రవాణా శాఖ కొరడా
ABN , Publish Date - Oct 26 , 2025 | 01:00 AM
కర్నూలు జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
కొనసాగుతున్న ట్రావెల్స్ బస్సుల తనిఖీ
పర్మిట్లు లేకుండా తిరుగుతున్న బస్సుల గుర్తింపు
కొన్ని బస్సుల్లో అత్యవసర ద్వారం మూసేసి అక్కడ సీట్ల ఏర్పాటు
10 బస్సులపై కేసుల నమోదు
ఆరు సీజ్
గత 11 రోజుల్లో 56 బస్సులపై కేసులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కర్నూలు జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నిబంధనలు పాటించని వాహనాలపై కొరడా ఝులిపిస్తున్నారు. శుక్రవారం ఆరు బస్సులపై కేసులు నమోదుచేసిన అధికారులు శనివారం ఏకంగా పదింటిపై కేసులు నమోదుచేశారు. మరో ఆరు బస్సులను సీజ్ చేశారు.
విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందినవారు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో ఉంటున్నారు. వారంతా తరచూ స్వస్థలాలకు వచ్చి వెళుతుంటారు. రైళ్ల కంటే ఎక్కువగా ప్రైవేటు బస్సులనే ఆశ్రయిస్తుంటారు. దీంతో ట్రావెల్స్ బస్సులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు ప్రతిరోజూ సగటున 50 వరకు ప్రైవేటు బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. పండుగ రోజుల్లో అయితే వందకుపైగా తిరుగుతాయి. అయితే ట్రావెల్స్ నిర్వాహకులు లాభాలను ఆర్జించాలనే ధ్యాసలో రవాణాశాఖ నిర్దేశించిన ప్రమాణాలు, నిబంధనలను పాటించడం లేదు. బస్సులకు సకాలంలో పర్మిట్‌లు కట్టడం లేదు. ఫిట్‌నెస్ పరీక్షలు చేయించడం లేదు. ప్రయాణికుల భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. బస్సుల రిజిస్ర్టేషన్ సమయంలో అధికారులకు సీట్లు ఒకలా చూపించి, ఆ తరువాత ఎక్కువమంది ప్రయాణికులు పట్టేలా మార్చేస్తున్నారు. బస్సుకు పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే ప్రయాణికులు సురక్షితంగా సకాలంలో బయటకు వచ్చేందుకు వీలుగా ఏర్పాటుచేసిన అత్యవసర ద్వారాన్ని కూడా మూసేసి అక్కడ సీట్లను ఏర్పాటుచేస్తున్నారు. దీనివల్ల ప్రమాదం జరిగితే ప్రయాణికులు బయటపడేమార్గం ఉండడం లేదు. టూరిస్ట్ బస్సులుగా తిప్పేందుకు అనుమతులు తీసుకుని కొందరు స్టేజ్ క్యారియర్లుగా తిప్పుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇక స్లీపర్ బస్సుల్లో ప్రయాణికులు నడిచేందుకు కేవలం ఒకటి, రెండు అడుగులు మాత్రమే ఖాళీ ఉంటుంది. విశాలమైన మార్గం లేకపోవడంతో ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు సకాలంలో బయటపడేందుకు వీలుండడం లేదు. పైగా రాష్ట్రంలో తిరుగుతున్న ట్రావెల్స్ బస్సులన్నీ ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల్లో రిజిస్ర్టేషన్ జరిగినవే కావడంతో ఇక్కడి అధికారులకు బస్సుల్లో మార్పులు చేస్తే రిజిస్ర్టేషన్ జరగకుండా నిలుపుదల చేసేందుకు అవకాశం ఉండడం లేదు.
వరుస ప్రమాదాల నేపథ్యంలో తనిఖీలు
గత నెల 15న రాజస్థాన్‌లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఒకటి దగ్ధమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేటు ట్రావెల్స్‌లో భద్రత, ట్రావెల్స్ నిర్వాహకులు నిబంధనలు మేరకు బస్సులను తిప్పుతున్నారా?, లేదా?...అనేది తనిఖీ చేయాలని రవాణా శాఖ అధికారులను ఆశాఖ కమిషనర్ మనీష్‌కుమార్‌సిన్హా ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ ఆర్‌సీహెచ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ తనిఖీ ప్రారంభించారు. తాజాగా కర్నూలు జిల్లాలో కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురవ్వడంతో మరింత ముమ్మరం చేశారు. గత 11 రోజుల్లో జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 56 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదుచేసి రూ.పది లక్షలు జరిమానా విధించారు. ఇవికాకుండా శుక్రవారం ఆరు, శనివారం 16 బస్సులపై కేసులు నమోదుచేశారు. శుక్రవారం కేసులు నమోదుచేసిన ఆరు బస్సుల్లో రెండింటికి పర్మిట్‌లు లేకపోవడంతో సీజ్ చేశారు. శనివారం మరో ఆరు బస్సులను సీజ్ చేశారు. శనివారం సీజ్‌చేసిన వాటిలో వర్షిణి, కావేరి, ఏఆర్ ట్రావెల్స్, శ్రీకృష్ణ ట్రావెల్స్, కేఆర్‌టీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు ఉన్నాయి. వీటిల్లో సీట్లను మార్చడం, అత్యవసర ద్వారం మూసేసి అక్కడ అదనంగా సీట్లను ఏర్పాటుచేయడం, పర్మిట్లు లేకపోవడం వంటి ఉల్లంఘనలు గుర్తించినట్టు డీటీసీ ఆర్‌సీహెచ్ శ్రీనివాసరావు వివరించారు.