Share News

నలుగురు సీఐల బదిలీ

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:55 AM

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నలుగురు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లకు బదిలీ చేస్తూ సీపీ శంఖబ్రతబాగ్చి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

నలుగురు సీఐల బదిలీ

విశాఖపట్నం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి):

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నలుగురు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లకు బదిలీ చేస్తూ సీపీ శంఖబ్రతబాగ్చి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. గాజువాక ట్రాఫిక్‌ సీఐగా పనిచేస్తున్న పి.కోటేశ్వరరావును సిటీ ట్రైనింగ్‌ సెంటర్‌కు బదిలీ చేశారు. సీటీసీలో పనిచేస్తున్న ఎల్‌.సన్యాసినాయుడును గోపాలపట్నం సీఐగా నియమించి, అక్కడ పనిచేస్తున్న ఎన్‌వీ ప్రభాకరరావును కంట్రోల్‌రూమ్‌కు బదిలీచేశారు. కంట్రోల్‌రూమ్‌లో పనిచేస్తున్న షేక్‌ హుస్సేన్‌ను గాజువాక ట్రాఫిక్‌ సీఐగా బదిలీ చేశారు.


పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం...

డీఆర్‌ఎం పర్యవేక్షణలో పునరుద్ధరణ పనులు

విశాఖపట్నం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం డివిజన్‌లోని విజయనగరం స్టేషన్‌ వద్ద శుక్రవారం ఉదయం గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. రెండు వ్యాగన్లు బోల్తా పడ్డాయి. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖ-విజయనగరం, విశాఖ-పలాస, విశాఖ-బ్రహ్మపూర్‌, విశాఖ-కొరాపుట్‌ మధ్య నడిచే పాసింజర్‌ రైళ్లతోపాటు విశాఖ-దుర్గ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (22820), విశాఖ-దుర్గ్‌ ఎక్స్‌ప్రెస్‌ (18530) రైళ్లను శుక్రవారం రద్దు చేశారు. విశాఖ-భవానీపట్న మధ్య రాకపోకలు సాగించే పాసింజర్‌ రైళ్లను (58503/58504) విశాఖ-పార్వతీపురం టౌన్‌ మధ్య నడిపారు. భువనేశ్వర్‌-ముంబై కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (11020), పూరి-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (22883) రైళ్లు నిర్ణీత సమయం కంటే నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరేలా రీ షెడ్యూల్‌ చేశారు. సమాచారం తెలుసుకున్న డీఆర్‌ఎం లలిత్‌ బొహ్రా, ఇతర అధికారులు హుటాహుటిన విశాఖపట్నం నుంచి ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఆర్‌ఎం పర్యవేక్షణలో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు.


1, 2 తేదీలో టీయూ-142

మ్యూజియం మూసివేత

విశాఖపట్నం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి):

ఆర్కే బీచ్‌రోడ్డులోని టీయూ-142 విమాన మ్యూజియాన్ని నిర్వహణ పనుల కోసం సెప్టెంబరు 1, 2 తేదీల్లో మూసివేస్తున్నట్టు వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌ శుక్రవారం తెలిపారు. తిరిగి మూడో తేదీ అంటే బుధవారం నుంచి యథావిధిగా సందర్శకులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

Updated Date - Aug 30 , 2025 | 01:55 AM