అతిసార బారిన గిరిజనులు
ABN , Publish Date - Jun 17 , 2025 | 12:48 AM
పాడేరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి తీసుకోకుండా బయటకు వచ్చేసిన 13 మంది అతిసార రోగులు సోమవారం నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో చేరారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ జ్యోతి అందించిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం రాగపట్నం, చల్లూరు గ్రామాల గిరిజనులు, నాతవరం మండలం సుందరకోట పంచాయతీ అసనగిరి గిరిజనులు కలిసి శనివారం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు. వెంట తీసుకెళ్లిన పులిహోరను మధ్యాహ్నం తిన్నారు.
ఫుడ్ పాయిజన్‌తో వాంతులు, విరేచనాలు
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో 13 మందికి వైద్య సేవలు
ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విశాఖ తరలింపు
నర్సీపట్నం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): పాడేరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి తీసుకోకుండా బయటకు వచ్చేసిన 13 మంది అతిసార రోగులు సోమవారం నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో చేరారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ జ్యోతి అందించిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం రాగపట్నం, చల్లూరు గ్రామాల గిరిజనులు, నాతవరం మండలం సుందరకోట పంచాయతీ అసనగిరి గిరిజనులు కలిసి శనివారం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు. వెంట తీసుకెళ్లిన పులిహోరను మధ్యాహ్నం తిన్నారు. కొద్దిసేపటి తరువాత వాంతులు, విరేచనాలు కావడంతో పాడేరు ఆస్పత్రిలో చేరారు. అయితే అసనగిరి గ్రామస్థులు ఆస్పత్రి వైద్యులకు చెప్పకుండా ఆదివారం రాత్రి బయటకు వచ్చేశారు. సోమవారం విరేచనాలు తగ్గక పోవడంతో నాతవరం పీహెచ్‌సీకి వెళ్లారు. అక్కడ మెడికల్ ఆఫీసర్ వైద్యం చేసి, నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి పంపారు. వెలుగుల వరలక్ష్మి, ఆమె కూతురు లోవరాజు (11), పట్టెం వెంకటలక్ష్మి, ఆమె కుమారుడు కాశీబాబు(10), జర్తి చినబుజ్జి, జర్తి గంగా భవాని, పట్టెం వెంకయ్యమ్మ, బటారి వల్సమ్మ, బటారి అనిల్, చల్లా ప్రసాద్, చల్లా లక్ష్మి, బటూరి లక్ష్మి, ఆమె కూతురు సాయిదుర్గ చికిత్స పొందుతున్నారు. వీరిలో సాయిదుర్గ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కి తరలించారు. 26 వార్డు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ప్రాంతీయ ఆస్పత్రికి వచ్చి రోగులను పరామర్శించారు.