రైళ్లు,బస్సులుఫుల్..
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:34 AM
దసరా ప్రయాణాలు ఊపందుకున్నాయి. రైళ్లన్నీ రద్దీగా మారాయి.
జనసంద్రం.. రైల్వే స్టేషన్
ఊపందుకున్న దసరా ప్రయాణాలు
డైలీ, వీక్లీ, బై వీక్లీ రైళ్లు సైతం రద్దీ
గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌కు మాత్రం అందుబాటులో బెర్తులు
విశాఖపట్నం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి):
దసరా ప్రయాణాలు ఊపందుకున్నాయి. రైళ్లన్నీ రద్దీగా మారాయి. విజయదశమికి మరో మూడు రోజులు మాత్రమే గడువున్న నేపథ్యంలో సొంత ఊర్లకు వెళ్లేవారితో విశాఖ రైల్వే స్టేషన్ ఆదివారం జనసంద్రంగా మారింది. ప్లాట్‌ఫామ్‌లపై ప్రయాణికుల తాకిడి పెరగడంతో జాతర వాతావరణం నెలకొంది. ప్రధానంగా తుని, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ చట్టుప్రక్కల ప్రాంతాలకు వెళ్లే వారితోపాటు ఇతర ప్రాంతాలైన భువనేశ్వర్, హౌరా, చెన్నై, బెంగళూరు చుట్టుప్రక్కల ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో విశాఖ నుంచి బయలుదేరే ఒరిజినేటింగ్ రైళ్లతోపాటు విశాఖ మీదుగా వివిధ ప్రాంతాలకు నడిచే డైలీ, వీక్లీ, బై వీక్లీ రైళ్లు సైతం రద్దీగా కనిపించాయి.
కిటకిటలాడిన ‘రత్నాచల్’
ఉదయం 6.20 గంటలకు విశాఖ నుంచి బయలుదేరే జన్మభూమి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను (12805) మొదలుకుని రాత్రి 11.20 గంటలకు వెళ్లే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ వరకు ప్రయాణికుల తాకిడి నెలకొంది. ప్రధానంగా మధ్యాహ్నం విజయవాడకు బయలుదేరే రత్నాచల్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (12717) ప్రయణికులతో కిక్కిరిసిపోయింది. విజయవాడ నుంచి విశాఖకు చేరిన ప్రయాణికుల సంఖ్య కూడా తోడవ్వడంతో స్టేషన్‌లోని 8వ నంబర్ ప్లాట్‌ఫామ్ రద్దీగా మారింది. రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలకు చేరాల్సిన కొందరు ప్రయాణికులు తిరుమల ఎక్స్‌ప్రెస్ (18521), విశాఖ ఎక్స్‌ప్రెస్ (17015), గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727) వంటి రైళ్ల జనరల్ కోచ్‌లను ఆశ్రయించడంతో అవి కిక్కిరిసి నడిచాయి. దసరా రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది చేపట్టిన చర్యల కారణంగా రైళ్ల ప్రవేశ ద్వారం వద్ద ఎక్కే, దిగే ప్రయాణికులు నియంత్రణ పాటించడంతో ఎటువంటి దుర్ఘటనలు చోటుచేసుకోలేదు.
చెన్నై, బెంగళూరు, హౌరా రైళ్లు రద్దీ
విశాఖ మీదుగా హౌరా, బెంగళూరు, చెన్నై వెళ్లే రైళ్లకు ఆదివారం నుంచి మరింత రద్దీ పెరిగింది. దసరాకు సొంత ఊర్లకు చేరేవారితో రైళ్లన్నీ రద్దీగా నడిచాయి. దీంతో చెన్నై, హౌరా మధ్య రాకపోకలు సాగించే కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (12842), మెయిల్ ఎక్స్‌ప్రెస్ (12840), చెన్నై-సంత్రాగచ్చి (22808), చెన్నై-షాలిమార్ (22826) వంటి రైళ్లతో పాటు ఇతర ప్రాంతాల నుంచి హౌరా, చెన్నై చేరే రైళ్లు కిక్కిరిశాయి. అలాగే హౌరా, బెంగళూరు మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18463), హౌరా-యశ్వంత్‌పూర్ (12863), భువనేశ్వర్-బెంగళూరు వంటి పలు రైళ్లు రద్దీగా నడిచాయి. ఇదిలా ఉండగా విశాఖ మీదుగా హౌరా, చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు నడిచే రైళ్లకు అక్టోబరు నెలాఖరు వరకు బెర్తులు నిండిపోయిన పరిస్థితి ఏర్పడింది.
‘గరీబ్‌రథ్’కు అందుబాటులో బెర్తులు
విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌కు (12739) సోమవారం నుంచి బెర్తులు లభిస్తున్నాయి. అలాగే గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు (12727) కూడా ఏసీ క్లాసు బెర్తులు అందుబాటులో ఉండడం విశేషం. ఈ రెండు రైళ్లకు నవంబరులో కూడా బెర్తులు లభిస్తున్న నేపథ్యంలో దసరా తిరుగు ప్రయాణికులకు ఊరట లభించనున్నది. అలాగే విశాఖలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20833), మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరే వందేభారత్ (20708) రైళ్లకు దసరా ముందు రోజు కూడా సీట్లు అందుబాటులో ఉన్నాయి. విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు (12805) అక్టోబరు ఆరు వరకు ఏసీ చైర్‌కార్ సీట్లు నిండిపోయాయి. ప్రతి బుధ, శనివారం నడిచే విశాఖ-నాందేడు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20811)... ప్రతి ఆది, మంగళ, గురువారం నడిచే దురంతో ఎక్స్‌ప్రెస్ (22203)లకు కొన్ని తేదీల్లో బెర్తులు/ఆర్‌ఏసీ అందుబాటులో ఉన్నాయి. ఇక విశాఖ మీదుగా నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్ (17015), హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్ (12703), కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11020), ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18045) వంటి దూరప్రాంత రైళ్లకు అక్టోబరు పదో తేదీ వరకు డిమాండ్ నెలకొంది.
