ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:33 AM
మండలంలోని విస్సన్నపేట గ్రామానికి చెందిన కన్నంరెడ్డి సత్తిబాబుకు ట్రాక్టర్ వుంది. దుక్కి దున్నడం, దమ్ము చేయడం, వరి నూర్పులు వంటిపనులతోపాటు భవన నిర్మాణ సామగ్రిని రవాణా చేస్తూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు.
దుక్కి దున్నుతుండగా ఘటన
కశింకోట, జూలై 29 (ఆంధ్రజ్యోతి): పొలంలో దుక్కి దున్నతుండగా ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ కె.లక్ష్మణరావు తెలిపిన వివరాలిలా వున్నాయి.
మండలంలోని విస్సన్నపేట గ్రామానికి చెందిన కన్నంరెడ్డి సత్తిబాబుకు ట్రాక్టర్ వుంది. దుక్కి దున్నడం, దమ్ము చేయడం, వరి నూర్పులు వంటిపనులతోపాటు భవన నిర్మాణ సామగ్రిని రవాణా చేస్తూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం గ్రామానికి చెందిన ఒక రైతు పొలంలో దుక్కి దున్నడానికి వెళ్లాడు. సాయంత్రం 5.45 గంటల సమయంలో మట్టి దిబ్బను ఎక్కించే క్రమంలో ట్రాక్టర్ బోల్తాపడింది. సత్తాబాబుపై ఇంజన్ పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలో వున్నరైతులు గమనించి, వెంటనే ఆటోలో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. సత్తిబాబుకు భార్య మోహిని, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.