సంప్రదాయ అటవీ ఉత్పత్తులు కనుమరుగు
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:21 AM
జిల్లాలో సంప్రదాయ పంటలు క్రమేపీ కనుమరుగవుతున్నాయి. దీంతో సహజసిద్ధంగా లభించే ఉసిరి, నరమామిడి, కోవెల జిగురు, కొండ చీపుళ్లు, తేనె, అడ్డాకులు వంటి అటవీ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి.
తగ్గిపోతున్న ఉసిరి, నరమామిడి, కోవెల జిగురు, కొండ చీపుళ్లు, అడ్డాకులు
అతిథి పంటలైన కాఫీ, మిరియాలుకు ప్రభుత్వ ప్రోత్సాహం
నిర్లక్ష్యానికి గురవుతున్న సహజసిద్ధ ఉత్పత్తులు
కొయ్యూరు, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సంప్రదాయ పంటలు క్రమేపీ కనుమరుగవుతున్నాయి. దీంతో సహజసిద్ధంగా లభించే ఉసిరి, నరమామిడి, కోవెల జిగురు, కొండ చీపుళ్లు, తేనె, అడ్డాకులు వంటి అటవీ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వం సంప్రదాయ పంటలను ప్రోత్సహించకపోతే భవిష్యత్తు తరాలకు వీటి గురించి తెలిసే అవకాశమే ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మన్యం పేరు చెప్పగానే కాఫీ, మిరియాలు, తేనె, అరుదైన పండ్ల జాతులు గుర్తుకు వస్తాయి. వాస్తవానికి కాఫీ, మిరియాలు వంటి పంటలు మన్యానికి చెందినవి కావు. కేవలం అతిథి పంటలుగానే పరిచయమయ్యాయి. సంప్రదాయేతర పంట అయినప్పటికీ కాఫీ సాగు మన్యానికి అనుకూలంగా ఉండడంతో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. అలాగే మిరియాల సాగు కూడా పెరుగుతోంది. అయితే సహజసిద్ధంగా లభించే ఉసిరి, నరమామిడి, కోవెల జిగురు, కొండ చీపుళ్లు, తేనె, అడ్డాకులు వంటి ఉత్పత్తులు క్రమేపీ కనుమరుగవుతున్నాయి.
కనుమరుగవుతున్న వనాలు
అంతరించిపోతున్న వనాల్లో కోవెల జిగురు ఉంది. వివిధ రకాల మందుల తయారీకి ఎక్కువగా వినియోగించే కోవెల జిగురు కిలో ధర రకాన్ని బట్టి రూ.300 నుంచి రూ.500 మధ్యలో పలుకుతుంది. గతంలో సుమారు దశాబ్దం క్రితం వరకు ఎక్కడ చూసిన అధికంగా కనిపించే కోవెల జిగురు వనాలు రోజు రోజుకు తగ్గిపోయి ప్రస్తుతం అరుదుగా కనిపిస్తున్నాయి. కోవెల వనాల నుంచి జిగురు తీసే విధానంపై అవగాహన లేకపోవడంతో సేకరించే వారు చెట్లను నరికి వేయడంతో అంతరించే స్థితికి చేరుకుంది. నరమామిడి చెట్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ చెట్లు అగరబత్తి పరిశ్రమల్లో ముడిసరుకుగా, అలాగే వివిధ రకాల ఔషధాల తయారీకి ఉపయోగపడతాయి. నరమామిడి చెక్క మార్కెట్‌లో నాణ్యతను బట్టి కిలో రూ.50 నుంచి రూ.100 మధ్యలో పలుకుతుంది. ఈ చెక్కల కోసం చెట్లను పూర్తిగా నరికి వేయడంతో ఈ వనాల సంఖ్య తగ్గింది. అలాగే మన్యంలో గాలి కొండచీపుర్లకు ఒక ప్రత్యేకత ఉంది. కొన్నాళ్ల క్రితం వారపు సంతల్లో గాలి కొండచీపుర్లు విరివిగా దొరికేవి. కొండచీపుర్ల సాగు విపరీతంగా తగ్గిపోవడంతో వాటి డిమాండ్ పెరిగింది. ఒక్కొక్క చీపురు రూ.100 నుంచి రూ.150 పలుకుతుండడం, పోడు వ్యవసాయం కారణంగా అడవుల విస్తీర్ణం తగ్గిపోతుండడంతో వాటి ప్రభావం చీపుర్లపై పడింది. అడ్డాకులు, కరక్కాయలు, నల్లజీడి ఇంచుమించుగా కనుమరుగయ్యాయి. ఒకప్పుడు అటవీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ గిరిజనులకు అవగాహన కల్పించకపోవడంతో వీటిపై వచ్చే ఆదాయానికి గండి పడింది. కాగా చింతపండు, కాగుపప్పు, విప్పపప్పు, తప్సిజిగురు(బంక), శీకాయ, కుంకుడుకాయలు, తానికాయలు, మారేడుగెడ్డలు, ముషిడిపిక్కలు, మైనం, అండుగ జిగురు, పాతాలగరిడి వంటి అటవీ ఉత్పత్తులు కూడా పూర్తిగా కనుమరుగయ్యాయి.
తగ్గిన తేనె ఉత్పత్తి
గిరిజన సహకార సంస్థ(జీసీసీ) మొత్తం వ్యాపారంలో 40 శాతం వాటా తేనెదే. మన్యం వ్యాప్తంగా కొనుగోలు చేసిన తేనెను రాజమహేంద్రవరం, చిత్తూరు కేంద్రాల్లో శుద్ధి చేసి రిటైల్ మార్కెట్‌లో గిరిజన హనీ పేరిట జీసీసీ విక్రయిస్తోంది. కేవలం పాడేరు డివిజన్ పరిధిలో గల 11 మండలాల నుంచి ఒకప్పుడు మూడు వేల టన్నుల నుంచి ఐదు వేల టన్నుల వరకు తేనె దిగుబడి వచ్చేది. ప్రస్తుతం తేనె పట్టుకు తేనె సమకూర్చే రాణీ ఈగ సంతతి తగ్గిపోవడంతో 500 టన్నులు కూడా రావడం లేదు. సేకరించిన కొద్దిపాటి తేనెను గిరిజనులు తమ అవసరాలకు ఉంచుకుంటున్నారు. దీంతో జీసీసీకి తేనె లభ్యత తగ్గింది. ఇప్పటికైనా ప్రభుత్వం సంప్రదాయ పంటలు, అటవీ ఫలసాయాలను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.