గిరిజన స్వాతంత్య్ర ఉద్యమ వీరుడు పండు పడాల్
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:45 AM
బ్రిటిష్ పాలకుల దురాగతాలపై మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చేట్టిన ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన గిరిజన స్వాతంత్య్ర ఉద్యమ వీరుల్లో బోనంగి పండు పడాల్ ఒకరు. రంప తిరుగుబాటులో అల్లూరి ముఖ్య అనుచరుడిగా సాయుధ పోరాటం సాగించి పలు దాడుల్లో ఆయన కీలక పాత్ర పోషించారు.
- అల్లూరికి ముఖ్య అనుచరుడు
- సీతారామరాజుతో కలిసి సాయుధ పోరాటం, పోలీస్ స్టేషన్లపై దాడి
- బ్రిటిష్ పోలీసులకు పట్టించిన సోదరి
- అండన్‌మాల్‌లో సుదీర్ఘకాలం జైలు జీవితం
- నేడు బోనంగి పండు పడాల్ జయంతి
చింతపల్లి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): బ్రిటిష్ పాలకుల దురాగతాలపై మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చేట్టిన ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన గిరిజన స్వాతంత్య్ర ఉద్యమ వీరుల్లో బోనంగి పండు పడాల్ ఒకరు. రంప తిరుగుబాటులో అల్లూరి ముఖ్య అనుచరుడిగా సాయుధ పోరాటం సాగించి పలు దాడుల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అల్లూరి మరణం అనంతరం బ్రిటిష్ పోలీసులకు పట్టుబడి సుదీర్ఘకాలం అండమాన్‌లో జైలు జీవితం అనుభవించి, అక్కడే తనువు చాలించారు. ఏటా ఆగస్టు 13న పండు పడాల్ స్వగ్రామం గొందిపాకలులో ఆదివాసీలు ఆయన జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు అనుచరుల్లో గాం గంటన్నదొర, మల్లుదొర తరువాత స్థానం పండు పడాల్‌ది. బోనంగి పండు పడాల్ చింతపల్లి మండలం గొందిపాకలు గ్రామ పంచాయతీకి చెందిన గిరిజనుడు. బోనంగి అండయ్య, బంగారమ్మల దంపతులకు పండు పడాల్ 1890 ఆగస్టు 13న జన్మించారు. 30 ఏళ్ల వయస్సులో అదే గ్రామానికి చెందిన లింగయమ్మతో వివాహమైంది. అప్పటికే ఏజెన్సీ వ్యాప్తంగా బ్రిటిష్ పాలన కొనసాగుతున్నది. బ్రిటిష్ పాలకుల దురాగతాలు పెచ్చుమీరిపోయాయి. అదే సమయంలో అల్లూరి సీతారామరాజు మన్యంలో అడుగుపెట్టి సాయుధ పోరాటానికి శ్రీకారం చుట్టారు. అల్లూరి పోరాటానికి ఆకర్షితుడైన పండు పడాల్ ఉద్యమంలో చేరారు. సాయుధ పోరాటానికి అల్లూరి వెంట వెళ్లిన సమయంలో పడాల్ భార్య ఎనిమిది నెలల గర్భిణి.
సాయుధ పోరాటంలో పండు పడాల్ పాత్ర
సీతారామరాజుతో కలిసి చింతపల్లి, కృష్ణాదేవిపేట, రాజవోమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం పోలీస్ స్టేషన్లపై దాడుల్లో పండు పడాల్ పాల్గొన్నారు. ప్రధానంగా 1922 సెప్టెంబరులో కృష్ణాదేవిపేట వద్ద బ్రిటిష్ సైనికాధికారులు హైటర్, క్లవర్ట్‌లను అంతమొందించిన దాడిలో పండు పడాల్ ప్రధాన భూమిక పోషించారు. దీంతో బ్రిటిష్ పోలీసుల హిట్‌లిస్ట్‌లో పండు పడాల్ చేరారు. నాటి నుంచి అల్లూరి సీతారామరాజుతో పాటు ఆయన అనుచరుల్లో ఒకరైన పండు పడాల్‌ను పట్టుకునేందుకు బ్రిటిష్ పోలీసులు కార్యాచరణ ప్రారంభించారు. దీంతో పండు పడాల్ అజ్ఞాత జీవితాన్ని కొనసాగించాల్సి వచ్చింది.
బ్రిటిష్ పోలీసులకు పట్టించిన సోదరి
అల్లూరి సీతారామరాజు మరణం అనంతరం పండు పడాల్ కోసం బ్రిటిష్ పోలీసులు గాలింపు చర్యలను విస్తృతం చేశారు. ఈ క్రమంలో అతని కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురిచేసేవారు. దీంతో పండు పడాల్ సోదరి రామయమ్మ భోజనానికి ఇంటికి పిలిచి బ్రిటిష్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. భోజనానికి వచ్చిన పండు పడాల్‌ను బ్రిటిష్ పోలీసులు 1924 జూన్‌లో అరెస్టు చేశారు.
సుదీర్ఘకాలం జైలు జీవితం
పండు పడాల్ సుదీర్ఘకాలం జైలు జీవితాన్ని అనుభవించారు. బ్రిటిష్ పోలీసులకు పట్టుబడిన పడాల్‌కు విశాఖపట్నం సెషన్స్ కోర్టు 1925 మే 11న మరణశిక్ష విధించింది. ఈ శిక్షను తరువాత యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. దీంతో రాజమండ్రి, తిరుచురాపల్లి జైళ్లలో ఆయన శిక్ష అనుభవించారు. 1926లో పడాల్‌ను అండమాన్‌లో ప్రవాస శిక్షకు పంపించారు. నాటి నుంచి దేశానికి స్వాతంత్య్రం వచ్చే వరకు అండమాన్ సెల్యూలార్ జైలులో శిక్షను అనుభవించారు.
అండమాన్‌లో స్థిర నివాసం
జైలు నుంచి విడుదలైన పండు పడాల్ అండన్‌మాన్‌లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. విడుదలైన వెంటనే తహసీల్దార్ ద్వారా గొందిపాకలులో ఉన్న తన భార్య లింగాయమ్మను అండమాన్ రప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికి ఆమె నిరాకరించింది. దీంతో అండమాన్‌లో పార్వతి అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు జన్మించారు. 1974 ఫిబ్రవరి 11న పండు పడాల్ అండన్‌మాన్‌లో మరణించారు. 1973లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పడాల్ జీవిత చరిత్రను సేకరించింది. అప్పట్లో ఓ తెలుగు దినపత్రిక పడాల్ జీవిత చరిత్రను ప్రముఖంగా ప్రచురించింది. అనంతరం అండమాన్‌లోని పండు పడాల్ పిల్లలు తండ్రి స్వగ్రామం గొందిపాకలను వెతుక్కుంటూ వచ్చి స్థానిక కుటుంబ సభ్యులను కలిశారు. ఆయన పోరాటపటిమకు స్ఫూర్తిగా పడాల్ కుమారుడు శివరాజు పడాల్ 2012 ఫిబ్రవరి 29న గొందిపాకలులో పండు పడాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది స్థానిక గిరిజనులు ఆయన విగ్రహానికి నివాళి అర్పించి ఆయన పోరాట పటిమను నెమరువేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.