Share News

గజిబిజి.. గందరగోళం...

ABN , Publish Date - Dec 03 , 2025 | 12:46 AM

నగరంలో ట్రాఫిక్‌ పరిస్థితి అధ్వానంగా తయారైంది. వాహనచోదకుల నిర్లక్ష్యం, విధి నిర్వహణలో కొందరు పోలీసుల అలసత్వం, కొన్నిచోట్ల సిగ్నల్స్‌ పనిచేయకపోవడం...ఇందుకు ప్రధాన కారణాలు.

గజిబిజి.. గందరగోళం...

  • నగరంలో అస్తవ్యస్తంగా ట్రాఫిక్‌

  • వాహన చోదకులకు పట్టని నిబంధనలు

  • సిగ్నల్‌తో సంబంధం లేదన్నట్టు రాకపోకలు

  • ప్రమాదం జరుగుతుందనే స్పృహ లేకుండా రాంగ్‌రూట్‌లో ప్రయాణం

  • విధి నిర్వహణలో కొందరు ట్రాఫిక్‌ పోలీసుల అలసత్వం

  • డ్యూటీని పక్కనపెట్టి సెల్‌ఫోన్‌తో కాలక్షేపం

  • వాహనాల రాకపోకల క్రమబద్ధీకరణను పక్కనపెట్టి ఈ-చలాన్‌ల జారీలోనే ఇంకొందరు నిమగ్నం

  • ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్‌ నియంత్రణకు సరిపోని సిబ్బంది

  • అక్కడక్కడా పనిచేయని సిగ్నల్స్‌

  • ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌లో తేటతెల్లం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో ట్రాఫిక్‌ పరిస్థితి అధ్వానంగా తయారైంది. వాహనచోదకుల నిర్లక్ష్యం, విధి నిర్వహణలో కొందరు పోలీసుల అలసత్వం, కొన్నిచోట్ల సిగ్నల్స్‌ పనిచేయకపోవడం...ఇందుకు ప్రధాన కారణాలు. ఉదయం ఏడు గంటలకు రావాల్సిన ట్రాఫిక్‌ పోలీసులు కొన్నిచోట్ల ఎనిమిది గంటల వరకూ కనిపించడం లేదు. మరికొందరు డ్యూటీపాయింట్‌కు వచ్చినా సెల్‌ఫోన్‌ పట్టుకుని ఏదోఒకచోట కూర్చొని కాలక్షేపం చేస్తున్నారు. దీంతో వన్‌వేలో డ్రైవింగ్‌, సిగ్నల్‌ జంపింగ్‌ సర్వసాధారణంగా మారిపోయాయి. నగరంలో జాతీయ రహదారిపై ఉదయం వేళ ట్రాఫిక్‌ సరళి, సిబ్బంది పనితీరును పరిశీలించేందుకు ‘ఆంధ్రజ్యోతి’ బృందం మంగళవారం పరిశీలించగా అనేక లోపాలు, సమస్యలు బయటపడ్డాయి.

నగరంలో రోజురోజుకీ ట్రాఫిక్‌ సమస్య జఠిలమవుతోంది. వాహనాల సంఖ్య పెరుగుతుండడం, దానికి అనుగుణంగా రోడ్లు విస్తరణకు నోచుకోకపోవడంతో ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ సమస్య నిత్యకృత్యంగా మారింది. ముఖ్యంగా సత్యం జంక్షన్‌, మద్దిలపాలెం, ఇసుకతోట జంక్షన్‌, వెంకోజీపాలెం, హనుమంతవాక, ఎండాడ, కార్‌షెడ్‌, కొమ్మాది జంక్షన్‌లలో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌ పద్మవ్యూహాన్ని తలపిస్తుంది. ఆయా జంక్షన్లలో రెడ్‌సిగ్నల్‌ పడితే వాహనాలు కిలోమీటరు పొడవున ఆగిపోతున్నాయి. ఒక్కొక్కసారి సిగ్నల్‌ దాటడానికి పావుగంట పడుతోంది. దీంతో కొందరు సిగ్నల్‌ జంపింగ్‌కు పాల్పడుతున్నారు. మరికొందరు వన్‌వేలో, రాంగ్‌రూట్‌లో వాహనాన్ని నడుపుతున్నారు. ఇలాంటి వాటన్నింటికీ అడ్డుకట్ట వేసి ట్రాఫిక్‌ నిబంధనలను పక్కగా పాటించేలా చూడాల్సిన ట్రాఫిక్‌ పోలీసుల్లో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వాహనాల రాకపోకలను పట్టించుకోకుండా ఇతర పనుల్లో నిమగ్నమై ఉంటున్నారు.

