ఆదివాసీ ఉద్యమ నేత చెండా ఏలియాకు ఘన నివాళి
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:12 PM
ఆదివాసీలకు స్వయం ప్రతిపత్తి కావాలని నాలుగు దశాబ్దాలుగా ఉద్యమించిన ఆదివాసీ ఉద్యమ నేత చెండా ఏలియా పార్థివదేహం వద్ద పలువురు ప్రముఖులు, అశేష ప్రజానీకం ఆదివారం నివాళులర్పించారు.
నాలుగు దశాబ్దాలుగా ఆదివాసీల స్వయం ప్రతిపత్తి కోసం పోరాడిన నేత
అనారోగ్యంతో బాధపడుతూ విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి
స్వగ్రామం తడిగిరిలో ఘనంగా అంత్యక్రియలు
హాజరైన ప్రముఖులు, అధిక సంఖ్యలో జనం
హుకుంపేట, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): ఆదివాసీలకు స్వయం ప్రతిపత్తి కావాలని నాలుగు దశాబ్దాలుగా ఉద్యమించిన ఆదివాసీ ఉద్యమ నేత చెండా ఏలియా పార్థివదేహం వద్ద పలువురు ప్రముఖులు, అశేష ప్రజానీకం ఆదివారం నివాళులర్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శనివారం రాత్రి కన్నుమూశారు. కాగా ఆయన అంతిమ యాత్ర ఆదివారం మండల కేంద్రం హుకుంపేట నుంచి స్వగ్రామం తడిగిరి వరకు ఘనంగా జరిగింది. పాడేరు, అరకులోయ ఎమ్మెల్యేలు మత్సరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం, ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, సీపీఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు, టీడీపీ డివిజన్ నేత పాండురంగస్వామి, దండకార్యణ విమోచన సమితి నేతలు చెండా కేశవరావు, మాణిక్యం, తదితరులతోపాటు మన్యంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఽఘాల నేతలు ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీల కోసం ఆయన చేసిన పోరాటాలను అందరూ కొనియాడారు. అలాగే అశేషజనవాహిని భారీ ఊరేగింపుతో ఆయన అంతిమ యాత్ర జరిపి అంత్యక్రియలను నిర్వహించారు.
ఆదివాసీల కోసం 80వ దశకం నుంచీ పోరాటం
హుకుంపేట మండలం తడిగిరి గ్రామానికి చెందిన ఆయన బస్తర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న దండకారణ్య ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి ఆదివాసీలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని 80వ దశకం నుంచే పోరాటం ప్రారంభించారు. అలాగే ఆదివాసీల హక్కులు, చట్టాలకు ఎటువంటి భంగం వాటిల్లినా ఆయన ఉద్యమించేవారు. అందుకు గాను గిరిజన హక్కుల పరిరక్షణ సంస్థ, దండకారణ్య విమోచన సమితి పేరిట సంఘాలను స్థాపించి ఆదివాసీలను చైతన్యం చేసి నాలుగు దశాబ్దాలు అనేక ఉద్యమాలను చేపట్టారు. ఈ క్రమంలో పాలకుల నిర్బంధాలు, అక్రమ కేసులను సైతం అనేకం ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆయన తుదిశ్వాస విడిచే వరకు నమ్మిన సిద్థాంతానికి కట్టుబడి ఆదివాసీల పక్షాన ఉద్యమించారు.