రైళ్లకు సంక్రాంతి తాకిడి
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:28 AM
సంక్రాంతి సమయంలో ప్రధాన రైళ్లలో బెర్త్ లభించడం గగనంలా ఉంది.
ప్రధాన రైళ్లలో నో బెర్త్
పండుగ ముందు విశాఖ నుంచి హౌరా, చెన్నై, బెంగళూరు వెళ్లే రైళ్లకు, తరువాత సికింద్రాబాద్ వైపు నడిచే రైళ్లకు కనీసం టికెట్ కూడా లభించని పరిస్థితి
ప్రత్యేక రైళ్లలో కూడా
జనవరి 18న అన్ని రైళ్లకు రిగ్రెట్....
విశాఖపట్నం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి):
సంక్రాంతి సమయంలో ప్రధాన రైళ్లలో బెర్త్ లభించడం గగనంలా ఉంది. పండుగకు ముందు సికింద్రాబాద్ నుంచి విశాఖ వచ్చే రైళ్లకు, తరువాత ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైళ్లకు తీవ్ర డిమాండ్ ఏర్పడి రిగ్రెట్ (టికెట్ బుక్ చేసుకోలేని పరిస్థితి) కనిపిస్తోంది. దూర ప్రాంతాల నుంచి విశాఖ మీదుగా నడిచే కోణార్క్, ఫలక్‌నుమా, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకూ జనవరి 22 వరకూ డిమాండ్ ఏర్పడింది. అదేవిధంగా పండుగ ముందు విశాఖ మీదుగా హౌరా, చెన్నై, బెంగళూరు వెళ్లే రైళ్లలో బెర్త్ లభించే పరిస్థితి లేదు.
18న అన్ని రైళ్లకు రిగ్రెట్
పండుగ ముగిసిన తర్వాత అత్యధిక శాతం తిరుగు ప్రయాణికులు ఆదివారం (18న) తిరుగు ప్రయాణమవుతారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్, చర్లపల్లి, మహబూబ్‌నగర్ వెళ్లే అన్ని ప్రధాన రైళ్లకు జనవరి 18న రిగ్రెట్ ఏర్పడింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు దువ్వాడ మీదుగా చర్లపల్లికి నడుపుతున్న ప్రత్యేక రైళ్లలో కూడా జనవరి 18, 19న బెర్తులు నిండిపోయాయి.
ప్రతి ఆది, సోమ, శుక్రవారం విశాఖ మీదుగా నడిచే సంబల్‌పూర్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ (20809)కు జనవరి 16, 18, 19 తేదీల్లో రిగ్రెట్ ఏర్పడగా 23న నిరీక్షణ జాబితా నెలకొంది. ప్రతి మంగళ, బుధ, శనివారాల్లో అందుబాటులో ఉన్న విశాఖ-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ (20811)కు జనవరి 17న రిగ్రెట్, 20, 21 తేదీల్లో నిరీక్షణ జాబితా ఉంది. ప్రతి ఆది, మంగళ, గురువారాల్లో విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు నడిచే దురంతో ఎక్స్‌ప్రెస్‌కు జనవరి 18న రిగ్రెట్, 20న నిరీక్షణ జాబితా ఉంది. విశాఖ-సికింద్రాబాద్ ఏసీ ఎక్స్‌ప్రెస్ (12783)కు జనవరి 18న రిగ్రెట్ కాగా భువనేశ్వరి నుంచి బయలుదేరే విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు (17015) జనవరి 15 నుంచి డిమాండ్ ఏర్పడింది.
ప్రత్యేక రైళ్లలో బెర్తులు ఫుల్
దువ్వాడ మీదుగా శ్రీకాకుళం రోడ్డు, అగర్తల నుంచి చర్లపల్లికి నడవనున్న ప్రత్యేక రైళ్లకు పండుగ తిరుగు ప్రయాణికుల రద్దీ ఏర్పడింది. 07293 నంబరు గల శ్రీకాకుళం రోడ్డు-చర్లపల్లి ఎక్స్‌ప్రెస్‌కు జనవరి 18న బెర్తులు ఫుల్ కాగా, ఆది, సోమ, గురు, శనివారాల్లో అందుబాటులో ఉండే విధంగా ప్రవేశపెట్టిన 07291 నంబరు గల శ్రీకాకుళం రోడ్డు-చర్లపల్లి ఎక్స్‌ప్రెస్‌కు జనవరి 17, 19 తేదీల్లో బెర్తులు నిండిపోయాయి. వీటితోపాటు ప్రతి ఆదివారం దువ్వాడ మీదుగా నడుస్తున్న అగర్తల-చర్లపల్లి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (07029), అనకాపల్లి నుంచి చర్లపల్లి వెళ్లే 07036 నంబరు గల ప్రత్యేక రైళ్లకు కూడా జనవరి 18న బెర్తులు నిండిపోయాయి.
పండుగ రోజుల్లో సికింద్రాబాద్ రైళ్లకు ఖాళీ
పండుగ రోజుల్లో జనవరి 11 నుంచి 15 వరకూ సికింద్రాబాద్ వెళ్లే గోదావరి (12727), గరీబ్‌రథ్ (12739), మహబూబ్‌నగర్ (12861), వందేభారత్ (20708), విశాఖ-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ (20811), వందేభారత్ (20833) వంటి రైళ్లకు బెర్తులు ఖాళీ ఉన్నాయి. భువనేశ్వర్ నుంచి వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్ (17015)లో కూడా బెర్తులు లభించే పరిస్థితి ఉంది. అలాగే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12805)కు కూడా ఖాళీలున్నాయి. విశాఖ నుంచి ముంబై వెళ్లే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ (18519)కు జనవరి 11 నుంచి బెర్తులు లభించే పరిస్థితి ఉంటే, భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు (11020) మాత్రం బెర్తులు నిండిపోయాయి. హౌరా, భువనేశ్వర్ నుంచి విశాఖ మీదుగా సికింద్రాబాద్ వెళ్లే కోణార్క్, ఫలక్‌నుమా, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మాత్రం పండుగ రోజుల్లో బెర్తులు లభించే పరిస్థితి లేదు.
హౌరా, చెన్నై, బెంగళూరు రైళ్లకు రిగ్రెట్
సికింద్రాబాద్ వెళ్లే రైళ్లకు పండుగ రోజుల్లో ఖాళీలుండగా...హౌరా, చెన్నై, బెంగళూరు, ముంబై వెళ్లే రైళ్లకు డిమాండ్ ఉంది. హౌరా వెళ్లే మెయిల్ ఎక్స్‌ప్రెస్ (12840), కోరమండల్ (12842), ఈస్ట్ కోస్ట్ (18046)...చెన్నై వెళ్లే మెయిల్ ఎక్స్‌ప్రెస్ (12839), కోరమండల్ (12841), ధన్‌బాద్-అలెప్పీ బొకారో (13351), టాటా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ (18189)...బెంగళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18463) రైళ్లకు జనవరి 10 నుంచి 13 వరకు రిగ్రెట్ రాగా...తర్వాత దాదాపు నెలాఖరు వరకూ నిరీక్షణ జాబితా నెలకొంది.