ఆర్టీసీ బస్సుల్లో కిక్కిరిసిన ప్రయాణికులు
ఆదివారం ఒక్కరోజే ప్రయాణించినవారు 4.2 లక్షల మంది..
90 శాతానికి పైగా ఆక్యుపెన్సీ రేషియో
65 ప్రత్యేక బస్సులు నడిపిన అధికారులు
ద్వారకాబస్‌స్టేషన్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి):
ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు దసరా ప్రయాణికుల తాకిడి మరింత అధికమైంది. తగినన్ని సర్వీసులు లేక ప్రయాణికులు కిక్కిరిసి మరీ బస్సుల్లో ప్రయాణించారు. వారిని నియంత్రించి గమ్య స్థానాలకు చేర్చేందుకు అధికారులు, సిబ్బంది నానాపాట్లు పడ్డారు. అవసరమైనన్ని ప్రత్యేక బస్సులను సమకూర్చేందుకు డిపో మేనేజర్లు అష్టకష్టాలు పడ్డారు. దసరా పండగకు మూడు రోజులే ఉండడం.. వారాంతపు సెలవు కావంతో ఎక్కువ మంది ఆదివారం ప్రయాణాలు పెట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఆర్టీసీకి ప్రయాణికుల తాకిడి పెరిగిపోయింది. విద్య, ఉద్యోగం, వ్యాపార రీత్యా హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, తిరుపతి, భీమవరం వంటి ప్రాంతాల్లో ఉంటున్న ఉత్తరాంధ్ర వాసులు ఆయా ప్రాంతాల నుంచి రైళ్లు, బస్సులు, ఇతర రవాణా సాధనాలను వినియోగించుకుని విశాఖ వచ్చేశారు. వీరంతా ఆర్టీసీ బస్సుల్లోనే తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ద్వారకా బస్‌స్టేషన్, సింహాచలం, మద్దిలపాలెం కాంప్లెక్సులకు చేరుకోవడంతో అవి ప్రయాణికులతో కిటకిటలాడాయి. ప్లాట్‌ఫారాలపై నిలిచిన బస్సుల కెపాసిటీకి మూడు నాలుగు రెట్లు ప్రయాణికులు వేచివున్నారు. ఉన్న బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఆర్డినరీ, పల్లె వెలుగు, ఆలా్ట్ర పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం సాగించేందుకు అధిక సంఖ్యలో మహిళలు వాటి కోసం నిరీక్షించారు. రీజియన్‌లోని స్టీల్ సిటీ, గాజువాక, వాల్తేరు డిపోలకు సంబంధించిన స్త్రీశక్తి బస్సులన్నింటినీ ప్రత్యేక సర్వీసులుగా వివిధ రూట్లలో నడిపినప్పటికీ ప్రయాణికుల రద్దీ అలాగే కొనసాగింది.
ఒక్కరోజే 4.2 లక్షల మంది ప్రయాణం
దసరా దృష్ట్యా ఆదివారం ఒక్కరోజే 4.2 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించినట్టు అధికారులు లెక్కలు కట్టారు. ఇందులో 75 శాతానికి పైగా మహిళలు ఉన్నట్టు టిమ్స్ నుంచి జారీ అయిన జీరో టిక్కెట్ల ఆధారంగా లెక్కలు తేల్చారు. విశాఖ రీజియన్‌లోని 780 బస్సుల్లో స్త్రీశకి ్త అమలుకు ముందు ప్రతిరోజూ 3.1 లక్షల మంది ప్రయాణించేవారు. స్త్రీశక్తి పథకం అమలు తరువాత ఈ సంఖ్య 4.1 లక్షలకు పెరిగింది. దసరా కారణంగా ఆదివారం నాటికి ఈ సంఖ్య 4.2 లక్షలకు చేరింది.
65 ప్రత్యేక సర్వీసులు
పెరిగిన ప్రయాణికులను నియంత్రించేందుకు ఆర్టీసీ అధికారులు ఆదివారం 65 ప్రత్యేక బస్సులను ఆపరేట్ చేశారు. వీటిని కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం, సోంపేట, మందస, విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం రాజాం ప్రాంతాలకు నడిపారు. సిటీ సర్వీసుల్లో 65 బస్సులను ప్రత్యేక సర్వీసులుగా నడపడంతో సిటీ సర్వీసులకు కొరత ఏర్పడింది.
90 శాతానికి పైగా ఓఆర్
దసరా ప్రయాణికుల రవాణా కారణంగా ఆదివారం 90 శాతానికి పైగా సగటు ఆక్యుపెన్సీ రేషియో నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇది అత్యధిక ఆక్యుపెన్సీ రేషియోగా వారు అంచనా వేస్తున్నారు. ప్రయాణికుల డిమాండ్ ఉంటే రాత్రి కూడా ప్రత్యేక బస్సులను నడుపుతామని ఆర్‌ఎం బి.అప్పలనాయుడు తెలిపారు.