పారదర్శకంగా భూ సమీకరణ
ABN , Publish Date - Aug 05 , 2025 | 01:09 AM
విశాఖ మెట్రో రీజనల్ డెవలప్‌మెంట్ అఽథారిటీ (వీఎంఆర్‌డీఎ) కోసం జిల్లాలోని ఆనందపురం, పద్మనాభం మండలాల్లో 1,941 ఎకరాలు సమీకరిస్తున్నామని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ తెలిపారు.
ఆనందపురం, పద్మనాభం మండలాల్లో 1,941 ఎకరాలు...
త్వరలో గ్రామ సభలు
ఎండాడ, పీఎంపాలెం, అగనంపూడిల్లో రైతుబజార్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్
విశాఖపట్నం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి):
విశాఖ మెట్రో రీజనల్ డెవలప్‌మెంట్ అఽథారిటీ (వీఎంఆర్‌డీఎ) కోసం జిల్లాలోని ఆనందపురం, పద్మనాభం మండలాల్లో 1,941 ఎకరాలు సమీకరిస్తున్నామని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా భూసమీకరణ పారదర్శకంగా చేపడతామన్నారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆనందపురం మండలం గిడిజాలలో 309 ఎకరాలు, గోరింటాలో 198 ఎకరాలు, శొంఠ్యాంలో 251, బీడీపాలెంలో 122 ఎకరాలు, పద్మనాభం మండలం కొవ్వాడలో 250 ఎకరాల సమీకరణకు నోటిఫికేషన్ జారీచేశామన్నారు. ఇందులో ప్రభుత్వ భూములతోపాటు రైతులకు ఇచ్చిన పట్టా భూములు, రైతుల ఆక్రమణలో ఉన్నవి కొంతమేర ఉన్నాయన్నారు. త్వరలో గ్రామ సభలు నిర్వహించి భూముల స్థితిపై ప్రజలకు తెలియజేసి నివేదిక రూపొందిస్తామన్నారు. రెవెన్యూ రికార్డుల్లో కొత్తగా చేర్పులపై అప్రమత్తంగా ఉన్నామన్నారు. ప్రతి గ్రామంలో డ్రోన్ సర్వే నిర్వహించి భూముల తాజా స్థితిని తెలుసుకుంటామన్నారు. రైతుల ఆక్రమణలో ఉన్న భూముల్లో పంటల సాగు చేస్తున్నారా? లేదా అనేదానిపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారుల ద్వారా సర్వే చేస్తామన్నారు. భూసమీకరణ ప్రక్రియ ఐదారు నెలల్లో పూర్తిచేస్తామని జేసీ తెలిపారు.
జిల్లాలో డిమాండ్ మేరకు ఎండాడ, పీఎంపాలెం, అగనంపూడిల్లో కొత్తగా రైతుబజార్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు. కొత్త రైతుబజార్ల ఏర్పాటుకు స్థలాలు ఎంపిక చేశామని తెలిపారు. ఆరిలోవ రైతుబజార్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. మధురవాడ రైతుబజార్ ఎదురుగా ఉన్న ఆక్రమణలు తొలగించాలని జీవీఎంసీకి లేఖ రాశామని జేసీ తెలిపారు. ఎండీయూల రద్దు తరువాత రేషన్ డిపోల ద్వారా బియ్యం పంపిణీ గాడిలో పడిందని, చిన్నచిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే పరిష్కస్తామని పేర్కొన్నారు.
పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం రవాణాపై నిఘా
నేడు పోర్టు, కస్టమ్స్ అధికారులతో మంత్రి నాదెండ్ల భేటీ
విశాఖపట్నం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి):
పేదలకు అందాల్సిన బియ్యం విదేశాలకు తరలిపోతున్న వ్యవహారంపై ప్రభుత్వం దృష్టిసారించింది. విశాఖ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నట్టు ఏడాదికాలంలో రెండు పర్యాయాలు గుర్తించారు. ఒకసారి పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్, మరోసారి ఆ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పోర్టు అధికారులు, కస్టమ్స్ అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం కానున్నారు. కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పట్టుకున్నారు. ఆ తరువాత అక్కడ నిఘా పెంచడంతో బియ్యం అక్రమ రవాణాదారులు విశాఖ పోర్టు నుంచి ఎగుమతులు చేయడం మొదలెట్టారు. కొద్దిరోజులు గుట్టుగా సాగిన ఈ వ్యవహారం మంత్రే స్వయంగా తనిఖీ చేయడంతో బయటపడింది. రెండు నెలల క్రితం అధికారులు దాడులు చేసి మరో కంటెయినర్‌ను పట్టుకున్నారు. ఈ క్రమంలో పీడీఎస్ బియ్యం ఎగుమతిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదని మంగళవారం జరగనున్న సమావేశంలో పోర్టు అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పే అవకాశం ఉంది. విశాఖ పోర్టు నుంచి ఎగుమతి, దిగుమతి కోసం సుమారు పదికి పైగా ఫ్రైట్ కంటెయినర్ గోదాములు ఉన్నాయి. ఏపీ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా నుంచి పలు రకాల వస్తువులు ఇక్కడ నుంచి ఎగుమతి కోసం గోదాముల్లో తాత్కాలికంగా నిల్వ చేస్తారు.
ఉత్తరాంధ్ర జిల్లాల పౌర సరఫరాల శాఖాధికారులతో సమావేశం
పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం ఉదయం విశాఖ కలెక్టరేట్‌లో ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఎండీయూ వాహనాల రద్దు తరువాత రేషన్ డిపోల్లో సరుకుల పంపిణీ తీరు, ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణ, ఇతరత్రా అంశాలపై చర్చించనున్నారు. పలు జిల్లాల్లో ఖాళీగా ఉన్న డిపోలకు డీలర్ల నియామకంపై సూచనలు ఇచ్చే అవకాశం ఉంది.
ఫాగింగ్ పేరుతో దోపిడీపై కమిషనర్ ఆరా
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
విశాఖపట్నం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ పరిధిలో ఫాగింగ్ పేరుతో జరుగుతున్న అవినీతిపై జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ అధికారులను ఆరా తీశారు. ఫాగింగ్ పేరిట డీజిల్‌ను పక్కదారి పట్టించడంపై ‘మహా దోపిడీ’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో సోమవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై కమిషనర్ కేతన్‌గార్గ్ ప్రజారోగ్య విభాగం అధికారులకు ఫోన్ చేసి ఆరా తీసినట్టు తెలిసింది. ఫాగింగ్ యంత్రాలు ఎన్ని ఉన్నాయి?, ఒక్కోదానికి ఎంత డీజిల్ ఖర్చవుతుందనే వివరాలు అడిగినట్టు సమాచారం. మెగా ఫాగింగ్ యంత్రానికి గంటకు 40 లీటర్లు డీజిల్ అవసరం అవుతుందని అధికారులు నివేదిక ఇవ్వడంపై కూడా కమిషనర్ ప్రశ్నించినట్టు తెలిసింది. సదరు అధికారి నివేదికను తప్పుగా ఇచ్చారని, వాస్తవంగా గంటకు వంద లీటర్లు అవుతుందని కిందిస్థాయి సిబ్బంది చెబుతున్నారని అధికారులు వివరణ ఇచ్చినట్టు తెలిసింది. మంగళవారం దీనిపై సమగ్ర సమాచారం తనకు అందజేయాలని కమిషనర్ ఆదేశించినట్టు సమాచారం.
అప్పన్నకు రూ.2.79 కోట్ల ఆదాయం
సింహాచలం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి):
వరాహ లక్ష్మీనృసింహస్వామికి గడచిన 28 రోజుల్లో భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా సుమారు రూ.2.78 కోట్ల ఆదాయం లభించింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు ఆధ్వర్యంలో సోమవారం పరకామణి కేంద్రంలో కానుకలు లెక్కించారు. హుండీల ద్వారా రూ.2,78,53,475 నగదు, 99.5 గ్రాముల బంగారం, 11.35 కిలోల వెండి ఆభరణాల రూపంలో సమకూరింది. ఇంకా 704 యూఎస్ డాలర్లు, 110 ఆస్ట్రేలియా కరెన్సీ, 55 యూరో కరెన్సీ, 260 టర్కీ కరెన్సీ, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్, యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, నేపాల్, మలేషియా, ఇండోనేషియా తదితర దేశాలకు చెందిన కరెన్సీ అప్పన్న ఖజానాకు లభించింది. కానుకల లెక్కింపులో పలు సేవాసంస్థల కార్యకర్తలు, దేవస్థానంలోని పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.