నక్కపల్లిలో టాయ్ పార్క్
ABN , Publish Date - Nov 14 , 2025 | 01:04 AM
నక్కపల్లి మండలంలో మరో భారీ కంపెనీ ఏర్పాటు కానున్నది. పిల్లలు ఆడుకునే వివిధ రకాల బొమ్మల తయారీ పరిశ్రమ కోసం 1,054 ఎకరాలు అవసరమని అధికారులు నిర్ధారించారు. దీనిని ఎన్.నర్సాపురం, బుచ్చిరాజుపేట, నల్లమట్టిపాలెం, ఉపమాక, పరిసర గ్రామాల్లో ఏర్పాటు చేసే అవకాశం వుందని సమాచారం.
ఎకోసిస్టమ్‌తో బొమ్మల తయారీ యూనిట్లు
1,054 ఎకరాలు అవసరమని గుర్తింపు
20 వేల మంది మహిళలకు ఉపాధి
విశాఖ సీఐఐ సదస్సులో ఎంఓయూ చేసుకునే అవకాశం
నక్కపల్లి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): నక్కపల్లి మండలంలో మరో భారీ కంపెనీ ఏర్పాటు కానున్నది. పిల్లలు ఆడుకునే వివిధ రకాల బొమ్మల తయారీ పరిశ్రమ కోసం 1,054 ఎకరాలు అవసరమని అధికారులు నిర్ధారించారు. దీనిని ఎన్.నర్సాపురం, బుచ్చిరాజుపేట, నల్లమట్టిపాలెం, ఉపమాక, పరిసర గ్రామాల్లో ఏర్పాటు చేసే అవకాశం వుందని సమాచారం. చైనా తరహాలో ఎకోసిస్టమ్‌తో బొమ్మల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసి వీటిల్లో సుమారు 20 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో ప్రభుత్వం వుంది. కాలుష్యరహిత పరిశ్రమ కావడంతో ప్రభుత్వం సుముఖంగా వున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి కలెక్టర్ విజయకృష్ణన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌తో హోం మంత్రి అనిత పలుమార్లు చర్చించారు. శుక్ర, శనివారాల్లో విశాఖలో జరగనున్న సీఐఐ పెట్టుబడిదారుల సదస్సులో ‘టాయ్ పార్క్’ ఏర్పాటుపై ఒప్పందం జరగనున్నట్టు అధికారులు చెబుతున్నారు.