గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:28 AM
జిల్లాలోని గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆకాంక్షించారు.
కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్
జిల్లాలో రెండు మధ్య తరహా పరిశ్రమలకు వర్చువల్‌గా సీఎం చంద్రబాబు శంకుస్థాపన
పాడేరు, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆకాంక్షించారు. పారిశ్రామిక రంగం అభివృద్ధికి కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కలిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తోందన్నారు. ఈ క్రమంలో గిరిజనులు పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. పాడేరు నియోజకవర్గం చింతపల్లిలో 15 ఎకరాల్లో రూ.11 కోట్ల వ్యయంతో, రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం ఎట్టపల్లిలో 25 ఎకరాల్లో రూ.13 కోట్ల వ్యయంతో సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే అరకులోయ నియోజకవర్గం డుంబ్రిగుడలో రూ.9 కోట్ల వ్యయంతో 30 ప్లాటెడ్ ఫ్యాక్టరీ అవుట్ లెట్ యూనిట్‌లను మూడు నెలల్లో ఏర్పాటు చేస్తామన్నారు. వాటి కోసం గిరిజనులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఆయా పరిశ్రమలను ఏర్పాటు చేసే ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు, విద్యుత్, నీరు, డ్రైనేజీలు, ఇతర సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. పరిశ్రమల నిర్వహణ, మార్కెటింగ్‌పై గిరిజనులకు అవసరమైన శిక్షణలు అందిస్తామని చెప్పారు. ఐటీడీఏ, పరిశ్రమల శాఖ సంయుక్తంగా గిరిజనులు పరిశ్రమలను నెలకొల్పేందుకు ప్రోత్సహిస్తాయన్నారు. జిల్లాలో వ్యవసాయానికి ప్రాధాన్యం ఉన్నందున వ్యవసాయాధారిత(కాఫీ, మిరియాలు, పసుపు వంటివి) పరిశ్రమలు, ప్రోసెసింగ్ యూనిట్‌లు ఏర్పాటుకు అవకాశం ఎక్కువగా ఉందన్నారు. పర్యాటకాన్ని సైతం పరిశ్రమల జాబితాలోకి తీసుకువచ్చి ప్రోత్సహిస్తున్నామని, ఇందులో భాగంగా జిల్లాలో 150 హోమ్ స్టే యూనిట్‌లకు అనుమతులు మంజూరు చేశామన్నారు. మహిళా సంఘాల ప్రతినిధులతో గ్రామాల్లోని ప్రజలకు పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కలిగే అంశాలపై అవగాహన కల్పించాలన్నారు.
ఉద్యోగాలిచ్చే స్థాయిలో ఆలోచించాలి
విద్యార్థులు కేవలం చదువుకుని ఉద్యోగాలు చేయాలనే ఆలోచన మాత్రమే కాకుండా ఇప్పటి నుంచే తాము సైతం ఉద్యోగాలిచ్చే స్థాయికి వెళ్లాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని ఐటీడీఏ పీవో శ్రీపూజ అన్నారు. భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలుగా ఎదిగి మరికొంతమందికి ఉద్యోగాలివ్వాలని ఆమె ఆకాంక్షించారు. విద్యార్థులు, యువత వినూత్నంగా ఆలోచించాలని, తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ వంపూరు గంగులయ్య వివిధ అంశాలపై మాట్లాడారు.
రెండు పరిశ్రమలకు వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన
జిల్లాలో ఏర్పాటు చేసే రెండు పరిశ్రమలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. పాడేరు నియోజకవర్గం చింతపల్లిలో 15 ఎకరాల్లో రూ.11 కోట్ల వ్యయంతో, రంపచోడవరం నియోజకవర్గంలో గంగవరం మండలం ఎట్టపల్లిలో 25 ఎకరాల్లో 13 కోట్ల వ్యయంతో సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటుకు సీఎం ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ వి.మురళి, జిల్లా పరిశ్రమలశాఖాధికారి రమణారావు, ఏపీ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కార్పోరేషన్ మేనేజర్ కె.లోషిత్‌కుమార్, మాజీ ఎంపీపీ బొర్రా విజయరాణి, సర్పంచ్ లకే పార్వతమ్మ, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.