Share News

బదిలీల హడావిడి

ABN , Publish Date - May 19 , 2025 | 12:22 AM

ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేశారు.

బదిలీల హడావిడి

  • - రెవెన్యూ శాఖలో పలువురు తహశీల్దార్లకు స్థానచలనం తప్పదా?

  • - ఏజెన్సీ నుంచి విశాఖకు పలువురి రాక

  • - ట్రెజరీ విభాగంలో ఏళ్ల తరబడి తిష్ఠ వేసిన కొందరు ఉద్యోగులు

  • - జూన్‌ 2వ తేదీలోగా ముగియనున్న ప్రక్రియ

విశాఖపట్నం, మే 18 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేశారు. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు బదిలీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో జిల్లాలో పలు ప్రభుత్వశాఖల్లో బదిలీల హడావిడి మొదలైంది. ఈ ఏడాది మే 31 నాటికి ఒకేచోట ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలన్న ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అన్ని శాఖల్లో ఉన్న అటువంటి ఉద్యోగులను గుర్తించే పనిలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాల విభజన తరువాత అన్ని శాఖల్లో కొందరు ఉద్యోగులకు స్థానచలనం జరిగింది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన బదిలీలు నిర్వహించడంతో 2022 ఏప్రిల్‌ నాటికి మిగిలిన ఉద్యోగుల్లో ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసిన వారికి బదిలీలు అనివార్యమని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులు విశాఖ జిల్లాకు రావడానికి అవకాశం ఏర్పడింది. నోడల్‌ జిల్లాగా ఉండడంతో విశాఖ కలెక్టర్‌ ఆధ్వర్యంలోనే బదిలీలు జరగనున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో బదిలీలు కోరుకునే ఉద్యోగుల వివరాలను పంపాలని అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లకు ఆయన లేఖలు రాయనున్నారు.

రెవెన్యూ శాఖలో బదిలీలకు భారీ కసరత్తు

రెవెన్యూ శాఖలో బదిలీల కోసం భారీ కసరత్తు జరిగే అవకాశం ఉంది. ఏజెన్సీలో ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసి 55 ఏళ్లు దాటిన ఉద్యోగులు విశాఖ లేదా అనకాపల్లి జిల్లాకు రావడానికి నిర్ణయించుకున్నారు. గత ఏడాది బదిలీల్లో విశాఖ జిల్లాకు రావడానికి దరఖాస్తు చేసిన ముగ్గురు తహసీల్దార్లను అల్లూరి సీతారామరాజు జిల్లా యంత్రాంగం రిలీవ్‌ చేయలేదు. మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీకి వెళ్లేందుకు కొందరు విముఖత చూపడంతో ఈ ముగ్గురు తహసీల్దార్లు పాడేరు డివిజన్‌లోనే పనిచేస్తున్నారు. జిల్లాల విభజన సమయంలో జూనియర్లను పాడేరు జిల్లాకు పంపడంలో అప్పటి అధికారులు చేసిన పొరపాట్లను ప్రస్తుత అధికారులు సవరించాలని పలువురు కోరుతున్నారు. కాగా విశాఖ జిల్లాలో పనిచేస్తున్న కొద్దిమంది తహసీల్దార్లకు బదిలీ తప్పదని రెవెన్యూ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏరికోరి మండలాలకు పోస్టింగ్స్‌ కోసం సిఫారసు చేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు వారి విషయంలో విభేదిస్తున్నారు. ఇద్దరు ముగ్గురు తహసీల్దార్లు జిల్లా యంత్రాంగం అంచనాలకు భిన్నంగా పనిచేయడం లేదని, భూ లావాదేవీల్లో ఆరోపణలు చుట్టుముట్టడంతో వారికి బదిలీలు తప్పవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అదేవిధంగా పౌరసరఫరాలశాఖలో పలువురు అఽధికారులు, చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్లకు బదిలీలు జరుగుతాయని పలువురు పేర్కొంటున్నారు. ఏఎస్‌వో కేడర్‌ అధికారి ఒకరు డీలర్ల సంఘ నేత ద్వారా సొంతంగా రేషన్‌ డిపోలను నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉమ్మడి జిల్లాలో టీడీపీ సీనియర్‌ నేత మనిషినంటూ జిల్లా అధికారులను లెక్కచేయడం లేదనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సదరు ఏఎస్‌వోపై బదిలీ వేటు పడవచ్చని ప్రచారం జరుగుతోంది.

విశాఖ ఖజానా శాఖలో ఏళ్ల తరబడి పలువురు తిష్ఠ

విశాఖ జిల్లా ఖజానాశాఖ కార్యాలయంలో పలువురు ఉద్యోగులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నారు. వీరిలో పలువురిపై పలు రకాల ఆరోపణలున్నాయి. ఓ ఉద్యోగి 15 ఏళ్లుగా ఇక్కడే తిష్ఠ వేశారు. అటెండరుగా చేరిన ఉద్యోగి ఒకరు జూనియర్‌ అకౌంటెంట్‌గా, ఆ తరువాత సీనియర్‌ అకౌంటెంట్‌గా పదోన్నతి పొంది ఇక్కడే పని చేస్తున్నారు. అలాగే సర్వీస్‌ కమిషన్‌ ద్వారా రిక్రూట్‌ అయిన ఉద్యోగులు కొందరు మధ్యలో అనకాపల్లి జిల్లాకు వెళ్లి ఏడాదిలో తిరిగి విశాఖ వచ్చి ఇక్కడే కొనసాగుతున్నారు.

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గం సుగమం

జిల్లా విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీలకు దాదాపు మార్గం సుగమం అయింది. ఇందుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్‌ వెలువడనున్నది. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన జరిగే బదిలీల కోసం విద్యాశాఖ జాబితా రూపొందించింది. ఒకేచోట ఐదేళ్లు/ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న ఉపాధ్యాయులు సుమారు 2,300 మంది వరకు ఉంటారని అంచనా వేశారు. ఇంకా మరో రెండువేల మంది వరకు బదిలీలు జరుగుతాయని అంటున్నారు. ఉమ్మడి జిల్లా మొత్తంగా ఐదువేల మంది టీచర్లకు బదిలీలు జరుగుతాయని ఉపాధ్యాయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత ఈ పర్యాయం భారీగా బదిలీలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.

Updated Date - May 19 , 2025 | 01:00 AM