వేధిస్తున్న సిబ్బంది కొరత

నగరంలో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం, ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడకుండా చర్యలు తీసుకోవడం, నిబంధనలు ఉల్లంఘించే వారికి ఈ-చలాన్‌లను జారీచేయడం వంటి విధులను ట్రాఫిక్‌ సిబ్బంది నిర్వర్తించాల్సి ఉంటుంది. దీనికోసం మద్దిలపాలెం, హనుమంతవాక, పీఎం పాలెం జంక్షన్‌, కార్‌షెడ్‌జంక్షన్‌, కొమ్మాది వంటి కూడళ్లలో కనీసం ఇద్దరు సిబ్బంది అవసరం. కానీ ఆయా కూడళ్ల వద్ద ఒక్కరినే కేటాయిస్తున్నారు. ట్రాఫిక్‌ రోడ్‌ సేఫ్టీ పేరుతో నాలుగైదు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో జాతీయ రహదారిపై పెట్రోలింగ్‌ కోసం కేటాయించే వాహనానికి డ్రైవర్‌ కాకుండా ఇద్దరు సిబ్బంది ఉంటున్నారు. ఆ వాహనంలో సిబ్బంది ఒక్కో కూడలి వద్ద ఆగి అక్కడ ట్రాఫిక్‌ విధులు నిర్వర్తించే కానిస్టేబుల్‌/హోంగార్డుతో ముచ్చట్లు పెట్టుకుని కొంతసేపటి తర్వాత వెళ్లిపోతున్నారు. అలాకాకుండా ప్రధాన కూడలి వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లు/హోంగార్డులను నియమిస్తే సిగ్నల్‌ జంపింగ్‌లకు అడ్డుకట్టపడే అవకాశం ఉంటుంది.

పనిచేయని ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ లైట్లు

నగరంలో చాలాచోట్ల ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పనిచేయడం లేదు. మద్దిలపాలెం కూడలిలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి ద్వారకా బస్‌స్టేషన్‌, జగదాంబ జంక్షన్‌ వైపు వెళ్లే వాహనాల కోసం ఏర్పాటుచేసిన సిగ్నల్స్‌ నెలల తరబడి పనిచేయడంలేదు. అలాగే సీతమ్మధార, బాలయ్యశాస్త్రి లేఅవుట్‌ వైపు నుంచి శంకరమఠం వైపు వెళ్లేవారి కోసం జాతీయ రహదారిపై ఫోర్త్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పక్కన పెట్రోల్‌బంకు వద్ద ఏర్పాటుచేసిన ట్రాఫిక్‌ సిగ్నల్‌ పనిచేయడం లేదు. దీనివల్ల అటువైపు నుంచి శంకరమఠం వైపు వెళ్లే వాహనచోదకులు ఎప్పుడు ఆగాలో, ఎప్పుడు ముందుకువెళ్లాలో తెలియక ఇష్టారాజ్యంగా ముందుకు వెళ్లిపోతున్నారు. దీనివల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సిగ్నల్స్‌ పనిచేయడం లేదని అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

