మద్యం విక్రయాల్లో పారదర్శకత
ABN , Publish Date - Oct 17 , 2025 | 12:42 AM
ములకలచెరువు నకిలీ మద్యం ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన తర్వాత కూటమి ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నది. కల్తీ మద్యానికి చోటివ్వకుండా, దుకాణాల్లో ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు విక్రయించకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్ఠ చర్యలు చేపట్టింది. బెల్టు దుకాణాల విషయంలో కఠిన వ్యవహరించాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించింది.
నకిలీ అడ్డుకట్టకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు
అందుబాటులోకి ‘ఎక్సైజ్ సురక్షా’ యాప్
మద్యం బాటిల్‌ను స్కాన్ చేసిన తరువాతే విక్రయం
ఎక్కడ, ఎప్పుడు తయారైంది, బ్యాచ్ నంబరుతో సహా మొబైల్ స్ర్కీన్‌పై ప్రత్యక్షం
వాయిస్ ఓవర్ ప్రకటన వచ్చేలా ఏర్పాట్లు
నర్సీపట్నం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ములకలచెరువు నకిలీ మద్యం ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన తర్వాత కూటమి ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నది. కల్తీ మద్యానికి చోటివ్వకుండా, దుకాణాల్లో ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు విక్రయించకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్ఠ చర్యలు చేపట్టింది. బెల్టు దుకాణాల విషయంలో కఠిన వ్యవహరించాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా నకిలీ మద్యానికి చెక్ పెట్టడానికి ‘ఎక్సైజ్ సురక్షా యాప్’ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వైన్ షాపులో మద్యం విక్రయించే సమయంలో మద్యం సీసా మూతపై వుండే హెచ్‌ఈఏఎల్ అనే స్టిక్కర్‌ను తప్పని సరిగా స్కాన్ చేయాలి. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో జిల్లాలోని అన్ని మద్యం షాపుల్లో సిబ్బంది గురువారం ఉదయం నుంచే ‘ఎక్సైజ్ సురక్షా యాప్’తో మద్యం సీసాలను స్కాన్ చేసి విక్రయిస్తున్నారని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ సుధీర్ ‘అంధ్రజ్యోతి’కి చెప్పారు. ఒకటి, రెండు షాపుల్లో సాంకేతిక సమస్య తలెత్తిందని తెలిపారు. శుక్రవారం నుంచి మరో అడుగు ముందుకు వేసి, ‘ఎక్సైజ్ సురక్షా యాప్’తో స్కాన్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ప్రకటన వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
కాగా మందుబాబులు తాము కొనుగోలు చేసింది ఏపీఎస్‌బీసీఎల్ సరఫరా చేసిన మద్యమా?లేకపోతే నకిలీ మద్యమా? అన్నది కూడా తెలుసుకునే వెసులుబాటు వుంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘ఎక్సైజ్ సురక్షా’ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసువాలి. మద్యం సీసా మూత మీద అతికించి ఉన్న క్యూఆర్ కోడ్‌ని ఈ యాప్ సాయంతో స్కాన్ చేస్తే.. ఈ మద్యం ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారైంది, బ్యాచ్ నంబరు వంటి వివరాలు కనిపిస్తాయి. స్కాన్ చేసిన తర్వాత ‘నాట్ ఫౌండ్’ అని స్ర్కీన్ మీద కనిపిస్తే నకిలీ మద్యంగా భావించాలి. ఎక్సైజ్ సిబ్బందికి, మద్యం దుకాణదారులకు, వాటిల్లో పని చేసే సిబ్బందికి ఎక్సైజ్ సురక్షా యాప్ వినియోగంపై అవగాహన కల్పించడానికి ఎక్సైజ్ ఉన్నతాధికారులు జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు.
ఇదిలాఉండగా సురక్షా యాప్ స్కానింగ్ బీరుకి పనిచేయదు. బీరు సీసా మీద ఉన్న బార్ కోడ్‌ని స్కాన్ చేస్తే వివరాలు కనిపించవు. దీంతో నకిలీ బీరు అంటూ కొంతమంది సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని, అందులో ఎంత మాత్రం నిజం లేదని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు.