నేటితో బదిలీలకు తెర
ABN , Publish Date - Jun 09 , 2025 | 01:17 AM
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు సంబంధించి సోమవారంతో తెర పడనున్నది.
కోరుకున్న చోటకు వెళ్లేందుకు పలువురు ఉద్యోగులు భారీగా సిఫారసు లేఖలు
రెవెన్యూ శాఖలో కొలిక్కిరాని జాబితా
జలవనరులశాఖలో నేడు కౌన్సెలింగ్
విశాఖపట్నం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు సంబంధించి సోమవారంతో తెర పడనున్నది. ఈ ఏడాది బదిలీల నిమిత్తం జారీ చేసిన జీవో మేరకు ఈ నెల రెండుతో గడువు ముగిసినప్పటికీ ఆ తరువాత 9వ తేదీ వరకు పొడిగించారు. జిల్లాలోని పలు శాఖల్లో బదిలీలకు సంబంధించి కసరత్తు చాలావరకు పూర్తి చేయగా, కొన్ని శాఖల్లో బదిలీలు చేశారు. ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు తప్పనిసరిగా బదిలీలు చేశారు. గుర్తింపు పొందిన సంఘాల బాధ్యులకు తొమ్మిదేళ్ల వరకు మినహాయింపు ఇస్తున్నారు. కాగా కోరుకున్న చోట బదిలీలకు చాలామంది ఉద్యోగులు సిఫారసు లేఖలు తెచ్చుకున్నారు. కొందరు రెండు అంతకంటే ఎక్కువగా ప్రజాప్రతినిధుల నుంచి లేఖలు పొందారు. కొందరు ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉండే ఉద్యోగుల కోసం సంబంధిత అధికారులకు స్వయంగా చెప్పడంతోపాటు ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వంలో కీలకమైన రెవెన్యూ శాఖలో బదిలీలకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా చేస్తున్న బదిలీలకు విశాఖ కలెక్టర్ నోడల్ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో అనకాపల్లి, అల్లూరి జిల్లాల పరిఽధిలో గల ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జాబితాలు ఆయా జిల్లాల కలెక్టర్లు పంపాలి. జూనియర్ అసిస్టెంట్ నుంచి డీటీ వరకు బదిలీలపై కొంతవరకు జాబితాలు సిద్ధమైనా తహశీల్దార్ల విషయంలో లెక్క తేలలేదని తెలిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి అనకాపల్లి, విశాఖ జిల్లాకు, అనకాపల్లి నుంచి విశాఖ, అల్లూరి జిల్లాలకు రానున్న తహశీల్దార్ల సంఖ్య ఎంతన్నది తేలాలి. అప్పుడు విశాఖ నుంచి మిగిలిన రెండు జిల్లాలకు పంపే తహశీల్దార్ల సంఖ్యపై స్పష్టత వస్తోంది. ఈ నేపథ్యంలో తహశీల్దార్ల బదిలీలపై అనిశ్చితి కొనసాగుతుందనే వాదన వినిపిస్తోంది.
కాగా జిల్లా వరకు చూస్తే కొందరు తహశీల్దార్లను బదిలీ చేయాలని అధికారులు నిర్ణయించారు. వీరిలో ఒకరిద్దరి విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతుందనే ప్రచారం జరుగుతుంది. జిల్లాలో భూముల విలువ ఎక్కువగా ఉండే ఓ మండల తహశీల్దారుపై వస్తున్న ఆరోపణలు, పనితీరుతో బదిలీ చేయాలని అక్కడ ఎమ్మెల్యే తొలుత జిల్లా యంత్రాంగానికి సూచించారు. ఇందుకు అనుగుణంగా బదిలీకి యంత్రాంగం నిర్ణయించింది. అయితే ఏం జరిగిందో గానీ తాజాగా సదరు తహశీల్దారును బదిలీ చేయవద్దని ఒత్తిడి తెస్తున్నారని రెవెన్యూ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. మరో తహశీల్దారును అప్రాధాన్యత గల మండలానికి పంపాలని నిర్ణయించారు. కలెక్టరేట్‌లో నాలుగు సెక్షన్లు ఉండగా ప్రస్తుతం రెండింటికీ ప పూర్తి స్థాయి సూపరింటెండెంట్లు ఉండగా, మరో రెండు ఇన్‌చార్జిలతో నడుస్తున్నాయి. రెగ్యులర్ సూపరింటెండెంట్లలో ఏవోగా ఉన్న ఈశ్వరరావు వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. అందువల్ల కలెక్టరేట్‌లోని నాలుగు సెక్షన్లకు పూర్తి స్థాయిలో సూపరింటెండెంట్లను నియమించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అనకాపల్లి, అల్లూరి జిల్లాల నుంచి సీనియర్లను తీసుకురావడం, జిల్లాలో ఉన్న డీటీలలో సీనియర్లకు అడహాక్ పదోన్నతులు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇదిలావుండగా జలవనరుల శాఖలో బదిలీలకు సంబంధించి సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ శాఖలో బదిలీల కోసం పలువురు ఉద్యోగులు రెండు అంత కంటే ఎక్కువగా సిఫారసు లేఖలు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేసే అవకాశం ఉందని కొందరు ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.