Share News

రైళ్లు కిటకిట

ABN , Publish Date - Sep 23 , 2025 | 01:25 AM

సోమవారం మధ్యాహ్నం విజయవాడ బయలుదేరిన రత్నాచల్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ కిటకిటలాడింది.

రైళ్లు కిటకిట

దసరా ప్రయాణాలు మొదలు

కిక్కిరిసిన రైల్వే స్టేషన్‌

ప్రధాన రైళ్లలో వచ్చే నెల మొదటి వారం వరకూ బెర్తులు రిజర్వు

విశాఖపట్నం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి):

దసరా ప్రయాణాలు మొదలయ్యాయి. సోమవారం నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడం, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో రైళ్లకు తాకిడి పెరిగింది. సోమవారం విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరిన రైళ్లు కిక్కిరిశాయి.

కిటకిటలాడిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌

సోమవారం మధ్యాహ్నం విజయవాడ బయలుదేరిన రత్నాచల్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ కిటకిటలాడింది. ఆర్పీఎఫ్‌, జీఆర్పీ సిబ్బంది చేపట్టిన చర్యల కారణంగా రైలు ప్రవేశ ద్వారం వద్ద ఎక్కే, దిగే ప్రయాణికులు నియంత్రణ పాటించడంతో ఎటువంటి ఘటనలు చోటుచేసుకోలేదు.

సికింద్రాబాద్‌ రైళ్లకు సాధారణ డిమాండ్‌

విశాఖ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రైళ్లలో గరీబ్‌రఽథ్‌ (12837), గోదావరి (12727) ఎక్స్‌ప్రెస్‌లకు అక్టోబరు 12 వరకూ బెర్తులు రిజర్వు అయిపోయాయి. విశాఖ-మహబూబ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (12861), విశాఖ-ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ (18519) రైళ్లకు సాధారణ డిమాండ్‌ నెలకొంది. ఈ రైళ్లకు ఈ నెల 28 వరకు బెర్తులు నిండిపోగా, దసరా ముందురోజు కొన్ని క్లాసులలో బెర్తులు/ఆర్‌ఏసీ లభించే పరిస్థితి ఉంది. అలాగే విశాఖలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (20833), మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరే వందేభారత్‌ (20708) రైళ్లకు దసరా ముందురోజు సీట్లు అందుబాటులో ఉన్నాయి. విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ (12805)కు అక్టోబరు 6 వరకు ఏసీ చైర్‌కార్‌ సీట్లు నిండిపోయాయి. ప్రతి బుధ, శనివారం నడిచే విశాఖ-నాందేడ్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (20811), ప్రతి ఆది, మంగళ, గురువారం నడిచే దురంతో ఎక్స్‌ప్రెస్‌ (22203)కు కొన్ని తేదీల్లో బెర్తులు/ఆర్‌ఏసీ అందుబాటులో ఉన్నాయి. విశాఖ మీదుగా నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17015), హౌరా-సికింద్రాబాద్‌ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (12703), కోణార్క్‌ (11020), ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (18045) వంటి దూరప్రాంత రైళ్లకు అక్టోబరు 10 వరకూ డిమాండ్‌ నెలకొంది.

చెన్నై, బెంగళూరు, హౌరా రైళ్లు రద్దీ

విశాఖ మీదుగా హౌరా, బెంగళూరు, చెన్నై వెళ్లే రైళ్లకు సోమవారం నుంచి మరింత రద్దీ పెరిగింది. చెన్నై, హౌరా మధ్య రాకపోకలు సాగించే కోరమండల్‌ (12842), మెయిల్‌ (12840), చెన్నై-సంత్రాగచ్చి (22808), చెన్నై-షాలిమార్‌ (22826) వంటి రైళ్లతోపాటు ఇతర ప్రాంతాల నుంచి హౌరా, చెన్నై చేరే రైళ్లు కిటకిటలాడాయి. అలాగే భువనేశ్వర్‌-బెంగళూరు మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ (18463), హౌరా-యశ్వంత్‌పూర్‌ (12863), భువనేశ్వర్‌-బెంగళూరు వంటి పలు రైళ్లు రద్దీగా నడిచాయి.

Updated Date - Sep 23 , 2025 | 01:25 AM