విధి నిర్వహణలో అలసత్వం

ట్రాఫిక్‌ విధులు నిర్వర్తించే పోలీసులు, హోంగార్డులు ప్రతిరోజూ ఉదయం ఏడు గంటలకు తమకు కేటాయించిన పాయింట్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. కూడలిలో ట్రాఫిక్‌ అంబరిల్లా ఉన్నట్టయితే కూర్చొని, అది లేనిపక్షంలో కూడలి మధ్యలో నిలబడి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలి. సిగ్నల్‌ను బట్టి వాహనాలను నడిపేలా చూడడంతోపాటు, నిబంధనలు ఉల్లంఘించే వారిని సెల్‌ఫోన్‌తో ఫొటో తీసి ఈ-చాలాన్‌ జారీచేయాల్సి ఉంటుంది. అయితే కొమ్మాది నుంచి అక్కయ్యపాలెం పోర్టు ఆస్పత్రి జంక్షన్‌ వరకు ట్రాఫిక్‌ విధుల్లో ఉన్నవారిలో మంగళవారం ఒకరిద్దరు తప్పితే ఎవరూ ఉదయం ఏడు గంటలకు విధులకు హాజరుకాలేదు. కొందరు ఏడున్నర గంటలకు, మరికొందరు ఎనిమిది గంటల సమయంలో తమ పాయింట్‌కు చేరుకున్నారు.

సెల్‌ఫోన్‌తోనే అత్యధికులు కాలక్షేపం

కొందరు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణను పక్కనపెట్టేసి సెల్‌ఫోన్‌ పట్టుకుని రీల్స్‌, ఫేస్‌బుక్‌ చూసుకుంటూ కాలక్షేపం చేశారు. మరికొందరు రోడ్డు మధ్యలో నిలబడి సిగ్నల్‌కు అనుగుణంగా వాహనాలు ముందుకు కదలేలా చూడడం మానేసి పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్‌ల వసూళ్లపైనే నిమగ్నమయ్యారు.

యథేచ్ఛగా ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ జంపింగ్‌

కూడళ్లలో వాహన చోదకులు కొందరు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను పాటించకుండా ఇష్టారాజ్యంగా ముందుకువెళ్లిపోతున్నారు. సిగ్నల్‌ జంపింగ్‌ వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా, ఆ విషయం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సమీపంలో ఉన్న పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేయకపోవడం విశేషం.

ట్రాఫిక్‌ నిబంధనల పట్ల వాహన చోదకుల్లో నిర్లక్ష్యం

భద్రత కోసమే ట్రాఫిక్‌ నిబంధనలను ఏర్పాటుచేశారనే స్పృహ చాలామంది వాహన చోదకులలో ఉండడం లేదు. కొద్దిదూరమే కదా?...ఏమీ కాదులే అనే నిర్లక్ష్యంతో రాంగ్‌రూట్‌/వన్‌వేలో వాహనాన్ని నడపడం, సిగ్నల్‌ జంపింగ్‌లకు పాల్పడడం చేస్తున్నారు. ప్రమాదాలను చేతులారా కొనితెచ్చుకోవడమే కాకుండా ఎదుటివారిని కూడా అందులోకి నెడుతున్నారు.

గజిబిజి... హనుమంతవాక కూడలి

హనుమంతవాక కూడలిలో ట్రాఫిక్‌ మొత్తం గజిబిజిగా ఉంటోంది. రెడ్‌ సిగ్నల్‌ పడినా ఆర్టీసీ, కళాశాలల బస్సులు, ఇతర భారీవాహనాలు ఆగడం లేదు. ద్విచక్ర వాహనాల పరిస్థితి మరీ దారుణం. కాగా ఉన్న ట్రాఫిక్‌ సిబ్బంది కూడా చలానాలు రాసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. సెల్‌ఫోన్లలో ఫొటోలు తీయడంపైనే దృష్టిసారిస్తున్నారు. వీఐపీలు వచ్చే సందర్భంలో మినహా రోడ్లపై ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు పెద్దగా కనిపించడం లేదు.

Updated Date - Dec 03 , 2025 | 12:46 AM