Share News

కదంతొక్కిన గిరిజన నిరుద్యోగులు

ABN , Publish Date - Sep 03 , 2025 | 12:33 AM

గిరిజన నిరుద్యోగులు మంగళవారం కదంతొక్కారు. మెగా డీఎస్సీ నుంచి గిరిజన ప్రాంత టీచర్‌ పోస్టులను మినహాయించాలని, వాటి భర్తీకి ప్రత్యేక గిరిజన డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని డిమాండ్‌ చేస్తూ గిరిజన నిరుద్యోగులు ఐటీడీఏ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. జీవో:3 రద్దుతో గిరిజన ప్రాంతంలో టీచర్‌ పోస్టుల భర్తీలో శతశాతం రిజర్వేషన్‌ కోల్పోయామని, ఈ క్రమంలో మెగా డీఎస్సీలో గిరిజన ప్రాంత టీచర్‌ పోస్టులను ఇతరులతో భర్తీ చేస్తే తీవ్ర అన్యాయానికి గురవుతామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

కదంతొక్కిన గిరిజన నిరుద్యోగులు
పాడేరు ఐటీడీఏ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న గిరిజన నిరుద్యోగులు

- మెగా డీఎస్సీలో గిరిజన ప్రాంత టీచర్‌ పోస్టులు మినహాయించి, గిరిజన స్పెషల్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌

- రోడ్డుపై బైఠాయించి ఆందోళన

- నిలిచిన వాహనాల రాకపోకలు

పాడేరు, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): గిరిజన నిరుద్యోగులు మంగళవారం కదంతొక్కారు. మెగా డీఎస్సీ నుంచి గిరిజన ప్రాంత టీచర్‌ పోస్టులను మినహాయించాలని, వాటి భర్తీకి ప్రత్యేక గిరిజన డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని డిమాండ్‌ చేస్తూ గిరిజన నిరుద్యోగులు ఐటీడీఏ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. జీవో:3 రద్దుతో గిరిజన ప్రాంతంలో టీచర్‌ పోస్టుల భర్తీలో శతశాతం రిజర్వేషన్‌ కోల్పోయామని, ఈ క్రమంలో మెగా డీఎస్సీలో గిరిజన ప్రాంత టీచర్‌ పోస్టులను ఇతరులతో భర్తీ చేస్తే తీవ్ర అన్యాయానికి గురవుతామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీలో గిరిజన ప్రాంతంలోని టీచర్‌ పోస్టులను భర్తీ చేయకుండా మినహాయించాలని, వాటిని గిరిజన స్పెషల్‌ డీఎస్సీ ద్వారా మాత్రమే భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. అలా చేయకుండా మెగా డీఎస్సీలో గిరిజన ప్రాంత టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తే ఊరుకోబోమని ఆందోళనకారులు హెచ్చరించారు. ఆందోళనకారులతో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, డీఎస్పీ షెహబాజ్‌ అహ్మద్‌ మాట్లాడారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆందోళనకారులు శాంతించలేదు. మెగా డీఎస్సీలో గిరిజన ప్రాంత టీచర్‌ పోస్టుల మినహాయింపుపై ఉన్నతాధికారుల నుంచి తమకు స్పష్టమైన హామీ కావాలని పట్టుబట్టారు. అందుకు ముందు ర్యాలీగా వచ్చిన గిరిజన నిరుద్యోగులు ఐటీడీఏ కార్యాలయం లోపలకు వెళ్లి ఆందోళన చేయాలని భావించినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గేటు పైనుంచి దూకి ఐటీడీఏ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించినప్పటికీ పోలీసులు అంగీకరించలేదు. దీంతో రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీని వల్ల పాడేరు- అరకులోయ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే సాయంత్రం కావడంతో ఆందోళనను మెయిన్‌రోడ్డు నుంచి ఐటీడీఏ కార్యాలయం గేటు ప్రాంతానికి మార్చారు. దీంతో రాకపోకలు యథాతథంగా సాగాయి. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జాతీయ సభ్యుడు పి.అప్పలనర్స, సీపీఎం, గిరిజన సంఘం, గిరిజన నిరుద్యోగుల సంఘం నేతలు ఎస్‌.సత్యనారాయణ, ఎం.భవానీ, జిప్రియ, ఎ.రాణి, స్వాతి, ఎం.విష్ణు, బి.రామకృష్ణ, అధిక సంఖ్యలో అభ్యర్థులు పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2025 | 12:33 AM