Share News

బిందు సేద్యం వైపు మొగ్గు

ABN , Publish Date - Nov 16 , 2025 | 01:23 AM

బిందు, తుంపర్ల సేద్యాన్ని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. పలు మండలాల్లో పండ్లు, పూల తోటలు సాగు చేస్తుండగా, మిగిలిన అన్ని మండలాల్లో కూరగాయలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.

బిందు సేద్యం వైపు మొగ్గు
పరవాడ మండలంలోని వాడచీపురుపల్లిలో బిందు సేద్యం

రాయితీపై పరికరాలు అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

ఆసక్తి చూపుతున్న రైతులు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

బిందు, తుంపర్ల సేద్యాన్ని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. పలు మండలాల్లో పండ్లు, పూల తోటలు సాగు చేస్తుండగా, మిగిలిన అన్ని మండలాల్లో కూరగాయలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. కాగా ప్రభుత్వం జిల్లాలో 2025-26 సంవత్సరానికి రూ.16.32 కోట్లతో 2 వేల హెక్టార్లలో బిందు, తుంపర్ల సేద్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు రూ.12 కోట్లు రాయితీని ప్రకటించింది.

జిల్లాలో అక్టోబరు నెలాఖరు వరకు బిందు, తుంపర్ల సేద్యం కోసం 2,276 మందికిపైగా రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటి వరకు 1,035 హెక్టార్లలో సాగు చేసేందుకు 1,004 రైతుల దరఖాస్తులను అధికారులు పరిశీలించారు. ఇందులో అన్ని అర్హతలున్న 270 మందికి సుమారు 249 హెక్టార్లలో సాగు చేసేందుకు ఆమోద ముద్ర వేశారు. ఇందులో 172 మంది రైతులకు బిందు, తుంపర్ల సేద్య రాయితీ పరికరాలను అందజేశారు. జిల్లాకు ఆరు మైక్రో ఇరిగేషన్‌ కంపెనీలను కేటాయించి రాయితీ పరికరాలను పంపిణీ చేస్తున్నారు.

కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ

బిందు, తుంపర్ల సేద్యం చేసేందుకు రైతుల నుంచి అన్ని రైతు సేవా కేంద్రాల్లో, మండల అభివృద్ధి కార్యాలయాల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆన్‌లైన్‌లో రిజిసే్ట్రషన్‌ చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. దరఖాస్తుతో భూమి హక్కుపత్రం, ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌పుస్తకం, భూమి ఎఫ్‌ఎంబీ, నీటి వనరులైన బోరు, బావి, సమీపంలో పంట కాలువ ఉన్నా ఆ వివరాలు జోడించాల్సి ఉంటుంది. బిందు సేద్యం చేసేందుకు చేసిన దరఖాస్తులను మండల స్థాయి అధికారులు పరిశీలన అనంతరం యూనిట్లు మంజూరు చేస్తున్నారు. ప్రతి ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో మాత్రమే బిందు సేద్యం పరికరాలు మంజూరు చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం ఆగస్టు నెల నుంచే కొత్త యూనిట్లు మంజూరు చేస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో దేవరాపల్లి, కె.కోటపాడు, సబ్బవరం, చీడికాడ, రావికమతం, అనకాపల్లి, మాడుగుల, చోడవరం, కోటవుటర్ల, రోలుగుంట, నర్సీపట్నం, మాకవరపాలెం గొలుగొండ, నాతవరం మండలాల్లో రకరకాల కూరగాయల సాగు చేస్తున్నారు. ఎక్కువగా వంగ, బీర, బెండ, టమాటా, బీన్స్‌ వంటి కూరగాయల సాగు చేస్తున్నారు. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌.రాయవరం, ఎలమంచిలి మండలాల్లో ఉద్యాన పంటలైన తమలపాకులు, అరటి, జామ, మామిడి, కొబ్బరి, చెరుకు, డ్రాగన్‌, బొప్పాయి వంటి పంటల సాగు చేస్తున్నారు. గత ఏడాది నుంచి ప్రభుత్వం బిందు, తుంపర్ల సేద్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాయితీలు అందిస్తుండడంతో రైతులు మరింత ఆసక్తితో బిందు, తుంపర్ల సేద్యం చేస్తున్నారు.

రాయితీపై పరికరాలు అందజేత

బిందు, తుంపర్ల సేద్యం చేసే సన్న, చిన్నకారు ఎస్సీ, ఎస్టీ (ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి గల) రైతులకు వంద శాతం, ఇతర రైతులకు 90 శాతం రాయితీతో రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మైక్రో ఇరిగేషన్‌ శాఖ ద్వారా పరికరాలను అందిస్తోంది. ఒక్కో రైతుకు గరిష్ఠంగా రూ.2.18 లక్షలు వరకు బిందు సేద్యం పరికరాలు అందిస్తున్నారు. ఐదు నుంచి 10 ఎకరాల్లోపు ఉన్న రైతులకు 90 శాతం గరిష్ఠంగా, ఆపైన సాగు చేసే రైతులకు 50 శాతం రాయితీ అందిస్తున్నారు. కాగా బిందు, తుంపర్ల సేద్యంతో పంటకు సరిపడా నీరు అందుతుందని, దీని వలన దిగుబడులు సాధారణం కంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని జిల్లా మైక్రో ఇరిగేషన్‌ అధికారి జీవీ లక్ష్మి తెలిపారు.

Updated Date - Nov 16 , 2025 | 01:23 AM