వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీలు షురూ..
ABN , Publish Date - Jun 02 , 2025 | 01:05 AM
వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీల ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఇప్పటికే ఇతర ప్రభుత్వ శాఖల్లో బదిలీలు జరుగుతుండగా.. ఆరోగ్యశాఖలో మాత్రం ఈ ప్రక్రియ ఇప్పటివరకు ప్రారంభం కాలేదు.
విధి విధానాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆరోగ్యశాఖ
ఒకేచోట ఐదేళ్లు దాటి పనిచేస్తున్న ఉద్యోగులకు తప్పని స్థానచలనం
విశాఖపట్నం, జూన్ 1 (ఆంధ్రజ్యోతి):
వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీల ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఇప్పటికే ఇతర ప్రభుత్వ శాఖల్లో బదిలీలు జరుగుతుండగా.. ఆరోగ్యశాఖలో మాత్రం ఈ ప్రక్రియ ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల కాకపోవడం వల్లే కాస్త ఆలస్యమైంది. అయితే శనివారం రాత్రి ఆరోగ్యశాఖ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన విధి విధానాలను విడుదల చేసింది. దీంతో ఆరోగ్యశాఖలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయంతోపాటు బోధనాస్పత్రుల్లో ఐదేళ్ల నుంచి పనిచేస్తున్న ఉద్యోగులందరికీ తాజా బదిలీల్లో స్థానచలనం కలగనున్నది. 25 ఏళ్ల తరువాత జూనియర్ అసిస్టెంట్లను కూడా బదిలీ చేస్తున్నారు. దీంతో అనేకచోట్ల పెరిగిన అవినీతి, వసూళ్ల వ్యవహారాలకు అడ్డుకట్ట పడేందుకు అవకాశం ఏర్పడుతుంది. కొన్నిచోట్ల కొత్తవారిని రానివ్వకుండాఎంతోమంది ఉద్యోగులు పాతుకుపోయారు. ఇటువంటి వారి వల్ల అనేకచోట్ల అవినీతికి ఆస్కారం ఏర్పడుతోంది. తాజా బదిలీల్లో ఇలాంటి వారంతా కొత్త ప్రాంతాలకు వెళ్లనున్నారు. దీనివల్ల అవినీతికి చెక్ పడుతుందని పలువురు పేర్కొంటున్నారు. తాజా బదిలీలతో ఆరోగ్యశాఖలోని కీలక సెక్షన్లు, కేజీహెచ్, ఇతర ప్రభుత్వాస్పత్రుల్లోని కొన్ని విభాగాల్లో అవినీతికి అడ్డుకట్ట పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ మార్గదర్శకాలు..
బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను చూస్తే ఒకేచోట ఐదేళ్లు దాటి పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ట్రాన్స్‌ఫర్ చేయనున్నారు. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల్లో ఆఫీస్ బేరర్లుగా ఉండి ఒకే ఇనిస్టిట్యూట్‌లో మూడు నుంచి తొమ్మిదేళ్లలోపు పనిచేస్తున్న వారిని తప్పనిసరిగా మరో ఇనిస్టిట్యూట్ (లోకల్)కు మార్చాల్సి ఉంటుంది. లోకల్‌గా లేకపోతే బయటకు వెళ్లాల్సి ఉంటుంది. తొమ్మిదేళ్లు దాటితే తప్పనిసరిగా బదిలీ కావాలి. ఆఫీస్ బేరర్స్ కాని ఉద్యోగులు మూడు నుంచి ఐదేళ్లలోపు ఒకే ఇనిస్టిట్యూట్‌లో పనిచేస్తుంటే.. తప్పనిసరిగా లోకల్‌గా ఉన్న మరో ఇనిస్టిట్యూట్‌కు బదిలీ కావాల్సి ఉంటుంది. లోకల్‌గా వేకెన్సీ లేకపోతే తప్పనిసరిగా మరో ప్రాంతానికి వెళ్లాల్సిందే. ప్రతి ఉద్యోగి బదిలీ కావాలనుకుంటే ఐదు ప్రాంతాలను ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. ఈ మేరకు ఆయా కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగుల వివరాలను ఈ నెల మూడో తేదీలోగా కార్యాలయా ఆవరణలో డిస్ ప్లే చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు తమ దరఖాస్తులను బదిలీ అధికారికి మూడో తేదీలోగా అందించాలి. అలాగే ఏమైనా మార్పులు, చేర్పులకు సంబంధించిన వివరాలను 4, 5 తేదీల్లోగా బదిలీలకు సంబంధించిన కంట్రోలింగ్ అధికారికి అందించవచ్చు. 6 నుంచి 8వ తేదీలోగా ఉన్నతాధికారులు ఆయా దరఖాస్తులను పరిశీలిస్తారు. 9న ఉద్యోగులు ఎంపిక చేసుకున్న స్థానాలతో కూడిన జాబితాను పొందుపరిచి గ్రీవెన్స్‌లను కోరుతారు. 10, 11 తేదీల్లో ఏమైనా అభ్యంతరాలుంటే తెలియజేయవచ్చు. 12 నుంచి 14వ తేదీల మధ్య అభ్యంతరాలను నివృత్తి చేసి తుది జాబితాను అధికారులు పొందుపరుస్తారు. అదేవిధంగా 15 నుంచి 17వ తేదీల మధ్య బదిలీలకు సంబంధించి కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తారు.