Share News

రయ్‌.. రయ్‌

ABN , Publish Date - Oct 25 , 2025 | 01:17 AM

కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం అందరిలోను ఆందోళన రేకెత్తించింది.

రయ్‌.. రయ్‌

పట్టపగ్గాల్లేని ట్రావెల్స్‌ బస్సులు

పరిమితికి మించిన వేగంతో ప్రయాణం

కర్నూలు ఉదంతంతో సర్వత్రా ఆందోళన

విశాఖ నుంచి విజయవాడ, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలకు నిత్యం వేలాది మంది రాకపోకలు

ఈ నెల 15న రాజస్థాన్‌లో ఒక బస్సు దహనం

అప్పడే అప్రమత్తమైన రవాణా, పోలీసు శాఖలు

58 కేసులు...4 బస్సుల సీజ్‌...రూ.9.5 లక్షల జరిమానా

విశాఖపట్నం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి):

కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం అందరిలోను ఆందోళన రేకెత్తించింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు సమీపంలో బైక్‌ను ఢీకొట్టి మంటల్లో దహనమైంది. ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. మరో 21 మంది గాయాలతో బయటపడ్డారు. బాధితుల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, వారి కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉన్నారు. ఈ ఘటన నగరవాసులను దిగ్ర్భాంతి కలిగించింది.

ఉత్తరాంధ్ర జిల్లాల వాసులు వేలాది మంది హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలలో ఉద్యోగాలు చేస్తున్నారు. వారాంతపు రోజుల్లో, పండుగ సమయాల్లో వారు ఇక్కడకు రావడం, కుటుంబ సభ్యులు ఇక్కడి నుంచి అటు వెళ్లడం పరిపాటిగా మారింది. బెంగళూరు, హైదరాబాద్‌లకు తక్కువ సమయంలో రైలు రిజర్వేషన్‌ సదుపాయం లభించకపోవడం వల్ల అత్యధికులు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ సాయంత్రం బయలుదేరితే మరుసటిరోజు ఉదయం అక్కడకు వెళ్లిపోతున్నారు. అందుకని వాటిపై మొగ్గు చూపుతున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని నేషనల్‌ పర్మిట్‌ కలిగిన బస్సులను రోజుకు 50 నుంచి 60 వరకూ విశాఖపట్నం మీదుగా నడుపుతున్నారు. అదే పండుగలు, టూరిస్ట్‌ సీజన్లు అయితే 75 వరకు ఉంటున్నాయి. అయితే ఇవన్నీ ఇతర రాష్ట్రాలలో రిజిస్టర్‌ అయినవి. ఏపీలో ఇలాంటి బస్సులను రిజిస్టర్‌ చేసుకోవాలంటే ట్యాక్స్‌ ఎక్కువ చెల్లించాలి. అదే ఇతర రాష్ట్రాల్లో తక్కువ కడితే సరిపోతుంది. దాంతో ఒడిశా వంటి రాష్ట్రాల్లో రిజిస్టర్‌ చేసుకుంటున్నారు. విజయవాడ, తిరుపతి వంటి ప్రాంతాలకు వెళ్లేవి మాత్రం ఇక్కడే రిజిస్టర్‌ అవుతున్నాయి. దూరప్రాంతాలకు నడిపే బస్సులను మంచి కండిషన్‌లోనే ఉంచుతారు. అయితే నగరాల్లో ట్రాఫిక్‌ వల్ల ఈ బస్సులు అనుకున్న సమయానికి చేరవు. అందుకని హైవే ఎక్కగానే డ్రైవర్లు పరిమితికి మించిన వేగంతో దూసుకుపోతుంటారు. ప్రయాణికులు అంతా నిద్రలో ఉండడం వల్ల ఈ విషయం గమనించరు. ఈ క్రమంలో డ్రైవర్‌ ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ఈ బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. అయినా ఒక్కోసారి నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు తప్పడం లేదు.

అధికారులు అప్రమత్తం

కర్నూలు జిల్లాలో శుక్రవారం ఉదయం బస్సు ప్రమాదానికి ముందు ఈ నెల 15వ తేదీన రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఏసీ స్లీపర్‌ క్లాస్‌ బస్సు మంటలు అంటుకొని కాలిపోయింది. ఆ ఘటనలో పలువురు మరణించారు. అప్పుడే రవాణా శాఖ అధికారులకు పైనుంచి ఆదేశాలు వచ్చాయి. నేషనల్‌ పర్మిట్‌ తీసుకొని టూరిస్ట్‌ బస్సులుగా నడుస్తున్న వాటిపై దృష్టిపెట్టారు. బెంగళూరు నుంచి వచ్చే బస్సులు అనకాపల్లి, ఆనందపురం నుంచి శ్రీకాకుళం, ఒడిశా వెళుతున్నాయి. రాయగడ, జైపూర్‌, బరంపురాల నుంచి వచ్చే బస్సులు విశాఖ నగరం మీదుగా హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు వెళుతున్నాయి. అందుకని అధికారులు ఎన్‌ఏడీ, కూర్మన్నపాలెం జంక్షన్లలో ఎక్కువగా తనిఖీలు చేపట్టారు. అలాగే అనకాపల్లి వద్ద కూడా తనిఖీలు నిర్వహించారు. అత్యధిక శాతం బస్సుల్లో ఫైర్‌ ఎక్సిటింగ్‌గుషర్లు కండిషన్‌లో లేవని గుర్తించి కేసులు నమోదు చేశారు. తమిళనాడులో రిజిస్టర్‌ అయిన బస్సు పర్మిట్‌ గడువు ముగిసినా తిప్పుతున్నట్టు గుర్తించి శుక్రవారం రాత్రి రూ.2,03,00 జరిమానా వేశారు. బీమా పత్రాలు చూపించకపోవడంతో మరో రెండు బస్సులపై కేసులు పెట్టారు. ఎమర్జన్సీ ఎగ్జిట్‌ సరిగ్గా లేదని రూ.21,200 జరిమానా వేశారు.

పర్మిట్‌ లేకుండా వస్తే కేసులు తప్పవు

ఆర్‌.శ్రీనివాసరావు, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌

సరైన పర్మిట్లు, అనుమతులు లేకుండా ట్రావెల్స్‌ బస్సులను రోడ్లపైకి తీసుకువస్తే దానికి యజమానులే బాధ్యులు. ఈ నెల 13వ తేదీ నుంచి తనిఖీలు నిర్వహించి ఇప్పటివరకూ 58 కేసులు నమోదు చేశాం. నాలుగు సీజ్‌ చేశాం. మొత్తం రూ.9,58,480 జరిమానా వసూలు చేశాం.

Updated Date - Oct 25 , 2025 | 01:17 AM