వణికిస్తున్న మలేరియా
ABN , Publish Date - Jul 22 , 2025 | 01:32 AM
జిల్లాలో వర్షాలతోపాటు వ్యాధులు విజృంభిస్తున్నాయి.
చాపకింద నీరులా విస్తరిస్తున్న జ్వరాలు
వర్షాలు కురుస్తుండడంతో పెరుగుతున్న దోమల బెడద
రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు
-----------
సంవత్సరం మలేరియా నమోదైన
రక్త పరీక్షలు పాజిటివ్ కేసులు
2022 2,94,989 67
2023 3,75,782 175
2024 3,96,860 259
2025 1,86,644 290
(జూలై నెల 20వ తేదీ వరకు)
--------
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో వర్షాలతోపాటు వ్యాధులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా దోమల ద్వారా వ్యాప్తిచెందే మలేరియా జ్వరాలు ప్రజలను వణికిస్తున్నాయి. దోమల నిరోధానికి జిల్లా మలేరియా శాఖ అధికారులు, సిబ్బంది తమవంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ ఏడాది మలేరియా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. మరోవైపు మాకవరపాలెం, నాతవరం, రోలుగుంట, గొలుగొండ మండలాల్లో చికున్ గున్యా కేసులు పెరుగుతున్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి ఆనుకొని అనకాపల్లి జిల్లాలో వున్న దేవరాపల్లి, చీడికాడ, వి.మాడుగుల, రావికమతం, రోలుగుంట, గొలుగొండ, నాతవరం మండలాల్లోని గిరిజన గ్రామాల్లో మలేరియా జ్వరాలు అధికంగా ప్రబలుతున్నాయి. జిల్లా మలేరియా అధికారులు ఆయా మండలాల్లో 108 గ్రామాలను అత్యంత సమస్యాత్మకంగా గురించి దోమల నియంత్రణకు ఏప్రిల్ నుంచే చర్యలు చేపట్టారు. ఆయా గ్రామాల్లో ఇప్పటికే రెండుసార్లు దోమల నివారణ మందును పిచికారీ చేయించారు. ఈ నెలాఖరులోగా మరోసారి మందును పిచికారీ చేయిస్తామని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో ప్రస్తుతం మలేరియా జ్వర బాధితులు అధిక సంఖ్యలో ఉన్నారు. రోజు విడిచి రోజు జ్వరం రావడం, తలనొప్పి, చలితో వణుకుతో, చమటలు పట్టడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. మలేరియా సిబ్బంది ఇటువంటి వారికి అత్యాధునిక యంత్రంతో రక్త పరీక్షలు నిర్వహించి మలేరియా నిర్ధారణ అయితే నివారణకు మందులు అందిస్తున్నారు. కాగా ఏటా వర్షాకాలంలో దోమల బెడద కారణంగా ప్రజలు మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా జ్వరాలబారి పడుతుండడం సాధారణం. కానీ ఈ ఏడాది పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. గత ఏడాది జనవరి నుంచి జూలై 20వ తేదీ వరకు జిల్లాలో 2,03,464 మంది జ్వరబాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించి మలేరియా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 131 మందికి పాజిటివ్‌గా రిపోర్టులు వచ్చాయి. ఈ ఏడాది ఇదే కాలంలో 1,86,644 మంది జ్వరబాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించి మలేరియా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 290 మందికి పాజిటివ్ వచ్చింది. వీరందరికీ ఉచితంగా మందులు అందించారు.
గిరిజన గ్రామాల్లో పంపిణీకి నోచుకోని దోమ తెరలు
దోమల కారణంగానే మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి జ్వరాలు ప్రబలుతుంటాయి. ప్రజలు.. ముఖ్యంగా ఏజెన్సీని ఆనకొని వున్న గ్రామాల్లో గిరిజనులు వీటి బారిన పడకుండా దోమ తెరలు పంపిణీ చేయాలి. కానీ ఇంతవరకు ఒక్క గ్రామంలో కూడా దోమ తెరల పంపణీ జరగలేదు. గత ఏడాది కలెక్టర్ విజయకృష్ణన్ చొరవ తీసుకుని సీఎస్‌ఆర్ నిధులతో 50 వేల దోమతెరలను కొన్ని గ్రామాల్లో పంపిణీ చేశారు. ఈ ఏడాది కూడా త్వరగా పంపిణీ చేస్తే మలేరియా కేసులు తగ్గుముఖం పడతాయని ఆ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
దోమల నివారణకు పలు చర్యలు
వరహాలు దొర, జిల్లా మలేరియా అధికారి
జిల్లాలో కొద్ది రోజులుగా మలేరియా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న మాట వాస్తమే. గ్రామాల్లో మలేరియా కారక దోమల నివారణకు చర్యలు చేపడుతున్నాం. అన్ని గ్రామాల్లో యాంటీ లార్వా ఆపరేషన్ కొనసాగుతున్నది. రెండు మూడు రోజులకు మించి జ్వరం, తలనొప్పి వుంటే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్ రిపోర్ట్ వస్తే ఆస్పత్రుల్లో ఉచితంగా మందులు ఇస్తారు. అదృష్టవశాత్తూ జిల్లాలో ఈ ఏడాది ఇంతవరకు ఒక్క మలేరియా మరణం కూడా సంభవించలేదు.