ఖరీఫ్‌కు ఆదివాసీలు సన్నద్ధం
ABN , Publish Date - May 31 , 2025 | 12:23 AM
జిల్లాలో ఆదివాసీ రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. వ్యవసాయ పనులకు అవసరమైన పనిముట్లను సమకూర్చుకోవడంలో రైతులు నిమగ్నమయ్యారు.
వ్యవసాయ పనిముట్లు సమకూర్చుకోవడంలో బిజీ
వారపు సంతల్లో కొనుగోలు
చింతపల్లి, మే 30 (ఆంధ్రజ్యోతి):జిల్లాలో ఆదివాసీ రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. వ్యవసాయ పనులకు అవసరమైన పనిముట్లను సమకూర్చుకోవడంలో రైతులు నిమగ్నమయ్యారు. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురిశాయి. మార్చి నుంచి మే వరకు 310 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఆదివాసీ రైతులు వేసవి దుక్కులు చేసుకుని నాట్లు వేసేందుకు సిద్ధపడుతున్నారు. ఖరీఫ్‌లో ఆదివాసీ రైతులు ప్రధానంగా వరి, రాగి, సామ, కొర్ర, వేరుశనగ, మొక్కజొన్న నాట్లు వేస్తారు. ఖరీఫ్ సాగుకు సమయం దగ్గర పడుతుండడంతో రైతులు దుక్కి చేసుకునేందుకు నాగళ్లను సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే రైతులు వారపు సంతల్లో వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు కొనుగోలు చేస్తున్నారు. నాగళ్లకు అవసరమైన ఇనుప కడ్డీలు, కత్తులు, గడ్డపారలు, పారలు కొనుగోలు చేస్తున్నారు. మరికొంతమంది రైతులు గత ఏడాది ఉపయోగించిన పనిముట్లను వారపు సంతకు తీసుకొచ్చి సానా పట్టించుకుంటున్నారు. దీంతో సంతల్లో వ్యవసాయ పనిముట్లకు మంచి డిమాండ్ నెలకొంది. కాగా కొంత మంది రైతులు సంతల్లో దుక్కిటెడ్లు కొనుగోలు చేశారు. ఏది ఏమైనప్పటికి గిరిజన ప్రాంతం రైతుల్లో ఖరీఫ్ సందడి ప్రారంభమైంది.