Share News

వణుకుతున్న మన్యం

ABN , Publish Date - Dec 27 , 2025 | 10:49 PM

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకు దిగజారుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌లో కొనసాగుతున్నాయి.

వణుకుతున్న మన్యం
సీలేరులో అయ్యప్పస్వామి ఆలయం వద్ద దట్టంగా కురుస్తున్న పొగమంచు

దిగజారుతున్న ఉష్ణోగ్రతలు

జి.మడుగులలో 5.1 డిగ్రీలు

కొనసాగుతున్న చలి తీవ్రత

పాడేరు, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి):మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకు దిగజారుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌లో కొనసాగుతున్నాయి. దీంతో చలి తీవ్ర ప్రభావం చూపుతోంది. శనివారం జి.మాడుగులలో 5.1 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా ముంచంగిపుట్టులో 6.8, పెదబయలులో 9.0, చింతపల్లిలో 9.4, పాడేరులో 9.9, అరకులోయలో 10.0, హుకుంపేటలో 10.7, కొయ్యూరులో 12.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వణుకుతున్న మన్యం వాసులు

ఏజెన్సీలో గత కొన్ని రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో ఏజెన్సీ వాసులు గజగజ వణుకుతున్నారు. ఉదయం పది గంటలు దాటే వరకు దట్టంగా పొగ మంచు కురుస్తుండగా.. మధ్యాహ్నం ఒక మోస్తరుగా ఎండ కాస్తున్నది. దీంతో రాత్రి పగలు తేడా లేకుండా చలి వణికిస్తోంది. జనం ఉన్ని దుస్తులు ధరిస్తూ, చలి మంటలు వేసుకుంటూ తాజా పరిస్థితులను నుంచి రక్షణ పొందుతున్నారు. అలాగే పర్యాటకులు సైతం మన్యానికి విచ్చేసి చలి, మంచు వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.

సీలేరు:

జీకేవీధి మండలం సీలేరు, ధారకొండ ప్రాంతాల్లో శనివారం చలి తీవ్రత అధికంగా ఉంది. గత రెండు రోజులుగా ఈప్రాంతంలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. శనివారం కనిష్ఠ ఉష్ణోగ్రత 9 డిగ్రీల నమోదు కావడంతో ఈ ప్రాంత ప్రజలు చలికి గజగజలాడుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల వరకు సీలేరు, ధారకొండల్లో పొగ మంచు అధికంగా కురుస్తోంది. దీంతో ఘాట్‌ రోడ్డులో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

డుంబ్రిగుడ:

మండలంలో శనివారం చలి తీవ్రత పెరిగింది. ప్రధాన రహదారులపై దట్టమైన పొగ మంచు అలుముకుంది. ఉదయం తొమ్మిది దాటిన మంచు తెరలు వీడలేదు. వాహనదారులకు రోడ్డు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో లైట్లు వేసుకొని నెమ్మదిగా రాకపోకలు సాగిస్తున్నారు.

ముంచంగిపుట్టు:

మండలంలో చలి ప్రజలను గజగజలాడిస్తున్నది. శనివారం ఉదయం 9 గంటలు వరకు మంచు తెరలు వీడలేదు. ముంచంగిపుట్టులో 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. సాయంత్రం 4 గంటలు దాటితే చలి గాలులు మొదలవుతున్నాయి. దీంతో ఎక్కడ పడితే అక్కడ చలి మంటలు కాగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

Updated Date - Dec 27 , 2025 | 10:49 PM