రంపుల ఘాట్‌లో ప్రయాణమంటే బెంబేలు
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:51 AM
రంపుల ఘాట్ రోడ్డు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల కోతకు గురవుతున్నది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనచోదకులు ఆందోళన చెందుతున్నారు.
- వర్షాలకు కోతకు గురవుతున్న నూతన జాతీయ రహదారి
చింతపల్లి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రంపుల ఘాట్ రోడ్డు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల కోతకు గురవుతున్నది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనచోదకులు ఆందోళన చెందుతున్నారు.
రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు చింతపల్లి, పాడేరు, అరకు మీదుగా జాతీయ రహదారి 516-ఈ నిర్మాణం జరుగుతున్నది. రంపుల ఘాట్‌లో జాతీయ రహదారి దాదాపు 90 శాతం పూర్తయింది. ఘాట్ రోడ్డులో పలు చోట్ల కొండను తొలిచి నిర్మించారు. అయితే కొండ పైనుంచి బండరాళ్లు, కొండచరియలు రహదారిపై పడకుండా రక్షణ గోడ నిర్మించలేదు. దీంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల కొండచరియలు, బండరాళ్లు విరిగిపడుతున్నాయి. అలాగే ఘాట్ రోడ్డు మలుపు వద్ద రహదారి కోతకు గురైంది. ఈ క్రమంలో ప్రమాదాలు జరగకుండా తాత్కాలికంగా జాతీయ రహదారుల అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే రహదారి వర్షాలకు కోతకు గురికాకుండా కింద నుంచి బలమైన కట్టడాలు కట్టాల్సి వుంది. జాతీయ రహదారుల అధికారులు ఘాట్ రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల కోతకు గురైందని సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స, స్థానిక గిరిజనులు చెబుతున్నారు. ఇప్పటికైనా రంపుల ఘాట్‌లో రహదారి కోతకు గురికాకుండా, కొండచరియలు, బండరాళ్లు పడకుండా ప్రమాదాలను నియంత్రించేందుకు జాతీయ రహదారుల అధికారులు పటిష్టమైన నిర్మాణాలు చేపట్టాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.