Share News

పండుగపూట విషాదం

ABN , Publish Date - Oct 22 , 2025 | 01:28 AM

ఆ కుటుంబాల్లో దీపావళి పండగ ఆనందం అంతలోనే ఆవిరైపోయింది.

పండుగపూట విషాదం

పాతగాజువాక జంక్షన్‌లో ఘోర ప్రమాదం

డివైడర్‌ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం

ఇద్దరు యువకులు మృతి

మరొకరికి తీవ్ర గాయాలు

గాజువాక/కూర్మన్నపాలెం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి):

ఆ కుటుంబాల్లో దీపావళి పండగ ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. అప్పటివరకూ బాణసంచా కాల్చుతూ సంబరంగా గడిపిన ఇద్దరు యువకులు తిరిగిరాని లోకాలకు తరలిపోవడం కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ దుర్ఘటన పాతగాజువాక జంక్షన్‌లో సోమవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి.

కూర్మన్నపాలెం సమీప గౌరీనగర్‌కు చెందిన మారేమల్లి అజయ్‌కుమార్‌ (18), వెందుర్తి మనోజ్‌కుమార్‌ (17), కె.మధు (18) సోమవారం దీపావళిని కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. అనంతరం అర్ధరాత్రి 1.30 గంటలకు ద్విచక్ర వాహనంపై కూర్మన్నపాలెం నుంచి నగరం వైపు బయలుదేరారు. అజయ్‌ బైక్‌ను నడుపుతుండగా, మనోజ్‌, మధు వెనుక కూర్చున్నారు. వీరి బైక్‌ పాత గాజువాక జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ ఎగిరి రోడ్డుపై పడిపోయారు. అక్కడే ఉన్న ఆటోడ్రైవర్లు హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అజయ్‌, మనోజ్‌ మృతిచెందారని వైద్యులు ధ్రువీకరించారు. కాగా తీవ్రంగా గాయపడిన మధును కేజీహెచ్‌కు తరలించారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిసింది. కాగా అజయ్‌ ఐటీఐ చదువుతుండగా, మనోజ్‌కుమార్‌ ఐటీఐ మధ్యలో నిలిపివేసి, పనులకు వెళుతున్నాడు. యువకుల మృతితో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

కన్నీరుమున్నీరైన కుటుంబాలు

ఇప్పుడే వస్తామని చెప్పి వెళ్లిన కుమారులు విగత జీవులుగా మారడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చేతికి అందివస్తారన్ననుకున్న కొడుకులు తిరిగిరాని తీరాలకు చేరుకోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం వరహాపురం గ్రామానికి చెందిన అర్జున్‌, లోవలక్ష్మి దంపతులు ఏకైక కుమారుడు అజయ్‌రాజ్‌. వీరి కుటుంబం 87వ వార్డు కాశీపాలెం అపార్టుమెంట్‌లో నివసిస్తోంది. అజయ్‌ ఐటీఐ చదువుతుండగా, అతడి తండ్రి అర్జున్‌ కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో అజయ్‌రాజ్‌ కోళ్ల వ్యాన్‌లో పనిచేస్తూ, తల్లికి అండగా నిలిచి, చెల్లిని ఇంటర్‌ చదివిస్తున్నాడు. అతడి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

కాగా విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బోనంగి గ్రామానికి చెందిన వెందుర్తి మనోజ్‌కుమార్‌ (17) తల్లిదండ్రులు ముత్యాలు, దేముడమ్మ. సుమారు ఏడేళ్ల కిందట నగరానికి వలస వచ్చి అశోక్‌నగర్‌లోని ఓ అపార్టుమెంట్లో వాచ్‌మన్‌గా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. బెహరా కళాశాలలో ఐటీఐ చదువుతున్న మనోజ్‌, తండ్రికి ఆసరాగా నిలిచేందుకు ఏదైనా పనిచేస్తానని చెబుతుండేవాడని కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. మనోజ్‌కు చెల్లి ఉంది. కాగా తీవ్రంగా గాయపడిన మధు తల్లిదండ్రులు అశోక్‌నగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు.

Updated Date - Oct 22 , 2025 | 01:28 AM