. అయితే కేబుళ్లు అమర్చినా గోతులను సక్రమంగా పూడ్చకపోవడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.

ఏజెన్సీలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలను విస్తరించడంలో భాగంగా మైదాన ప్రాంతం నుంచి పాడేరుకు ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఘాట్‌రోడ్డుకు ఒక వైపు గోతులు తవ్వి దానిలో కేబుల్‌ వేస్తున్నారు. అయితే కేబుల్‌ వేసిన తరువాత ఆయా గోతులను సక్రమంగా పూడ్చడం లేదు. దీంతో రోడ్డుపైనే చాలా వరకు మట్టి ఉంటోంది. దీని వల్ల ఘాట్‌లో ఎదురెదురుగా వాహనాలు వస్తే తప్పుకోవడానికి అవస్థలు పడుతున్నారు. ఇటీవల రోజూ వర్షం కురుస్తుండడంతో మట్టి బురదమయమై వాహనాలు జారిపోయి పక్కన ఉన్న ఆ గోతుల్లో కూరుకుపోతున్నాయని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎదురెదురుగా వచ్చే లారీలు, బస్సులు తప్పుకోవడం సైతం కష్టతరంగా ఉంటోందని ప్రయాణికులు తెలిపారు. ఆదివారం ఘాట్‌లో భారీ వర్షం కురవడం, ట్రాఫిక్‌ అధికంగా ఉండడంతో ఘాట్‌లో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాస్తవానికి కేబుల్‌ కోసం తవ్విన గోతులను పూర్తి స్థాయిలో పూడ్చితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని, కానీ సదరు కాంట్రాక్టర్‌ ఆయా గోతులను సగం సగం పూడ్చడంతోపాటు మట్టి రోడ్డుపైకి రావడంతో వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నాయని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆదివారం ఘాట్‌లోని అమ్మవారి పాదాలు వద్ద మోదకొండమ్మను దర్శించుకుని బైకులపై తిరుగు ప్రయాణమైన పలువురు ఈ క్రమంలో ఘాట్‌లో ప్రమాదానికి గురయ్యారని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఘాట్‌ మార్గంలో కేబుల్‌ గోతులు పూడ్చే విషయంలో చర్యలు చేపట్టి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని డ్రైవర్లు, ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Apr 28 , 2025 | 11:37 PM