పిక్నిక్‌లో విషాదం
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:00 AM
మండలంలోని కల్యాణపులోవ పోతురాజుబాబు గుడి వద్దకు ఆదివారం సహచర కూలీలతో కలిసి పిక్నిక్‌కు వెళ్లిన ఒక యువకుడు జలాశయంలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు.
కల్యాణపులోవ రిజర్వాయర్‌లో స్నానానికి దిగి యువకుడి గల్లంతు
రావికమతం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కల్యాణపులోవ పోతురాజుబాబు గుడి వద్దకు ఆదివారం సహచర కూలీలతో కలిసి పిక్నిక్‌కు వెళ్లిన ఒక యువకుడు జలాశయంలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్లు గాలించినా ఆచూకీ లభించలేదు. దీనికి సంబంధించి కొత్తకోట ఏఎస్‌ఐ సన్యాసిరావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. కొత్తకోట గ్రామం పెద్ద సోఫా వీధికి చెందిన గుమ్ముడు రామారావు, రుక్మిణి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీనివాస్(29) మానసిక దివ్యాంగుడు. అతనికి వివాహం కాలేదు. రెండో కుమారుడు మోహన్‌కు ఇటీవలే వివాహమైంది. కాగా తండ్రి రామారావు రెండేళ్ల క్రితం మృతి చెందాడు. తల్లి రుక్మిణి దివ్యాంగురాలు. కాగా శ్రీనివాస్ గ్రామానికి చెందిన గొర్లె సత్తిబాబు ట్రాక్టర్‌పై డైలీ లేబరుగా పనిచేస్తున్నాడు. అతనితో పాటు ఆ ట్రాక్టర్‌పై పనిచేసే కూలీలు అడ్డూరి శ్రీను, ఉగ్గిన సత్తిబాబు, మట్టా రమణ, ట్రాక్టర్ యజమాని గొర్లె సత్తిబాబు ఆదివారం కల్యాణపులోవ పోతురాజుబాబు గుడి వద్దకు పిక్నిక్‌కు వెళ్లారు. ఉదయం నుంచి వీరంతా సరదాగా గడిపారు. మధ్యాహ్నం భోజనాలు చేశారు. ట్రాక్టర్ యజమాని అక్కడే విశ్రాంతి తీసుకోగా, మిగతా నలుగురు సాయంత్రం నాలుగు గంటల సమయంలో రిజర్వాయర్ వద్దకు స్నానం చేయడానికి వెళ్లారు. వారు జలాశయంలో దిగి స్నానం చేస్తుండగా శ్రీనివాస్ గల్లంతయ్యాడు. అతని కోసం గాలించినా ఆచూకీ లభించకపోవడంతో మిగతా ముగ్గురుపైకి వచ్చేసి ఈ విషయాన్ని ట్రాక్టర్ యజమానికి తెలిపారు. ఆయన వెంటనే శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు, కొత్తకోట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏఎస్‌ఐ సన్యాసిరావు సిబ్బందితో వెంటనే అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. చాలా సేపు గాలించినా శ్రీనివాస్ ఆచూకీ లభించలేదు. చీకటి పడడంతో సోమవారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు చేపడతామని ఏఎస్‌ఐ తెలిపారు. శ్రీనివాస్ తల్లి రుక్మిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.