Share News

మెరుగైన విద్యాభివృద్ధికి శిక్షణలు దోహదం

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:29 AM

మెరుగైన విద్యాభివృద్ధికి శిక్షణలు దోహదపడతాయని, వాటి ఫలితాలను పక్కాగా అందించాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ సూచించారు.

మెరుగైన విద్యాభివృద్ధికి శిక్షణలు దోహదం
కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌, పక్కన ఏపీసీ స్వామినాయుడు, డీఈవో బ్రహ్మజీరావు

కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

జిల్లాలో ‘టీచింగ్‌ ఎట్‌ రైట్‌ లెవల్‌’ శిక్షణ తరగతులు ప్రారంభం

పాడేరు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): మెరుగైన విద్యాభివృద్ధికి శిక్షణలు దోహదపడతాయని, వాటి ఫలితాలను పక్కాగా అందించాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ సూచించారు. ఉపాధ్యాయులకు ‘టీచింగ్‌ ఎట్‌ రైట్‌ లెవల్‌’ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణాపురం బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో విద్యాప్రమాణాలు మరింతగా మెరుగవ్వాలని, అందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల శిక్షణలను సద్వినియోగం చేసుకుని వాటిని సక్రమంగా అమలు చేస్తూ గిరిజన విద్యార్థుల జీవితాలను చక్కగా తీర్చిదిద్దాలని సూచించారు. విద్యాలయాల్లో బోధనాభ్యాసన, విద్యార్థుల్లో అభ్యాసనా స్థాయిలు పెరగాలన్నారు. మరింత మెరుగైన ఫలితాలను సాధించేలా విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయుల్లో వృత్తి నైపుణ్యాన్ని పెంచాలనే లక్ష్యంతో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 3 నుంచి 10 తరగతుల్లో తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు బోధిస్తున్న అన్ని యాజమాన్యాలకు చెందిన టీచర్లకు రెండు విడతలుగా ఈ నెల 3 నుంచి 11వ తేదీ వరకు ఈ శిక్షణ అందిస్తున్నామన్నారు. జిల్లాలోని 22 మండల కేంద్రాల్లోనూ ఒక విడతకు మూడు రోజులు చొప్పున రెసిడెన్షియల్‌ మోడ్‌లో ఈ శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. మొదటి విడతలో 3,111 మందికి, రెండో విడతలో 3,098 మందికి శిక్షణ అందిస్తున్నారని, ఈ శిక్షణ కార్యక్రమాలకు 128 మంది జిల్లా స్థాయి రీసోర్స్‌ పర్సన్లు, 80 మంది రాష్ట్ర స్థాయి రీసోర్స్‌ పర్సన్లు పని చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్‌ వీఏ స్వామినాయుడు, జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మజీరావు, ఎంఈవోలు మోరి జాన్‌, సీహెచ్‌ సరస్వతి, సీఆర్‌పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 12:29 AM